భారీ వర్షాలు, వరదలతో ఆంధ్ర ప్రదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. బుడమేరు, కృష్ణా వరదలతో బెజవాడలో పౌర జీవనం తీవ్రంగా దెబ్బతినగా, ఆ కష్టం తీరక ముందే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రను దారుణంగా దెబ్బతీశాయి. ఏజెన్సీ ప్రాంతంలో వందలాది గ్రామాలకు రాకపోకలు కూడా ఆగిపోయాయి. బెజవాడలో అనేక ప్రాంతాల్లో నిలిచిన వరద నీటికి లక్షలాది మంది నిర్వాసితులు కాగా అపార ధన నష్టం వాటిల్లింది. గండ్లు పూడ్చడానికి సైన్యం సహాయం సైతం తీసుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులూ, వాగులూ పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు, మౌలిక సదుపాయాలూ దెబ్బతిన్నాయి. పంటల నష్టం అపారం. తక్షణ పరిస్థితిని, దీర్ఘ కాలిక ప్రభావాన్ని అంచనా వేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉపశమన కార్యక్రమాలు, చేయూత ప్రణాళికల్ని అమలు చేయాల్సి ఉంది. దెబ్బతిన్న మౌలిక వసతుల్ని బాగు చెయ్యడం, చిట్టచివరి వ్యక్తికి కూడా సాయం అందేలా చూడడం, జనజీవనం, ఉపాధి కార్యక్రమాలు తిరిగి మామూలు పరిస్థితికి వచ్చేలా తోడ్పాటు అందించాలి. వీటన్నిటికీ నిధులు అవసరం. కావున కేంద్రం జాగు చెయ్యక అదనపు నిధుల్ని అందించాలి. ఆపద తీవ్రత దృష్ట్యా జాతీయ విపత్తుగా ప్రకటించి మొదటి విడత నిధుల్ని వెంటనే అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో అధికారుల మధ్య సమన్వయం ఉండేలా చూడాలి. జరిగిన నష్టంతో పాటు, వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేయాల్సి ఉంది. కరోనా తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు ఇదే.
డా.డి.వి.జి. శంకర రావు, మాజీ ఎంపీ