మారాలి మారాలి మనిషీ మారాలి. రా బావ ఏంటి ఏకంగా మనిషి మీద యుద్ధం మొదలుపెట్టావు. అవునయ్యా ప్రతి కార్యానికి మనిషే కారణం. ప్రతి విధ్వంసానికి, ప్రతి మంచికి మనిషే కారణం. మరి సమాజంలో మంచి జరగాలంటే మనిషి మంచి మనిషిగా మారాలి కదా. అందుకే మనిషి మారాలి అంటున్నా తప్పేంటి. తప్పు కాదయ్యా నిజం. రోజూ దినపత్రికల్లో చూస్తున్నాం మనిషి చేసే విధ్వంసకర చర్యలు. నాగరిక మానవుడు అని పిలిపించుకుంటూ సాటి మనిషిని చంపడం ఎంత అమానుష చర్య ఆలోచించు. ప్రస్తుతం నాయకుల కనుసన్నలలోనే ఇవన్నీ జరుగుతున్నవని సామాన్యుల భావన. మనం ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో పురుడు పోసుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ సమస్తం ప్రకృతి నుంచి తీసుకుంటూ ఆ ప్రకృతినే నాశనం చేస్తున్నాం. ఇది నాగరిక మానవుడు చేయవలసిన పనేనా అందుకే మనిషి మారాలి అంటున్నా. కరోనా, అంటువ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే పర్యావరణం గుర్తుకు వస్తుంది. పంచభూతాలలో ఒకటైన భూమి మీద బతుకుతూ పనికిరాని చెత్తంతా భూమిపైనే వేస్తాం. మురికి వాడలకు కారణమెవరు మనిషే కదా. పాలితులు, ప్రజలు అందరూ మానవ ధర్మం మరచి ప్రవర్తి స్తున్నారు. చూడు బావ జీవితంలో ప్రతి మనిషి అయిదుగురికి రుణపడి ఉన్నాడు. మాతృరుణం, పితృరుణం, గురువు రుణం, సమాజ రుణం, ప్రకృతి రుణం. మనిషి ఆ రెండు రకాల రుణం ఏనాడో విస్మరించాడు. సమాజ రుణం, గురువు రుణం మరిచినా కనీసం ఒకశాతమైనా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటున్నారు. పదినెలలు మోసి కనిపెంచి పెద్దవాడిని చేసి విద్యాధికుడుగా చేసి, వివాహం చేసి బిడ్డలను చూసికాదా పడ్డ కష్టమంతా మరచిపోతుంది కన్నతల్లి. అటువంటి తల్లిని కొట్టినా, తిట్టినా చివరకు శ్మశానంలో వదలివేసినా కొడుకును తిట్టదు సరికదా కొడుకును ఇతరులు తిట్టినా వూరుకోదు. గోరుముద్దలు పెట్టి జోలపాడి నిద్రపుచ్చి, పనిచేస్తూనే వీపుపై మోస్తూ కథలు చెప్పిన తల్లిని మరచిన మనిషి జంతువు కంటె హీనం కాదా. భర్తకు, బిడ్డలకు పెట్టగా అన్నం మిగలకపోతే మంచినీళ్లు తాగి పమిటచెంగుతో మూతి తుడుచుకుని చాపమీద నిద్రించే తల్లిని శ్మశానంలో వదలి వచ్చే కొడుకుల్ని మనుషులే అందామా. అటువంటి వారిని వెలివేయక పోవడం సమాజం తప్పుకాదా. నిజమే కాని సమాజంలో అటువంటి వారే ఎక్కువగా ఉన్నారుగా. ఇక తండ్రి విషయానికి వస్తే రోజంతా కష్టపడి రాత్రయినాక వచ్చి పిల్లలు తిన్నారో లేదో తెలుసుకున్న తర్వాత భోజనం చేస్తాడు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తన సంపాదన చాలకపోతే తాతల నాటి ఆస్తులు అమ్మి, రాత్రుళ్లు