పట్టించుకోం. ఆ ఒక్కటి తప్ప మరింకేదీ మనకు పట్టదు. ఎంత మంది చిన్నారులు విజయం సాధించినా… దేశానికి కీర్తి కిరీటాలు పొదిగినా మనకు ఏ మాత్రం ఆనందం ఉండదు. ఒక్కరోజంటే ఒక్క రోజు కూడా ఆ సంబరాలను జరుపుకోవడం, ఆ చిన్నారులకు జేజేలు పలకడం మనకు రాదు. ఆసియా క్రీడలతో పాటు అనేక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో దేశానికి ఎన్నో పతకాలు తీసుకువచ్చిన ఆ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఆ రోజుకి మాత్రమే వార్త అవుతాడు. ఆ తర్వాత ఆ క్రీడాకారుడు కానీ, అతని తల్లిదండ్రులు కాని మనకి జ్ఞప్తికి రారు. అదే క్రికెట్ అయితే… ఇక సంబరాలే సంబరాలు. అంతకు ముందు రెండుసార్లు ఓడిపోతుంది భారత క్రికెట్ జట్టు. కానీ, ఒక్కటంటే ఒక్క విజయంతో మళ్లీ అందరికి అభిమాన క్రీడ అయిపోతోంది. వాళ్లు ప్రపంచ కప్ గెలుస్తారు. దేశంఅంతా ఉప్పొంగిపోతుంది. వారికి కానుకల మీద కానుకలు. కోట్లాది రూపాయల నజరానాలు. అబ్బో చాలా పెద్ద ఉద్యోగాలు. క్రికెట్ అభివృద్ధికి కోట్ల రూపాయలు విడుదల చేస్తారు కార్పొరేట్ కంపెనీల యజయానులు. దేశ క్రీడాకారులు రాసుకున్న పౌడర్ నువ్వూ రాసుకుంటావ్. నీ అందంలో కాని, ఆనందంలో కానీ మార్పు ఉండదు. కార్పొరేట్ల బ్యాంకుల్లో ఖాతాలు మాత్రం నిండిపోతూ ఉంటాయి. ఇదంతా వారిమీదో, ఆ క్రికెట్ మీదో కోపంతో కాదు చెబుతున్నది. నేనూ క్రికెటర్‌నే. కానీ ఆ క్రీడ పట్ల వెర్రి ప్రేమ, మరో ఆట పట్ల నిర్లక్ష్యమే నన్ను నిలువనీయదు. ఈ ప్రశ్నలు వేసేలా చేస్తుంది.
మొన్నటికి మొన్న ఆ చెస్ క్రీడాకారులు. ఎంత గొప్ప విజయం సాధించారు. ఒకటి, రెండూ కాదు…ఏకంగా 64 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. చెస్ ఒలింపియాడ్‌లో అటు పురుషులు, ఇటు మహిళల విభాగంలోనూ కూడా స్వర్ణ పతకం సాధించిన భారత చెస్ పిడుగులు దశాబ్దాల కలని సాకారం చేశారు. ఇంతటి అద్భుత విజయాన్ని సాధించిన మన క్రీడాకారులను ప్రధాని అభినందించారు. ఆనందించారు. మరి దేశ ప్రజల మాటేమిటన్నదే నా ప్రశ్న. క్రికెట్‌లో ప్రపంచ కప్ సాధించిన ఆటగాళ్లకు నీరాజనాలు పలికారు కదా. మరి ఇతర ఆటగాళ్లు అదే స్థ్ధాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్త్తుంటే అటు వైపు చూడరెందుకనేదే నా ప్రశ్న. క్రికెట్ క్రీడాకారులను గౌరవించకూడదని, వారికి నజరానాలు ఇవ్వకూడదన్నది నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. కాని, బ్యాడ్మింటన్, చెస్‌లతో పాటు దేశ ప్రధాన క్రీడైన హాకీని కూడా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారన్నదే నాలాంటి వాళ్ల ఆవేదన. ఆ చెస్ క్రీడాకారులతో దేశ ప్రధాని కరచాలనం చేశారు. ఆయన సమక్షంలోనే వారు చెస్ ఆడుతుండగా మురిసిపోయారు. వారే భావి భారత