నిద్రలే స్వామీ ఇక చాల్లే లేవయ్యా నీ పేరుతో బురద చల్లుతుంటే చూడలేని స్వామీ మేలుకోవయ్యా పరమేశ్వరా! ఏడుకొండలవాడ. ఏంటి బావ దేవుడినే నిద్రలేపుతున్నావ్ ఏంటి కథ. అదేమరి అన్నీ తెలిసి తెలియనట్లు అడుగుతావ్. గత వారంరోజులుగా ఊరూవాడా అన్ని పేపర్లలోను, అందరి నోట తిరుపతి లడ్డూ వూసే కదా! అదా అసలు ఆ దేవదేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కళ్లు తెరవాలో అప్పుడే తెరుస్తాడు. సమాజంలో జరిగే ప్రతి చర్యకు ఆ దేవుడు సాక్షీభూతుడు మాత్రమే. ఈ జన్మలో జరిగే మంచి, చెడులకు ఆయనే సాక్షి. మరుజన్మలో ఈ జన్మ కర్మ ఫలితం అనుభవించక తప్పదు. అది సరేనయ్యా అసలు నెయ్యిలో కల్తీ ఉందో లేదో తేల్చకముందే ఒకర్ని ఒకరు తిట్టుకోవడం, ఇళ్లమీద, కార్యాలయాల మీద పడి రాళ్లు రువ్వుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అయినా స్వయానా ముఖ్యమంత్రి తెలుస్తోంది, విచారించాలి అనకుండా జంతువుల నూనె కల్సిందని చెప్పడంతో ఒక్కసారిగా భగ్గుమంది. విచారణకు ఆదేశించి ఫలితం వెలువడ్డాక జరగవలసిన రాద్ధాంతం ముందుగానే జరగడం ఘోరం. అసలు జులై నెలలో ఈ విషయం బయటపడితే యిప్పటి వరకు ఎందుకు దాచినట్లు? ఏదిఏమైనా ప్రతిదానికి రాజకీయరంగు పులమటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు. ఒక పెద్దమనిషి ఈ ఘోరం గత అయిదు సంవత్సరాలుగా జరుగుతోందని అంటాడు. కాని ప్రతి మూడునెలలకు పరీక్ష చేసిన తరువాతనే కొనేటప్పుడు అయిదేళ్లు ఎలా వూరుకున్నారు? ఆ పెద్దమనిషి ఆనాడే ఈ విషయం బయటపెట్టవచ్చు కదా! ఏదిఏమైనా కోట్లాది భక్తుల మనోభావాలకు తీరని విఘాతమే ఈ కల్తీ లడ్డు. కాని ఈ విషయాన్ని రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు. అది సరే బావ ఈ విషయంలో బీజేపీ అగ్ర నాయకుల ప్రమేయం ఉందంటావా. గత కొంతకాలంగా బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పడానికి 2024 లోక్‌సభ ఎన్నికలలో నిరూపణ జరిగింది. అయిదేళ్లు గడిచిన తరువాత మరింత వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అనేది పార్లమెంటులో బిల్లు ఆమోదింపచేయించుకుంది. అది అమలు సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే తగ్గిపోతున్న గ్రాఫ్ దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఎన్నికలకు తొందరపడుతోందని ఎక్కువమంది భావిస్తున్నారు. అందుకే హిందువుల నుంచి సానుభూతి కోసం కేంద్రం ఈ నాటకంలో భాగస్వామిగా ఉందని కొందరి అభిప్రాయం. అయినా దేశంలో యిన్ని నేరాలు, ఘోరాలు జరుగుతుంటే ఆ ఏడుకొండల వాడు నిద్రపోతుంటే ఎలా చెప్పు? ఈ అన్యాయాన్ని అరికట్టే దేశం శాంతిగా మనుగడ సాగించడం ఆయనకు యిష్టం ఉండదా! దేశ దేశాల నుంచి కోట్లాది మంది ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దర్శనం చేసుకుని మనసు ప్రక్షాళన చేసుకుని ఆ దేవ దేవుని పేరిట అమ్మే లడ్డు మహాప్రసాదంగా స్వీకరిస్తుంటే అందులో కల్తీని అరికట్టి అందుకు బాధ్యుల్ని సర్వనాశనం చేయవచ్చు కదా. నిరాకారుడంటారు. అంటే మంచివాళ్లకు మంచివాడుగా చెడ్డవాళ్లకు చెడ్డవాడుగా వివిధ రూపాలలో దర్శనమిచ్చే ఈ స్వామి ఈ భూమ్మీద జరిగే అరాచకాలకు సాక్షిభూతుడు మాత్రమే అంటే ఎట్లా? ఇలా కులమతాలతో రాజకీయ విభేదాలతో నిత్యం అశాంతితో బతకటం ఆయనకు యిష్టమా! ఈ మధ్య జల ప్రళయంలో వూహించరాని విధ్వంసం సృష్టించారు. ఇంతవరకు కోలుకోలేదు. ఇంతలోనే ఈ లడ్డు వ్యవహారమేమిటి స్వామీ! ఇది నీకు న్యాయమా? ఇప్పటికైనా కళ్లు తెరువు స్వామీ? నిత్యం నిన్ను కొలిచే కోట్లాది భక్తులు ఈ లడ్డు విషయంతో తల్లడిల్లిపోతున్నారు. వారిపై దయ చూపించి అసలు దొంగల నిజస్వరూపం బయటపెట్టు స్వామి. కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. న్యామూర్తులు కూడా నీ భక్తులే కదా! పోనీ వారి నోటితోనైనా అసలు దొంగల్ని బయటపెట్టి నీ భక్తుల హృదయ వేదనకు స్వస్తి పలుకు స్వామి. కల్తీ లడ్డు అంటారు ముఖ్యమంత్రి` ఆయన కుమారుడేమో కల్తీ ఉన్న వాటిని వెనక్కి పంపించారని అంటారు. దేశంలో ఉన్న సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే అవి చాలవన్నట్లు ఈ లడ్డు గోల ఎందుకు స్వామి! అసలే వరదలతో కోలుకోలేని స్థితిలో ఉన్న బాధితులకు ఈ కొత్త గోల ఎందుకు స్వామి! నిరాకారుడు, నిర్వికల్పుడు, నిర్గుణుడు అంటారు నిన్ను. ఒకే ఆకారంలో ఉండవని, నీకంటూ కోరికలుండవని అలాగే ఎల్లప్పుడు ఒకే గుణంతో ఉండవని అంటారు. భక్తుల రక్షణ కోసం ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతారం మార్చినట్లు ఈ కల్తీ లడ్డు కారకులను అంతమొందించడానికి కొత్త అవతారం దాలుచ స్వామి. ఏమో ఏం చేస్తారో మాకు తెలియదు. మీ భక్తుల మనోవేదనకు స్వస్తి పలుకుతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాం. త్వరలో అంతం పలుకు స్వామి.
సెల్: 9885569394