పిన్నక సాంబశివరావు
ఎంతోమంది ప్రజల, ఉద్యమకారుల, జాతీయ నాయకుల, స్వాతంత్య్ర సమరయోధుల, పోరాట త్యాగ ఫలితంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం సిద్ధించింది. అటువంటి మహానుభావుల్లో జాతిపిత మహాత్మా గాంధీజీ సుప్రసిద్ధుడు. ఆంగ్లేయపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధింపచేసిన నాయకులలో గాంధీ అగ్రగణ్యుడు. ప్రజలు ఆయన్ని ‘‘మహాత్మ, జాతిపిత’’ అని గౌరవిస్తారు. సత్యం, అహింస గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని చాటారు. 20 శతాబ్దంలో ప్రపంచంలో గొప్ప విజేత అయ్యాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సత్యాగ్రహం, అహింస అనే శక్తివంతమైన ఆయుధాలతో గడగడలాడిరచి కూకటివేళ్లతో పెకలించి, దేశానికి 1947 ఆగస్టు 15 న స్వతంత్రాన్ని కానుకగా ఇచ్చిన గొప్ప మహానుభావుడు గాంధీ.
మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించాడు. 1888లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి ఇంగ్లాండ్ వెళ్లారు. 1893లో దక్షిణాఫ్రికాలో ఒక న్యాయవాద కంపెనీలో కాంట్రాక్టు లభించింది.
జాతీ వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమానికి అక్కడే శ్రీకారం చుట్టారు. సత్యగ్రహ పద్దతిని అనుసరించడం అప్పుడే మొదలుపెట్టారు. అంటరానితనం, కులవివక్షత, మత విద్వేషాలను గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. 1914లో గాంధీజీ భారతదేశాన్ని తిరిగి వచ్చి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో చురుకుగా పాల్గొనసాగాడు.
1917లో బీహార్‌లోని చంపారాన్ జిల్లాలో నీలిమందు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి చంపారాన్ ఉద్యమాన్ని నడిపాడు. 1918లో చంపారాన్‌లో సత్యాగ్రహం నిర్వహించాడు. ఈ కాలంలోనే గాంధీజీని ప్రజలు ప్రేమతో ‘‘బాపు’’ అని, ‘మహాత్ముడు’’ అని గౌరవంగా పిలవసాగారు. భారత జాతీయ కాంగ్రెసకు తిరుగులేని నాయకుడు అయ్యాడు. ఆయన రాకతో ఈ కాలంలో సాధారణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. గాంధీ నాయకత్వంలో దేశమంతటా మూడు అతిపెద్ద, గొప్ప జాతీయ ప్రజా ఉద్యమాలుసహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లేదా దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం జరిగాయి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. డూ ఆర్ డై నినాదం ద్వారా గాంధీజీ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాడు. 1942 ఆగస్టు 9న గాంధీజీని బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టుచేసి జైలుకు పంపింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇతర నాయకులను, లక్షమంది పైగా ఉద్యమకారులను బ్రిటిష్ వారు విడుదల చేశారు. క్రమక్రమంగా స్వాతంత్య్రం ఇస్తామని అంగీకరించారు. హిందూ
ముస్లిం మత విద్వేషాలను అదుపు చేయలేని నిస్సహాయస్థితిలో ప్రభుత్వం ఉంది. చివరికి 1947 ఆగస్టు 15న బ్రిటీషువారు భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చారు. లండన్‌లో చదువుకునే సమయంలో నిజాయితీ, నిగ్రహం పవిత్రత, శాకహారం అలవర్చుకున్నాడు. జైనమత ఆలోచనలైన కరుణ, శాకాహారం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ ప్రభావం గాంధీజీపై తీవ్రంగా పడిరది.
మహాత్మా గాంధీ తన జీవితాన్ని సత్యశోధనకు అంకితం చేశాడు. గాంధీజీ ఆత్మకథ పేరు సత్యశోధన, ఇంగ్లీషులో ద స్టోరీ ఆఫ్ మై ఎక్సెపరిమెంట్స్ విత్ ట్రూత్. గాంధీజీ మొదట ‘‘దేవుడు సత్యంగా’’ పేర్కొన్నప్పటికీ తర్వాత ‘‘సత్యమే దేవుడు’’ తన తత్వంగా పేర్కొన్నాడు. అహింసను కనిపెట్టింది గాంధీ కాదు కానీ, అహింసను భారీ స్థాయిలో రాజకీయాల్లో ఉపయోగించిన వ్యక్తి గాంధీజీ. అహింసా సిద్ధాంతాన్ని బౌద్ధ, జైన, హిందూ, క్రైస్తవ మతాలలో అనేకసార్లు పేర్కొన్నాడు. అంటరానితనం నేరం, శాపం, పాపం, అమానుషం, అపచారం, అనాగరికం అని ఎంతోమంది మేధావుల పేర్కొన్నారు. అంటరానితనం నిర్మూలనకు గాంధీ ఎంతో కృషి చేశారు. హిందూ`ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ ఎంతగానో కృషి చేశారు. గ్రామాలలో కుటీర పరిశ్రమల స్థాపనకు బాగా ప్రాధాన్యతనిచ్చారు. మానవ అవసరాలు తీరటానికి కుటీర పరిశ్రమలు స్థాపించాలన్నాడు. సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించాడు. విద్యా విధానాన్ని కూడా మార్చి పిల్లల నైపుణ్యాన్ని పెంచే విధంగా విద్యావిధానం ఉండాలన్నారు. ఆయన విలువలు, సిద్ధాంతాలు నాటికి నేటికి ఏనాటికి, సూర్యచంద్రులు ఉన్నంతవరకు మనకు ఆదర్శ ప్రాయమైనవి, స్ఫూర్తిదాయకమైనవి, ఆచరణాత్మకమైనవి, మార్గదర్శకమైనవి. శిరోధార్యమైనవే !