కూడ డ్యూటీ చేసి పిల్లల చదువుల కోసం చివరకు చెట్టు కింద కాపురానికి సిద్ధపడే తండ్రిని బూటుకాలితో తన్నే కొడుకు మనిషి ఎలా అవుతాడు. జవాను నుంచి రాష్ట్రపతి వరకు అక్షరాలు దిద్దించిన గురువును మరుస్తున్నారు. గతంలో ప్రతిఫలాపేక్ష లేకుండా చదువు చెప్పినంత కాలం గురువును మరువలేదు. చదువు కొనుక్కునే రోజులు వచ్చాక గురువుకు మర్యాద తగ్గిపోయింది. అలాగే ప్రకృతిలో భాగంగా ఉన్న ప్రతి మనిషి సమాజంలో బతుకుతూ, సమాజంతో పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. సమాజంలో అందరితో కలిసి బతుకుతూ తాను, తన కుటుంబం తప్ప సమాజంలోని యితరులతో సంబంధం లేదనే మనిషిని ఏమనాలి. నిజమే బావ తాగే నీరు, పీల్చేగాలి, భూమి, పైనున్న ఆకాశం, చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచించడం మనిషి ధర్మం. పంచభూతాల సమన్వయమైన మనిషి వాటిని విస్మరిస్తే అవి కాటు వేయక మానవు. కలుషితమైన గాలి, నీరు స్వీకరిస్తూ యింకా కళ్లు తెరవకపోతే చివరకు మనిషి మిగలడనే నగ్న సత్యాన్ని మనిషి తెలుసుకోవాలి. వాతావారణ కాలుష్యానికి మనిషే కారణం. మనిషి పుట్టుకకు ముందే ఉన్న పంచభూతాలు, ప్రకృతిలో మనిషి మనుగడ సాగిస్తూ వాటి ఉనికిని విస్మరిస్తున్నాడు. మన రాష్ట్రంలో కూడ మనం పీల్చే గాలిలో యిప్పటికే కాలుష్యం అపారంగా ఉందని విస్తరిస్తే మరింత పెరిగితే, మనిషి అంతరించి పోవడానికి అణుబాంబులు అవసరంలేదని, పీల్చేగాలి వల్లె మానవ జాతి అంతరించే అవకాశం మెండుగా ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. అయినా ఈ హెచ్చరికలు పెడచెవిన పెట్టి కరెన్సీ లెక్కలలో మునిగిపోయే మనుషిని ఏమనాలి. చెట్టు నాటే కార్యక్రమం 80 శాతం ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్రభుత్వం చేసే కార్యక్రమం మనది, మనకోసం అనే భావన ప్రజల్లో కలగడం లేదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం కాదన్నట్లుగా నేతలు వ్యవహరించడం కూడ అందుకు కారణం కావచ్చు. యథారాజా తథాప్రజా అన్నట్లుగా నాయకుల స్వార్థం అనుచరులకు మార్గదర్శనంగా మారుతోంది. ఏదిఏమైనా మనిషికి ప్రాణహాని కల్గించే వాతావరణ కాలుష్యం పట్ల శ్రద్ధ వహించకపోవడం శోచనీయం. అడవులు, మడ అడవులు ఆక్రమణ పాలవుతున్నాయి. ఒకపక్క అడవులను నరికి ఇంటి ముందు, రోడ్లపక్కన పెంచడం వలన ఫలితం అతి స్వల్పం. అడవులు పెరిగితేనే ప్రకృతి విలయం నుంచి బయటపడగలమనే విషయం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా సంఘమైనా, సంస్థ అయినా, సమాజమైనా మనుషుల సముదాయమే కనుక అన్ని మంచి చెడులకు మనిషే కారణం. అందుకే ప్రాథమికంగా మనిషిలో మార్పు అనివార్యం.
సెల్: 9885569394