ఇటీవలనే 12 ఏళ్ల బాలిక ఒకరు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణ పోలీసులకు ఒక ఫిర్యాదుచేసింది. ‘మా నాన్న తాగివచ్చి నన్ను కొడు తున్నాడు’’ అనేది ఆ ఫిర్యాదు సారాంశం. మానసికంగా హింసిస్తున్నాడని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత చచ్చిపోవాలని వుందని ఒక టీవీ ఛానల్‌కు చెప్పిన విషయం గమనార్హం. ఇది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. హక్కులకు భంగం కలిగినప్పుడు తండ్రి అయినా, తల్లి అయినా ఫిర్యాదు చేసే హక్కు ఒక బిడ్డకు సైతం ఉంటుంది. కొన్ని నెలల క్రితం ప్రచురితమైన ఒక వార్త ప్రకారం, ఓ వ్యక్తి (బాబాయి) తన తమ్ముడు కూతురుపై అత్యాచారం చేశాడు. గర్భంరావడంతో ఈ విషయం బయటపడిరది. కొన్నిగంటలక్రితం దేశ రాజధానిలో తొమ్మిదేళ్ల బాలికను ఒక కాటికాపరితో సహా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారంచేసి, దారుణంగా హత్యచేసి, తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్భయ లాంటి కేసులు గత కొన్నేళ్లుగా లెక్కలేనన్ని నమోదవు తూనే వున్నాయి. ఇవన్నీ పిల్లలపై భౌతికంగా జరిగిన దాడులు. ఇవిగాకుండా, వారిని మానసికంగా హింసిస్తున్న ఘటనలు కోకొల్లలు.
మానసికహింస భరించలేక పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 20172019 కాలంలో 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన 24 వేలమందికి పైగా చిన్నారులు ప్రాణాలు తీసుకున్న విషాద ఘటనలు సంభవించాయి. వాటిలో 4 వేలకు పైగా కేసుల్లో పరీక్షల్లో వైఫల్యమే కారణంగా కనిపిస్తోందని ఈ మధ్యనే చిన్నారుల ఆత్మహత్యలపై పార్లమెంటులో ప్రవేశపెట్టిన జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడిరచింది. కరోనాకు ముందు రెండేళ్ల కాలంలో 14
18 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 13,325 మంది బాలికలు సహా 24,568 మందికి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2017లో ఇదే వయస్సువారు 8,029 మందికి పైగా బలవన్మరణంపొందారు. 2018లో ఈ సంఖ్య 8,162కు పెరిగింది. ఇక 2019లో 8,377కు చేరింది. ఈ వయస్సులో పిల్లల్లో అత్యధికంగా ఆత్మహత్యలు మధ్య ప్రదేశ్‌లో 3,115, పశ్చిమ బెంగాల్‌లో 2,802, మహారాష్ట్రలో 2,527, తమిళనాడులో 2,035సంభవించాయి. 4,046మంది చిన్నారుల ఆత్మహత్యకు పరీక్షలో వైఫల్యమే కారణమని తేలింది. ఇక ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కారణాల వల్ల దాదాపు 3,315 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. 2,567మంది పిల్లల ఆత్మహత్య వెనుక అనారోగ్యం కారణంగా ఉంది. 81 మంది పిల్లల మరణానికి శారీరక హింస కారణం. ప్రియమైనవ్యక్తి మరణం, మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా మద్యపానం, చట్టవిరుద్ధ మైన గర్భం, సామాజిక చిన్నచూపు, నిరుద్యోగం, పేదరికం, సైద్ధాంతిక కారణాలు లేదా హీరో ఆరాధన ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి ఇతర కారణాలుగా ఉన్నాయి. 411 మంది బాలికలతో సహా 639 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి వివాహానికి సంబంధించిన సమస్య కారణమని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది.
దేశంలో పిల్లలహక్కులను విపరీతంగా కాలరాస్తున్నారు. ముఖ్యంగా 8 శాతం మంది బాలికలకు హక్కులు మృగ్యమవుతున్నాయని రెండేళ్ల క్రితం వెలువడిన ఒక నివేదిక పేర్కొంది. మహిళలకు భద్రత హక్కు కొరవడిన విషయం అందరికీ తెల్సిందే. అందులో బాలికల్లో అభద్రతా భావం మరీ ఎక్కువైంది. పిల్లలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల అమలు అంతంత మాత్రమేనని తెలుస్తున్నది. లైంగిక వేధింపులు, శారీరక హింస పట్ల ఎక్కువగా ఆందోళన వ్యక్తమవుతున్నది. 2017 జులై 4న సిమ్లా (హిమాచల్‌ప్రదేశ్)లో ఒక బాలిక స్కూలు నుంచి తిరిగి వస్తుండగా 28ఏళ్ల వ్యక్తి అమెను బలవంతంగా అడవుల్లోకి లాక్కుపోయి, అత్యాచారం చేసి, హత్యచేశాడు. గుడియా కేసుగా పేరుగాంచిన ఈ కేసులో రెండు నెలల క్రితమే నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడిరది. గడిచిన పదేళ్లలో పెద్దపెద్ద కేసులు బయటపడ్డాయి. సుజెట్ జోర్డాన్ గ్యాంగ్‌రేప్ కేసు (కోల్‌కతా, 2012 ఫిబ్రవరి 5), నిర్భయ రేప్ కేసు (2012, దిల్లీ), కథువా రేప్ కేసు (2018 జనవరి, జమ్మూకశ్మీర్), ఉన్నావో రేప్ కేసు (2017 జూన్ 4, ఉత్తరప్రదేశ్), బదౌన్ రేప్ కేసు (2014 మే 27, ఉత్తరప్రదేశ్) వంటి కేసుల్లో బాధితులు లేదా మృతులు మైనర్ బాలికలే. పోక్సోకోర్టులు, నిర్భయచట్టం వచ్చిన తర్వాత మైనర్లపై రేప్‌కేసులు తగ్గకపోగా మరింతఎక్కువయ్యాయి. వివిధరంగాల్లో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని పురుషులకు ధీటుగా ముందుకు సాగి పోతున్నారు. ఎటొచ్చీ భద్రతవిషయంలో నూటికి నూరుశాతం సమస్యలను చవిచూడాల్సి వస్తున్నది. జీవిత నైపుణ్య శిక్షణలో భద్రత అంశాన్ని కూడా చేర్చి, దీన్ని పాఠశాల స్థాయి నుంచే బాలికలకు వర్తింపజేయాలి. అలాగే ప్రభుత్వాల ఆరోగ్యఅజెండాలో మానసికరోగాలనుకూడా చేర్చాలి. కౌమార దశలో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటే సామాజిక శ్రేయస్సు కష్టసాధ్యమే అవుతుంది. తద్వారా పిల్లలకు ముఖ్యంగా బాలికలకు భద్రత దొరుకు తుంది. తల్లితండ్రుల నుంచి రక్షణ కల్పించండంటూ పిల్లలు ఫిర్యాదు చేసే పరిస్థితికి సమాజం దిగజారకూడదు. బాలల హక్కులను కాపాడే రీతిలో రాజ్యాంగం, నిర్భయ వంటి చట్టాలను కూడా సజావుగా అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా వుండాలి.