చింతపట్ల సుదర్శన్
మాంసం కొట్టు ముందు వెనకకాళ్ళ మీద కూచునుంది డాగీ. షాపువాడూ ఏక్షణమైనా ఓ ఎముక విసిరేయక పోడు అని వెయిట్ చేస్తు న్నది. చుట్టుపక్కల మరో వీధి కుక్కేదీ కనపడక పోవటంతో ఆనందంగా కూడా ఉంది. నిరీక్షణ ఫలించింది. షాపులో నుంచి ఒక ఎముక ఎగిరొచ్చి దాగీ ముందు పడ్నే పడిరది. ‘మన కెవ్వరు సాటి` లేరెవ్వరు పోటీ’ అనుకుంటూ అడుగు దూరంలో పడ్డ దాని కోసం అడుగు కదిలిం చింది వీలైనంత ‘స్లో ’గా. అనుకోనిది జరగడమేకదా లోక రివాజు. డాగీ పక్కనుంచి వేగంగా ముందుకు కదిలి ఒకే ఒక్క జంపు చేసి ఎముకను అందుకుని అదే వేగంతో వెనక్కు పరుగెత్తింది మరో ‘స్ట్రీట్ డాగ్’. ‘షాక్ ‘ నుంచి తేరుకుని దాని వెనకే పరుగెత్తింది డాగీ. కొంచెం దూరం పరుగెత్తిన ‘స్ట్రీట్ డాగ్’ ఆగింది. వెనక్కి తిరిగింది. ఎముకను నోట్లో నుంచి కింద పడేసి, దాన్ని ముందు కాలితో తొక్కిపట్టి నోటిలో పళ్ళన్నీ బయటపెట్టి గుర్రుమంది. చేసేదంతా చేసి గుర్రు మంటున్నావ్. ఇదేం న్యాయం, ఇదేం ధర్మం. షాప్ ముందు కూచుని ‘ వెయిట్’ చేసింది నేను. ఎక్కడ్నించో వచ్చి నా నోటికాడి కూడు లాక్కుంది నువ్వు. పార్టీలో పాతుకుపోయి సేవచేసిన వాడ్ని కాదని మరో పార్టీలో నుంచి దూకిన వాడికి సీటుకు టిక్కెట్టు దొరికినట్టు, నీకా ఎముక దొరికింది. న్యాయంగా అది నాది అంది డాగీ. పాలిటిక్స్ నాకర్థం కావు. ఆ విషయాలు నీకూ, నీ డాంకీ ఫ్రెండ్‌కే అర్థమవుతాయి. నేను మామూలు వీధి కుక్కను. మనుషుల భాషరాదు, నీకున్న తెలివీ లేదు అంది అవతలి కుక్క. మాటలొద్దు. నువ్వు చేసింది చీటింగ్ అని ఒప్పేసుకో అంది డాగీ. అసలు విషయం తెలీదునీకు. నేను నీకన్నా ముందే వచ్చి, కరెంట్ పోల్ వెనక్కూచున్నాను. చాలాసేపట్నించి. షాపువాడు నన్ను చూశాడు. ఉండు కాస్సేపు ఆగు అన్నట్టుంది ఆచూపు. ఇంతట్లో నువ్వు వచ్చావు. నేను కూచున్నది చూడకుండా నాలుగడుగులు ముందుకెళ్ళావు. నిజానికి షాపువాడు ముందు చూసింది నన్ను. ఈ ఎముక నావైపే విసిరాడు. అయితే తను ‘ఫాస్ట్ బౌలింగ్’ తెలీక ‘స్పిన్’ వేశాడు. అది నాముందుకు రాక నీముందు వచ్చిపడిరది అంతే అంది స్ట్రీట్ డాగ్. అవునా! నువ్వు చెప్పేది నిజమేనా అంది డాగీ.. నీకూ డాంకీకి ఉన్న దోస్తీ మీద ఒట్టు అంది అవతలిది. నువ్వన్నది నిజమైతే అయాం సారీ అంది డాగీ. ఆ తర్వాత మళ్లీ షాపు ముందుకు వెళ్ళి కూచుంది తన అదృష్టాన్ని పరీక్షించుకోటానికి.
