మిజోరాం రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పాఠశాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఐజ్వాల్, లుంగ్లీ, హ్నాథియల్, మమిత్ జిల్లాల్లో కుండపోత వర్షం పడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని అన్ని పాఠశాలలు మూసివేయాలని జిల్లాల యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. బుధవారం వర్షం కారణంగా ఐజ్వాల్ పట్టణం, దాని చుట్టుపక్కల గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయని, ఇలాంటి ఘటనలే ఆ జిల్లాలో చోటు చేసుకునే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగానికి జారీ చేసిన నోటీసులో ప్రభుత్వం పేర్కొంది. ఐజ్వాల్‌తోపాటు, ఇతర ప్రాంతాల్లో బుధవారం కురిసిన భారీ వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం వల్ల రోడ్లన్నీ మూసుకుపోయాయి. వాటిని క్లియర్ చేస్తున్నామని, ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు ప్రకృతి విపత్తుల వల్ల 42 మంది మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ పునరావాస శాఖ తెలిపింది.
కాగా, గతవారం ఐజ్వాల్, కొలాసిబ్ జిల్లాలలో వరుసగా ఐదు రోజులు, దక్షిణ మిజోరంలోని సియాహా జిల్లాలో కొన్నిరోజులు భారీ వర్షం కారణంగా పాఠశాలలు మూసివేయడం జరిగింది. ఈ నెల 20న కురిసిన భారీ వర్షానికి మిజోరాం రాష్ట్రంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.