కంగనా రనౌత్ పై నిప్పులు చెరిగిన రాబర్ట్ వాద్రా
రైతుల ఆందోళనలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. కంగనకు పార్లమెంటులో ఉండే కనీస అర్హత కూడా లేదని ఆయన అన్నారు. ఒక మహిళగా కంగనను తాను గౌరవిస్తానని… కానీ ఎంపీగా ఉండే అర్హత మాత్రం ఆమెకు లేదని చెప్పారు. ఆమె ఎప్పుడూ ఆమె గురించి మాత్రమే ఆలోచిస్తుందని… మహిళల గురించి కూడా ఆమె ఆలోచించాలని అన్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడుతూ… రైతుల ఉద్యమం వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. బంగ్లాదేశ్ వంటి పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నం జరిగి ఉండొచ్చని… కానీ మన దేశ బలమైన నాయకత్వం కారణంగా అది జరగలేదని చెప్పారు. రైతుల ఉద్యమం పేరుతో హింస చెలరేగిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై రాబర్ట్ వాద్రా కూడా విమర్శలు గుప్పించారు.