డి.సోమ సుందర్
బొడ్డపాడు గ్రామం శ్రీకాకుళం సాయుధ పోరాటానికి గుండెకాయ లాంటిది! నక్సల్బరీ వసంతకాల మేఘ గర్జనకు ఆంధ్రాలో వచ్చిన ప్రతిస్పందనే శ్రీకాకుళం సాయుధ పోరాటం! స్థానిక సమస్యల పరిష్కారంకోసం మొదలైన శ్రీకాకుళ పోరాటం ఒక జాతీయస్థాయి సాయుధ పోరాటంలో భాగంగా మారడం అప్పట్లో ఒక పెద్ద విశేషమే! పంచాది కృష్ణమూర్తి, తామాడ గణపతి, సుబ్బారావు పాణిగ్రాహి, పంచాది నిర్మల, పోతనపల్లి అప్పారావు, పైలా వాసుదేవరావు వంటి అమరుల పేర్లన్నీ బొడ్డపాడు గ్రామంతో ముడిపడినవే! సాయుధ పోరాటంలో అత్యధిక సంఖ్యలో విప్లవకారులు అమరులైన గ్రామాల్లో బొడ్డపాడు ఒకటి! కమ్యూనిస్టు విప్లవకారులు అప్పట్లో బొడ్డపాడును ‘‘స్టాలిన్ గ్రాడ్’’ అని పిలుచుకునేవారు! శివాలయం పూజారిగా జీవితాన్ని కొనసాగిస్తూ కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చి, ఆ తర్వాత విప్లవ రాజకీయాల్లో కీలకనేతగా రూపొందిన కవి, గాయకుడు, ప్రజా సాంస్కృతిక యోధుడు అమరజీవి సుబ్బారావు ప్రాణిగ్రాహి కూడా బొడ్డపాడు వాస్తవ్యులే!
‘‘ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికంటే నయం, నయం’’ ‘‘కమ్యూనిస్టులం మేం కష్టజీవులం, అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’’, ‘‘ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్ సెల్యూట్’’ ‘‘కూలీనాలీ పేద జనం, ఒక్కొక్కరు అగ్నికణం, సింహ కంఠనాదంతో వస్తారిక కాచుకోండి’’ లాంటి గొప్ప గొప్ప గీతాల్ని ఆయన రచించారు! ఆ పాటల కారణంగానే కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులన్నీ సుబ్బారావు పాణిగ్రాహిని బేషరతుగా ప్రేమిస్తాయి! కమ్యూనిస్టు, విప్లవరాజకీయాల పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ బొడ్డపాడు ఎల్లప్పుడూ ఒక ఆకర్షణా కేంద్రంగా ఉంటూ వచ్చింది ! ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) శ్రీకాకుళం జిల్లా శాఖ 31 వ మహాసభ జులై 28 న పలాసలో జరిగింది! జిల్లాశాఖ ఆహ్వానంపై 28 ఉదయం పలాసలో దిగాను!సాయంత్రం మూడుగంటలకు యూనియన్ మహాసభ పూర్తయ్యింది! సాయంత్రం ఖాళీ ఉండటంతో బొడ్డపాడు వెళ్లాలని పలాస పాత్రికేయ మిత్రుడు ధనేశ్వర మహారణతో చెప్పాను! ‘‘వెళ్లండి..సుబ్బారావు పాణిగ్రాహి సతీమణి అక్కడే ఉన్నారు, ఆమెని చూసి రండని’’ మహారణ చెప్పారు! దిశ విలేకరి వాసును నాకు గైడ్ గా ఏర్పాటు చేశారు! పలాసకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బొడ్డపాడుకు వాసు మోటారు సైకిల్‌పై వెళ్లాం! ధర్మపురం, గరుడభద్ర గ్రామాల మీదుగా ప్రయాణించాం! బొడ్డపాడు కాలనీలో ఉన్న అర్చకుడు నిరంజన్ పాణిగ్రాహి ఇంటిలో సురేఖా పాణిగ్రాహి ఉన్నారు! సుబ్బారావు పాణిగ్రాహి తమ్ముడు హేమచంద్ర పాణిగ్రాహి కుమారుడే నిరంజన్! తిన్నగా వారింటికి వెళ్లాం! తొంభైఏళ్ల వయసులో ఉన్న సురేఖా ప్రాణిగ్రాహి ఇంటిలో నుంచి నిరంజన్ సహాయంతో బైటికి వచ్చారు!ఆరుగుపై కూచున్నారు! ఆ వయసులో కూడా ఆమె గొంతు స్పష్టంగా ఉంది! ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు! మా మధ్య అరగంటసేపు చాలా ముచ్చట్లు అయ్యాయి! సుబ్బారావు – సురేఖ దంపతులకు పిల్లలు లేరు! సుబ్బారావు పాణిగ్రాహి అమరత్వం తర్వాత ఆమె తన ముగ్గురు సోదరుల ఇంటిలోనే గడిపారు! వారు ముగ్గురూ కన్నుమూసిన తర్వాత నిరంజన్ పాణిగ్రాహి ఆమెను తమ దగ్గరకు తెచ్చుకున్నారు! ఆమె మంచి చెడ్డలు ఆయనే చూసుకుంటున్నారు! వాసు ఫోన్‌చేసి చెప్పడంతో లిబరేషన్ పార్టీ కామ్రేడ్‌లు మద్దుల మల్లేశ్వరరావు, రామకృష్ణ వచ్చారు! అమరవీరుల సంస్మరణ సందర్భాల్లో సురేఖా పాణిగ్రాహి ఆయా సభలకు హాజరవుతూ ఉంటారని చెప్పారు! తనకు పాడటం రాదని ఆమె నోరారా నవ్వుతూ చెప్పారు! తాను ఎనిమిదో తరగతి వరకూ చదివానని చెప్పారు! పోలీసుల ఇబ్బందులవల్ల తన సోదరులు మీటింగులకు వెళ్లనిచ్చేవారు కాదని చెప్పారు! నిరంజన్ తనని బాగా చూసుకుంటున్నారని ఆమె అన్నారు! కల్యాణ్ బాగున్నాడా, లీల ఎలా ఉందని ఆమె అడిగారు! మాట్లాడుతున్నంత సేపూ ఆమె నా చేతులు పట్టుకునే మాట్లాడారు! పార్టీ సభ్యుడు కాకపోయినా నిరంజన్ అమరవీరుల స్మారకసభల్లో పాటలు పాడతారని అక్కడి కామ్రేడ్‌లు చెప్పారు! నా అభ్యర్థన మేరకు ‘‘ఎరుపంటే కొందరికి భయం భయం’’ పాటని ఆయన తన మధురమైన గొంతుతో పాడి వినిపించారు! ఆయన అంత బాగా పాడతారని నేనూహించలేదు! చుట్టుపక్కల ఇళ్లలోని మహిళలు, పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వుతూ నిరంజన్ పాడుతుంటే చూశారు! ఉద్యమ నేపథ్యం, ప్రస్తుత పరిస్థితుల గురించి కామ్రేడ్‌లతో మాట్లాడుతూ బొడ్డపాడు గ్రామంలోకి వెళ్లాను! గ్రామంలో సీపీఐ ఎం.ఎల్. న్యూ డెమోక్రసీ, లిబరేషన్, లిన్ పియావో పార్టీల సభ్యులు, మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని తెలిసింది! బొడ్డపాడు గ్రామానికి గల విప్లవ నేపథ్యాన్ని, ఉద్యమ చరిత్రని పాలకవర్గ రాజకీయ పక్షాల నేతలు గౌరవిస్తారు! అమరవీరుల స్మారక కార్యక్రమాలను గ్రామస్తుల ఉమ్మడి కార్యక్రమంగా నిర్వహించే ఆనవాయితీ ఉందని అన్నారు! గ్రామంలో ఉన్న అమరవీరుల స్మారక మందిరాన్ని, తామాడ గణపతి స్మారక మందిరాన్ని, అమరవీరుల స్మారక స్థూపాన్ని చూశాం! సుబ్బారావు ప్రాణిగ్రాహి పనిచేసిన శివాలయాన్ని కూడా చూశాం! తామాడ గణపతి స్మారక మందిరంలో చారు మజుందార్ విగ్రహం ఉంది! జులై 28న చారు మజుందార్ వర్ధంతి కావడంతో ఆయన విగ్రహం దగ్గర నివాళులు అర్పించాను! భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్ట్) వ్యవస్థాపకులు అమరజీవి చారు మజుందార్‌కు బొడ్డపాడుతో అనుబంధం ఉంది! సీపీఐ రాష్ట్ర నాయకులు అమరజీవి సంకు అప్పారావు గారికి కూడా ఆ గ్రామంతో గట్టి అనుబంధం ఉండేది! అప్పట్లో ఆయన ఆ విషయాలను తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు! గతంలో నేను 2007 ఏప్రిల్‌లో తొలిసారిగా బొడ్డపాడు సందర్శించాను! చారు మజుందార్ 52 వ వర్ధంతి రోజున అనుకోకుండా మరోసారి బొడ్డపాడును చూడ్డం, సురేఖా పాణిగ్రాహిని కలుసుకోవడం, అమరుల త్యాగాలను స్మరించుకోవడం ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది!
సీనియర్ పాత్రికేయుడు
సెల్: 9866074026