కరచాలనం అంటే ‘షేక్ హ్యాండ్’ నాకు ఇష్టమైన పలకరింపు విధానం. నమస్కారం పెట్టడంలో భక్తి, గౌరవం ఉండగా, కరచాలనంలో దగ్గరతనం, స్నేహం ఉంటాయి. ఈ పురాతన ప్రక్రియ అన్ని దేశాల్లో ఉంది. జపాన్‌లో ఉందో లేదో డౌటు. వాళ్లయితే వంగి పలకరించుకుంటారు. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దం తాలూకు చిత్రాల్లో కూడా కరచాలనం చేస్తున్న బొమ్మలు కనబడతాయి. వ్యాపార వ్యవహారాల్లో, క్రీడల్లో, వివిధ అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో, కలిసినప్పుడో, విడిపోయేటప్పుడో, సంధి కుదిరినపుడో, పరిచయం అవుతూనో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కనబడుతూ ఉంటుంది. అయితే గమనిస్తే ఈ మధ్య అది రొటీన్‌గా ఉండడం తగ్గినట్లు తెలుస్తోంది. బహుశా కరోనా తర్వాత ఆ అలవాటు పబ్లిక్‌లో తగ్గిపోతున్నట్టు అనిపిస్తోంది. ఆరోగ్యరీత్యా కరచాలనం బదులు నమస్కారంతో సరిపెట్టడం మంచిదే కావచ్చు. జలుబు, కళ్లకలక, కరోనాలాంటి సాంక్రమిక వ్యాధుల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కానీ ఇద్దరు కలవడం, కరచాలనం చేసుకోవడంలోని ఆ ‘ఫీల్’ మాత్రం రాదు. టెన్నిస్‌లో గెలిచిన నాడల్‌ని, ఓడిపోయిన ఫెడరర్ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూస్తే ఎంత బాగుంటుంది! అలాగే అమెరికా అద్యక్ష పీఠంకోసం వాదులాడుకొనే ముందు ట్రంప్ దగ్గరకువెళ్లి ఆయన ప్రత్యర్ధి హరిస్ కరచాలనం చెయ్యడం కూడా. ఎంత వంగి నమస్కారం పెట్టినా ఆ ఫీల్ వస్తుందా?
ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే నాకు, మీ అందరిలాగే, చిన్నప్పటి నుంచీ కరచాలనం అలవాటు. మిత్రులెటూ సరి. పరిచితులైనా, అపరిచితులైనా కలిసినప్పుడు చెయ్యి ముందుకు పోతుంది. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నస్పుడు కొన్ని వేల షేక్ హ్యాండులు తప్పవు. కారు కదిలిపోతున్నా, ముందుకు నడిచిపోతున్నా పరిగెత్తుకు వచ్చి కరచాలనం చేస్తుంటారు. క్షణమే అయినా అదో తృప్తి. మనం పెద్దవాళ్ల దగ్గర నుండి అందుకున్నపుడు ఆ ఫీల్ వెంటనే పోదు. ప్రముఖుల కరస్పర్శ, ఆ జ్ఞాపకం, సందర్భంతో సహా పదికాలాలపాటు మనసులో పదిలంగా ఉండిపోతుంది. నాకైతే వాజ్‌పేయి, కలాం, కె ఆర్ నారాయణ్‌లని తలుచుకున్నప్పుడు వారిచ్చిన షేక్‌హ్యాండు తాజాగా ఫీల్ అవుతాను. అందుకనే పబ్లిక్ లైఫ్‌లో షేక్‌హ్యాండు సంస్కృతి తగ్గకూడదని నా భావన. (నాకు షేక్ హ్యాండు ఇచ్చిన అత్యంత పవర్‌ఫుల్ వ్యక్తి ఎవరో తెలుసా! వ్లాదిమిర్ పుతిన్. నేను ఎంపీగా ఉండగా ఆయనోసారి, క్లింటన్ ఓసారి పార్లమెంట్ విజిట్ చేశారు. క్లింటన్ ఇప్పుడు మాజీ కదా!)
విశ్రాంత పాత్రికేయులు