సాత్యకి చక్రవర్తి
ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు వ్యతిరేక ర్యాలీలు ప్రపంచంలో అనేకప్రాంతాల్లో జరుగుతున్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్, లండన్, పారిస్, బెర్లిన్, టెలిఅవీవ్ తదితర అనేక నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలస్తీనాతో రాజీ ఒప్పందం కుదుర్చుకోవాలని లేకపోతే హమాస్ బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయిల్ ప్రజలను కూడా వాళ్లు చంపివేసే అవకాశం ఉన్నందున వెంటనే శాంతి ఒప్పందం చేసుకోవాలని ప్రదర్శకులు డిమాండ్ చేశారు. కొన్ని పశ్చిమదేశాల నాయకులు కూడా గాజాపైన దాడులకు అంతంపలకాలని నెతన్యాహును కోరుతున్నారు. ఇజ్రాయిల్‌కు పంపవలసిన ఆయుధాలను బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ నిలిపివేశారు. 30 సంస్థల ఆయుధాల ఎగుమతుల లైసెన్స్‌ను ఆయన రద్దు చేశారు. ఈ నిర్ణయం తక్కువ చర్యే అనిపించినా ముందు ముందు నెతన్యాహును అదుపుచేయడానికి మరికొన్ని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వామపక్షపార్టీ అయిన లేబర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కరుడుకట్టిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగానే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలి నుంచి ఇజ్రాయిల్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తన వైఖరిని కొంతమార్చుకున్నారు.
గాజాపై దాడిని నిలిపివేసేందుకు తక్షణం కాల్పుల విమరణ ఒప్పందాన్ని అంగీకరించాలని నెతన్యాహును గట్టిగా కోరారు. ఈ విషయాన్నే హమాస్ నాయకులకు ఎందుకు చెప్పరని ఇజ్రాయిల్ సైనిక నాయకులు బైడెన్‌ను ప్రశ్నించారు. ఇజ్రాయిల్ పాల్గొనకుండా జరిగిన శాంతి ఒప్పందం చర్చలలో హమాస్ కూడా పాల్గొనలేదు. అయితే శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు కొంతమేర హమాస్ తన వైఖరిని మార్చుకుంది. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించేవరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లి కాంగ్రెస్‌లో ప్రసంగించినప్పుడు చెప్పారు. ఒకవైపు అనేక ప్రధాన నగరాలలో నెతన్యాహు వైఖరిని నిరసిస్తూ భారీ ర్యాలీలు జరుగుతున్న సందర్భంలోనే ఇజ్రాయిల్ వ్యాప్తంగా ఏనాడూ లేనంతగా కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేశారు. నెతన్యాహు అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడిప్పుడే డెమొక్రటిక్ పార్టీలో వామపక్ష నాయకులు నెతన్యాహు వైఖరిని ఖండిరచారు. అంతేకాదు, డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలు, నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్న కమలా హారిస్ కూడా నెతన్యాహు వైఖరిని వ్యతిరేకించారు. శాంతి ఒప్పందానికి ఇది మంచి సమయమని కూడా ఆమె అన్నారు. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నందున బైడెన్ తమ పార్టీకి అనుకూలతను సాధించేందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని నెతన్యాహును కోరుతున్నారు.