భాగ్య విధాతలన్నారు. ఇంకా చాలా అనే ఉంటారు. ఆ వార్తలు అన్ని మీడియాల్లోనూ చాలా ప్రముఖంగా వచ్చాయి. కానీ, ఏ ఒక్క కార్పొరేట్ సంస్ధ వారికి, వారి లాంటి క్రీడాకారులకు మేమున్నామని, అలా ఎదుగుతున్న వారికి మేం సహాయం అందిస్తాం అని చెప్పిన దాఖలాలు మాత్రం కాన రాలేదు. ఈ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన అబ్బాయిలు, అమ్మాయిలు చెస్‌లో ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం వారికి కోచింగ్ ఇచ్చిన ఒకనాటి విశ్వ విజేత విశ్వనాథన్ ఆనందే. ఆయన నడుపుతున్న వెస్ట్ బ్రిడ్జి ఆనంద్ చెస్ అకాడమీ నుంచే వీరంతా శిక్షణ పొందారు. విశ్వనాథన్ ఆనంద్ ఒక్కరే ఒంటి చేత్తో ఇలాంటి రత్నాల్లాంటి క్రీడాకారులను దేశానికి అందిస్తున్నారు. ఈ సమయంలోనే జిల్లాకో పది, ఊరికో నాలుగు, వీధికో రెండు వంతున క్రికెట్ కోచింగ్ సెంటర్లు పెడుతున్న ప్రభుత్వాలు, క్రికెట్ బోర్డులు ఉన్న దేశంలో చెస్, కబడ్డి, హాకీతో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశం కనీసం లేకపోవడమే మన దౌర్భాగ్యం. అన్నట్లు, ఈ చెస్ ఆటగాళ్ల విజయం వెనుక ప్రత్యేకించి తెలుగువారు ఆనందపడే ఆంశం ఉంది. ఇది మనకే సొంతం అని కూడా కాసింత గర్వపడచ్చు. ఎందుకంటరా… విశ్వనాథన్‌్ ఆనంద్ క్రీడాకారుడిగా చెస్ జూనియర్స్ ఆడడానికి ఆయనకు స్పాన్సర్ చేసింది మన గాన గంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యమే. మన గొప్ప రచయిత, సాహితీ చరిత్రకారుడు, సినీ గీత రచయిత ఆరుద్ర చెస్ క్రీడాకారుడు. ఆయనకు చెస్ అంటే ప్రాణం. చెస్‌లో విశ్వనాథన్ ఆనంద్‌లో ఉన్న ప్రతిభను ముందుగా గుర్తించింది ఆరుద్రే. 1983లో జరిగిన జాతీయ స్థాయి జూనియర్ చెస్ పోటీలకు విశ్వనాథన్‌్ ఆనంద్‌కి స్పాన్సర్ చేయాల్సిందిగా ఎస్.పీ.బాల సుబ్రహ్మణ్యాన్ని కోరారు ఆరుద్ర. ఈ ప్రతిపాదనకు ఎస్‌పీ బాలు వెంటనే అంగీకరించడంతో విశ్వనాథన్ ఆనంద్ ఆ పోటీల్లో ఆడడమే కాదు… ఆ తర్వాత విశ్వ విజేత కూడా అయ్యారు. ఇప్పుడు విశ్వనాథన్ అకాడమీలోనే వందలాది మంది యువ క్రీడాకారులు చెస్‌లో శిక్షణ పొందుతున్నారు. మరో విషయం ఆరుద్ర పేరు వినగానే తెలంగాణపై రాసిన కావ్యం త్వమేవాహం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలు, కూనలమ్మ పదాలు, వందలాది సినీ పాటలు గుర్తుకు వస్తాయి అందరికీ. వీటితో పాటు ఆరుద్ర చెస్ క్రీడ మీద రాసిన చదరంగం పేరుతో రాసిన పుస్తకం ఈ క్రీడలో శిక్షణ పొందే వారికి చాలా ఉపయోగ పడుతుందని ఆ క్రీడకారులే చెబుతారు. ప్రభుత్వాలే కాదు…. కాసింత మంచి మనసున్న వారు కూడా గ్రామీణ క్రీడాకారులకు కాసింత చేయూత నందిస్తే దేశం గర్వించే క్రీడాకారులు తయారుకావడం ఎంతో దూరంలో ఉండదు.
సీనియర్ జర్నలిస్టు,
సెల్: 99120 19929