అరుగు ఎక్కిన డాంకీకి గోడ వారన రెస్టు తీసుకుంటున్న డాగీ కనిపించింది. ఏంటి ‘బ్రో’ తొందరగా వచ్చేశావు అంటూ తన జాగాలోకి వెళ్ళి కూచుంది డాంకీ. ఎవ్రీథింగ్ ఓకే. కాకపోతే చిన్న ‘మిస్ అండర్ స్టాండిరగ్’ అంతే. ఏమిటో అది అంది డాంకీ చెవులు ఎగరేస్తూ. ఏం లేదు. సింపుల్. నేను షాపు ముందు కూచున్నా. నావెనకే స్తంభం వెనుక మరో ఫ్రెండ్ ఉన్నాడన్నది చూసుకోలేదు. షాపువాడు నాకు వేశా డనుకున్న ఎముక నాకు కాదు, దానికి. ఎందుకంటే అది నాకంటే ముందు అక్కడ కూచుంది. షాపువాడు దాన్ని ముందు చూశాడు కనుక ఎముక దానికి విసిరేశాడు. నాదనుకుని జగడానికి వెళ్ళా. అర్థమయ్యేక వెనక్కి మళ్లా అంది డాగీ. నువ్వు చెప్పేది వింటే మహాభారతం గుర్తుకు వస్తున్నది. యుద్ధంలో సాయం అడగడానికి అర్జునుడూ, దుర్యోధనుడూ వెళ్లార్ట. కృష్ణుడు అర్జునుడ్ని ముందు చూశాడు కనుక అతనికే సాయం చేస్తానన్నాట్ట. అబ్బో ఈ మాత్రం దానికి మహాభారతం దాకా వెళ్ళి పోయేవా? ఇంత నాలెడ్జ్ ఉందా నీకు. ఇది నా నాలెడ్జి కాదు మన సంగతులు రాస్తున్న ‘సుదర్శన్’ అనే వాడి బుర్రలోంచి నాబుర్రలోకి ‘ట్రాన్స్‌ఫర్’ చేసిన విషయమే ఇది అంది డాంకీ. ఊరికే ఏవిషయమూ నీ బుర్రలోకీ నా బుర్రలోకీ జొప్పించడు కదా అంది డాగీ. ఎలెక్షన్లు వస్తున్నాయి కదా! రాజకీయ అవసరాలకు ‘దోస్త్ మేరా దోస్త్’ అంటూ ‘పొత్తు’ కోసం పొర్లు దండాలు పెడుతూ మనోళ్ళు అయినను ‘పోయి రావలె హస్తినకు’ అని పరుగులు పెడ్తున్నారు. ఇందు నిమిత్తం ఓ బాస్ ఇదివరకే ఓ విమానం ఓ హెలికాప్టర్ ఉన్నా మరో రెండు ‘డబుల్ ఇంజన్ చాపర్స్’ సిద్ధం చేసుకున్నాడు ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా వెళ్ళిపోడానికి పొత్తు కోసమూ, అవసరార్థం స్నేహం కోసమూ రాష్ట్రంలో అన్ని పార్టీల వాళ్ళూ అర్రులు చాస్తున్నారు అంది డారికీ. అవునవును కుటుంబాలకు ‘నియంత్రణ’ అవసరం కానీ పార్టీలకు కాదు. ఎంత మంది ఎక్కువైతే అంత మంచి పొత్తు అంటున్నారు, పైవాళ్ళు అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. ఎవరి అవసరాలు వాళ్ళవి. కేసుల బాధ తప్పడానికి ఒకరు పగటి పూట ‘పొత్తు’ కు పోతే, నవశకానికి నాంది అంటూ జమిలిగా రాత్రి పూట మరో ఇద్దరు ‘పొత్తు’ దర్శనాలకు వెళ్ళా రట గదా అంది డాంకీ. ఈ పొత్తు, సర్దుబాట్లు, బేరసారాలలో టికెట్టు దొరకని వాళ్ళు. అరికాళ్ళ కింద మంటలురేగి పొయ్యిలోంచి పెనం మీదకి, పెనం మీది నుంచి పొయ్యిలోకి దూకడాన్ని ‘సర్కసు’ చూసినట్టు చూడొచ్చునన్నమాట అంది డాగీ.
ఎన్నికల దాకా ఎన్నిరకాల ఎంటర్టైన్మెంట్లో జనానికి. ఇంతకీ ‘మెగా డిఎస్సీ’ ఏమైనది అంది డాంకీ. ఏమౌతుంది ‘దగా డీఎస్సీ’ అంటున్నారు అంటూ నిట్టూర్చాడు అబ్బాయి. అచ్ఛేదిన్… అచ్ఛేదిన్… అంటారు గదా, అవంటూ ఉంటయా? వస్తయా? అసలు అచ్ఛేదిన్’ ఎవరికొస్తయి అంది డాంకీ. ఇంకెవరికి? అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడయినా ఏలిన వారికే తప్ప ఎన్నుకునే వారికి రావు అంది డాగీ.