దేశంలో ఒక కుటుంబానికి తినడానికి తగినంత ఆహారం లభించడంలేదంటే అది కచ్చితంగా పేదరికంలో ఉందని చెప్పాలి. గణనీయమైన సంఖ్యలో కుటుంబాలలో తీసుకునే ఆహారస్థాయి తగ్గిపోతోంది. తగినంత ఆహారాన్ని సమీకరించుకునేందుకు ఆదాయం తగ్గిపోతోంది. ఆదాయాలు తగ్గుతున్నప్పుడు తీసుకునే ఆహారం పడిపోతోంది. అవసరమైన ఆహార వస్తువులను కొనుగోలుచేసేశక్తి గణనీయంగా తగ్గుతోంది. పేదరికానికి ఇంతకంటే ఎక్కువ నిరూపణ ఏముంటుంది? కుటుంబం మొత్తం తీవ్ర ఇబ్బందుల్లోనే ఉండటం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల్లో కనిపిస్తోంది. పేదలకు, పేదలుకాని వారికి మధ్య ఒక రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. మన దేశం కూడా ఇందుకు మినహాయింపుగాలేదు. జీవన పోరాటంలో లక్షల కుటుంబాలు ఉంటున్నాయి. సంపన్నులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనూ పేదల సంఖ్య ఏమీ తగ్గడంలేదు. ఆకలితో పస్తులుంటున్న కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ అంశాలను మోదీ ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించదు. విశ్వసనీయమైన అనేక సంస్థలు చేసే సర్వేలను సైతం ప్రభుత్వం నిరాకరిస్తోంది. ప్రాంతాలవారీగా అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి.
2023లో 137 దేశాలలో ఇలాంటి సర్వేలు విజయవంతంగా నిర్వహించారు. 125 దేశాలలో భారత్ ఆకలి కుటుంబాలలో 111వ స్థానంలో ఉంది. ఇది దేశంలో వివిధ ప్రాంతాలలో భిన్నమైన రూపాలలో ఆకలి పరిస్థితి పెరుగుతున్నదని తెలుపుతోంది. 2022లో ఇదే 125దేశాలలో భారత్ ర్యాంకు 107గా ఉన్నది. 2023 నాటికి ఆకలి రేటు పెరిగింది. ఈ రేటు 100 ఉంటేనే అది మరింత అధ్వాన్న స్థితిలో ఉందని భావిస్తారు. అది మరింత పెరిగితే ఇంకా అధ్వాన్న స్థితిలో ఉందని అర్థం చేసుకోవాలి. ఇంకా అనేక అంశాలు ఆకలి సమస్యపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ అంశాలలో ప్రధానమైనది అసమాన ఆర్థిక పంపిణీ. అదే సమయంలో నిరుద్యోగం పెరుగుదల. గత పదేళ్లలో ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయిగానీ, తరగడంలేదు. దేశ అభివృద్ధి కుంచించుకుపోతోంది. ఉత్పత్తి, వినిమయం ధరల పరిస్థితిని ప్రభావం చేస్తుందని అంచనా. మన దేశంలో గోధుమ, బియ్యం ప్రధానమైన ఆహారం. వీటి ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, ధరలు మాత్రం తగ్గడంలేదు. వీటిపైన కేంద్ర ప్రభుత్వం ఏనాడూ శ్రద్ధపెట్టలేదు. పంపిణీ చేయకుండా పాడైపోయిన అనేక మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను సముద్రంలో తోసేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అలవాటుఉంది. వ్యవస్థను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టినప్పుడు ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయకుండా పాడయ్యేవరకు నిల్వ ఉంచడం, ఆ తరువాత వాటిని సముద్రాల్లో పోసివేయడం అనేక దేశాల్లో జరుగుతోంది. నిరుద్యోగం పెరగడం వల్ల వేతనాలతో నిమిత్తం లేకుండా జీవనం సాగించడం కోసం తక్కువ వేతనాలకు కూడా పనిచేయక తప్పడంలేదు. వాతావరణ మార్పు సైతం పంటల ఉత్పత్తిపైన తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. ఫలితంగా సరఫరా వాణిజ్యం తగ్గి ఆహార ద్రవ్యోల్బణం శాశ్వతంగా ఉంటోంది. ఈ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే మరింత తీవ్రతరమవుతాయి.