సి ఆదికేశవన్
దేశంలో నిరుద్యోగిత తీవ్రమవుతున్న ప్రస్తుత సమయంలో ‘గిగ్ ఎకానమీ’ అనే మాట వినిపిస్తోంది. చదువుకున్నవారు ఉద్యోగాలు దొరక్క, ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు. ఆర్థిక అవసరాల కోసం రోజులో కొన్ని గంటల సమయం స్విగ్గీ, ర్యాపిడో, వోలా, జోమాటో, అమెజాన్ డెలివరి వర్క్స్, ఫుడ్ పాండా, ఉబర్ ఈట్స్ వంటి సర్వీసుల్లో పని చేస్తున్నవారు కోకొల్లలు. వీరిలో ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్టు, పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. ఈ తరహా ఉపాధిని కల్పించే ఆర్థిక వ్యవస్థను ‘గిగ్ ఎకానమీ’ అంటారు. గిగ్ ఎకానమిలో పనిచేసేవారిని ‘గిగ్ వర్కర్స్’ అని, వీరు చేసేపనిని ‘గిగ్ వర్క్’ అని అంటారు. తమ పని గంటలను ఎంపికచేసే సౌలభ్యం వీరికుంటుంది. రోజురోజుకు గిగ్‌వర్కర్ల వాటా గణనీయంగా పెరుగుతోంది. వీలున్నప్పుడు పనిచేస్తూ తాత్కాలిక ఆదాయం సంపాదిస్తున్న గిగ్ వర్కర్స్ దేశవ్యాప్తంగా 2020-21 నాటికి 75 లక్షల మంది ఉన్నట్లు నీతి అయోగ్ జూన్ 2022 నివేదిక వెల్లడిరచింది. మండు వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో, కుంభవృష్టిలో తుపానులో సైతం పగలు, రాత్రి తేడాలేకుండా గిగ్‌వర్కర్ల పని మన దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పడుతోంది. మనం దేనికోసం చింతించాల్సిన అవసరం లేకుండా సౌఖ్యంగా మనం ఇంటిలో ఉండి కేవలం స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దేనికైనా ఆర్డర్ చేస్తే చాలు… క్లిష్ట పరిస్థితులనుసైతం తట్టుకుని మనకు కావలసినవాటిని అందించే గిగ్ వర్కర్ల ఆర్థిక పరిస్థితి, నేపధ్యం చూస్తే..
నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) సర్వే ప్రకారం, భారతదేశంలో ఒక గిగ్ వర్కర్ సగటున వారానికి 69.3 గంటలు పని చేస్తాడు. అంటే వారానికి ఏడు రోజులు, రోజుకు దాదాపు 10 గంటలపాటు పనిచేసినట్లే. ఆదివారం కూడా వీరికి సెలవు లేదు. ఈ సర్వేలో ఇతర రంగాల్లోని కార్మికులు వారానికి సగటున 56 గంటలు పనిచేస్తారు. గిగ్ కార్మికులు రోజుకు 8-12 గంటల పాటు తమ బైక్‌లను నడపాలి. వీరికి ఇన్సూరెన్స్‌కూడా ఉండదు. ఒక సగటు గిగ్ వర్కర్ పనిచేసే గంటలు, అర్హత, అతను సంపాదించే కొద్దిపాటి సంపాదన కోసం మన దేశంలోని నగరాల్లోని కార్మికులు ఎవరూ ఇంతగా శ్రమించరనేది మాత్రం స్పష్టం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇతర కార్మికులతో పోలిస్తే సగటు గిగ్ వర్కర్ అర్హతలు కూడా మెరుగ్గా ఉంటాయి. డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు ఉపాధికోసం ఈ రంగాన్ని ఎంచుకుం టున్నారు. ఉద్యోగాలు చేసేవారు సైతం వారి ఖాళీ సమయాల్లో, వారాంతాల్లో గిగ్ వర్కర్లుగా ఉన్నారు. మన దేశంలోని 75శాతం గిగ్ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందు లను ఎదుర్కొంటున్నారనేది ఈ నివేదిక స్పష్టం చేసింది. సగటున, ఒక గిగ్ వర్కర్ కేవలం నెలకు రూ.18,000 కోసం అవిశ్రాంతంగా కష్టపడి పనిచేసినా పూర్తిగా అందని పరిస్థితి. కుటుంబాన్ని నెట్టుకురాలేని స్థితిలో గిగ్ కార్మికులున్నారు. పేలవమైన పని పరిస్థితులను గిగ్ కార్మికులు