కోల్‌కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ట్రామ్ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. కోల్‌కతా మహానగరంలో 150 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రామ్ సేవలు ఇక కనిపించవు. దేశంలో ప్రస్తుతం ఈ ఒక్క నగరంలో ట్రామ్ రవాణా సదుపాయం ఉండగా, త్వరలో నిలిపివేస్తామని మంత్రి స్నేహాశీష్ చక్రబర్తి తెలిపారు. నగరంలో పరిమిత వేగంతో ప్రయాణించే ట్రామ్ల వల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. 1873లో గుర్రాలతో నడిచే ట్రామ్ లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఎన్నో మార్పులతో ఇవి కోల్‌కతా వారసత్వ సంపదలో భాగమయ్యాయి. రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ రోజుల్లో రోడ్లపై వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. నెమ్మదిగా నడిచే ట్రామ్‌ల కారణంగా రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే వీటి సేవలను నిలిపివేయాలని నిర్ణయించాం్ణ్ణ అని మంత్రి వెల్లడించారు. అయితే, మైదాన్- ఎస్‌ప్లనేడ్ మార్గంలో మాత్రం కొంతకాలం పాటు వీటిని కొనసాగిస్తామని తెలిపారు.
కోల్‌కతాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రామ్ సర్వీసు గతేడాదితో 150 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఒకప్పుడు కోల్‌కతాలో ఎక్కడ చూసినా కన్పించే ఈ రైలుబండ్లుౌ క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో వీటి నిర్వహణపై కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగాౌ గతేడాది డిసెంబరులో దీనిపై విచారణ జరిగింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ట్రామ్‌కార్ సేవలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది.
ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం వీటికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసేందుకు ట్రామ్ లవర్స్ సిద్ధమవుతున్నారు.