ఎదుర్కొంట ున్నారు. ఎండ, వేడి వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ఆదాయ అస్థిరతలతో గిగ్ వర్కర్లు తీవ్ర ఆర్థిక లోటుపాట్లకు గురవు తున్నారు. ముఖ్యంగా వీరికి సామాజిక భద్రత, ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రయోజనాలు, చెల్లింపులతో కూడిన సెలవులు అందుబాటులో లేకపోవడం, తక్కువ వేతనాలు, ఉద్యోగ అభద్రత గిగ్ వర్కర్‌లు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. ముఖ్యంగా గిగ్ కార్మికులు రోడ్డు ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన సమస్యలు వీరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఆధునిక గిగ్ కార్మికులకు ముందు సాధారణంగా సంగీతకారులు, హాస్యనటులు ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ రంగాల్లోని కళాకారులకు సక్రమంగా జీతం లభించదు. వారి వ్యక్తిగత సామర్ధ్యాన్నిబట్టి చెల్లింపులు ఉంటాయి. ఒక హాస్యనటుడు కంపెనీలో షో చేస్తే, అది అతనికి గిగ్ వర్క్ అవుతుంది, వ్యక్తిగత సామర్ధ్యంపైనే అతని సంపాదన ఉంటుంది. మొట్టమొదటిసారిగా ‘గిగ్’ పదాన్ని 1952లో తాత్కాలిక చెల్లింపుల ఉద్యోగం నిమిత్తం ఉపయోగించారు. ప్రముఖ రచయిత జాక్ కెరోవాక్ రైలు-రోడ్డు వ్యవస్థలో బ్రేక్‌మ్యాన్‌గా పని చేయడానికి గిగ్‌ను ఎలా పొందారనే దానిపై ఒక కథనాన్ని రాశారు. అప్పటినుంచి ఈ గిగ్ పదం నూతన ఆర్థిక వాస్తవికత దాల్చింది.
10సంవత్సరాలుగా ఫ్రీలాన్సింగ్ కూడా గిగ్ కేటగిరీలో చేర్చడమైంది. గత నాలుగు సంవత్సరాలలో కోవిడ్ అనంతరం గిగ్ ఆర్థిక వ్యవస్థలో అద్భుతమైన వృద్ధిని నమోదుచేసింది. ఈ ఆర్థిక వ్యవస్థను రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి సర్వీస్ ఆధారిత గిగ్ కాగా మరొకటి మౌలిక గిగ్. నైపుణ్యత తక్కువగా ఉన్న డెలివరీ ఏజెంట్లు, కాగా మరొకటి కనల్టెంట్‌లు, డేటా సైంటిస్టుల వంటి ఉన్నత-నైపుణ్యం కలిగిన ఉద్యోగాల ద్వారా సేవలందించడం మరొకటి. వీరిని బ్లూ కాలర్ గిగ్ వర్కర్లు, వైట్ కాలర్ నాలెడ్జ్ వర్కర్లు అని కూడా పిలుస్తారు. సాధారణంగా గిగ్ వర్కర్లు మొదటి కేటగిరీకి గిగ్ వర్తిస్తుంది. ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ, పోర్టర్, జెప్టో వంటి కంపెనీల్లో పనిచేసే వారి పని డెస్క్ జాబ్‌లకు భిన్నంగా ఉంటుంది. వాస్తవంగా ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సేవలను అందిస్తున్నవారు సాధారణ ఉద్యోగాలతో పోల్చితే గిగ్ ఎకానమీ వల్ల ఉద్యోగులకు, యజమానులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గిగ్ ఉద్యోగుల నియామ కంలో ఎటువంటి ఒప్పందాలు ఉండవు. అనవసం మైనప్పుడు గిగ్ వర్కర్‌లను విధుల నుంచి తొలగించవచ్చు. వీరు బహుళ కంపెనీలకు పనిచేయడం కూడా సాధ్యమే. అదనపు ఆదాయాన్ని పొందడానికి వీరు సైడ్‌జాబ్‌గా చేయవచ్చు. నీతి ఆయోగ్ ‘‘ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం ఎకానమీ’’ 2022 నివేదిక ప్రకారం, కోవిడ్ మహమ్మారి కంటే ముందు, భారతదేశంలో దాదాపు 3 మిలియన్ల మంది గిగ్ కార్మికులు ఉన్నారు. 2021 నాటికి ఈ సంఖ్య 7.7 మిలియన్లకు చేరగా 2030 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.