చింతపట్ల సుదర్శన్
నమిలిందే ఎంతసేపు నమలడం. ఎంత నమిలినా నోటికి వచ్చిందేమీ లేదు, పళ్ల నొప్పులు తప్ప. ఈ మధ్య ఎముకకు ఏమాత్రం మాంసం మిగలకుండా పూర్తిగా గీకేసి పారేస్తున్నాడు అనుకున్న డాగీ, ఎముక విసిరేసి రోడ్డంట తిరుగసాగింది. కడుపులో ఎలుకలు టెన్నిస్ ఆడుకుంటు న్నట్టుంది కాదు, ఫుట్‌బాల్ ఆడుకుంటున్నట్టుంది అనుకుంటూ నీరసంగా నడుస్తున్నప్పుడు కనపడిరది అది. అదేమిటంటే ఓ బ్రెడ్డు ప్యాకెట్టు. బ్రెడ్డు ప్యాకెట్ గాలిలో ఎగుర్తూ కనపడదు కదా. ఓ అమ్మాయి ఎడమచేతిలో కదుల్తున్నది. ఆ అమ్మాయి కుడిచేతిలో సెల్‌ఫోన్ ఉంది. అమ్మాయి ఎడం చేతిలో ఊగులాడ్తున్న పాకెట్ చూడగానే డాగీ నాలుక నుంచి నీళ్లూర సాగినయి.
ఎలా? ఎలా? ఎలా? ఎలాగో అలా ఆ బ్రెడ్డు దక్కించుకుంటే కడుపును ‘శాంతినికేతన్’ చెయ్యవచ్చు అనుకుంది డాగీ. కుక్కే కాని నక్కలా నక్కుతూ ఆ అమ్మాయిని అనుసరించింది. అవకాశాలు వాటంతట అవి రావు, కష్టపడి సంపాదించుకోవాలి అని ఓపిగ్గా, నిశ్శబ్దంగా అనుస రించింది. అమ్మాయి కన్నూ, చెవీ సెల్‌ఫోన్‌లో ఉన్నవి. మరో చేత పట్టుకున్న బ్రెడ్డు ప్యాకెట్ మీద ధ్యాస లేనట్టున్నది. మంచి తరుణం మించిన దొరకదు అనుకున్న డాగీ చుట్టూ చూసింది. సమీపంలో నర మానవ మనుష్యుడెవ్వడూ లేదు. వేగంపెంచింది. పరుగెడ్తూనే నాలుగు కాళ్లూ ఎత్తి జంపు చేసింది. అమ్మాయి చేతిలో ఉన్న ప్యాకెట్టు నోటితో అందుకుని కుక్కే అయినా, రేసు గుర్రంలా పరుగెట్టింది. అమ్మాయి ‘షాక్’ తగిలినట్టు నిలబడిపోయింది ఫోను మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకుంది. అప్పుడే ఆ వైపు వచ్చి అంతా చూసిన ఓ ముసలమ్మ ‘బ్రెడ్డు పోతే పోయింది కరవలేదు నయం ఇంజక్షన్లు పొడిపించుకోవల్సి వచ్చేది’ అని అమ్మాయిని ఊరడిరచింది.
వెనక్కి తిరిగి చూడకుండా, నోట కరిచిన బ్రెడ్డు ప్యాకెట్ జారిపోకుండా వచ్చి అరుగు ఎక్కింది డాగీ. అప్పుడే అరుగు ఎక్కి రెస్టు తీసుకుంటున్న డాంకీకి డాగీ నోటి నిండా పట్టుకు వచ్చిందేమిటో అర్థం కాలేదు. బ్రెడ్డు ప్యాకెట్టు చించడానికి తంటాలు పడసాగింది డాగీ. ఏంటి ‘బ్రో’ కొట్టులోంచి కొట్టుకు వచ్చావా అంది డాంకీ. అప్పటికి ప్యాకెట్ చించేయడంతో హుషారుగా ఉంది డాగీ. కొట్టులోంచి కాదు, ఓ సెల్లున్న అమ్మాయి చేతినుంచి కొట్టుకొచ్చా అంది. దొంగతనం పాపం కదా. దొంగల్ని పట్టుకోవలసిన కుక్కే దొంగయితే కంచే చేను మేసినట్టు కాదా అంది డాంకీ. నేరం నాది కాదు ఆకలిది. రోటీ, కపడా, మకాన్ హక్కు మనుషులకేనా, నాలుక్కాళ్ల జీవాలకు లేవా అని కోప్పడిరది డాగీ. తల నుండు విషము ఫణికి, తోక నుండు వృశ్చికమునకు, మనిషికి నిలువెల్ల విషము అని నాకూ తెల్సు కానీ మనుషులు నీతి తప్పడం మామూలేకద. మనం మన సహజ గుణాలను వదులుకో రాదు మరి అంది డాంకీ పళ్లికిలిస్తూ.
అప్పుడొచ్చాడు అబ్బాయి. అప్పటికి ఐదారు బ్రెడ్డు స్లయిసులు నమిలి స్థిమితపడ్డది డాగీ. చూడు ‘బ్రో’ ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మనూ, కడుపునూ క్షోభ పెట్టలేక ఓ బ్రెడ్డు పాకెట్టు, అదీ సెల్‌ఫోన్ మైకంలో నడిచెళ్తున్న అమ్మాయి చేతిలోంచి లాక్కు వచ్చానని, మనుధర్మ శాస్త్రం చదివి వినిపిస్తున్నది డాంకీ అని కంప్లయింటు చేసింది డాగీ. అదికాదు తంబీ, ఈ డాగీ ఏం చేసిందంటే అని చెప్పబోతున్న డాంకీని మధ్యలో ఆపి, నాకంతా తెల్సు డాగీ నోటంట చొంగ కారుస్తూ అమ్మాయి వెంట పరుగెత్తడం నేను చూశా, తర్వాత జరిగింది ఊహించగలను. ఇదేం పెద్ద పాపం అనిపించదు నాకు. అధికారంలో ఉన్న పార్టీలోకి జొరబడితే, ఏదైనా పదవి దక్కదా, మెక్కడానికి సొమ్ము చిక్కదా అని, ఇతర పార్టీ ప్రజాప్రతినిధులు చొంగ కారుస్తూ, అవకాశం కోసం అర్రులు చాచటం గుర్తుకు వస్తోంది. చదువూ, తెలివీ అన్నీ ఉన్న మనుషులే జంపు జిలానీలవడానికి చొంగ కారుస్తూ, లేని తోకలు ఊపుతూ, ఉరుకులూ పరుగులూ పెడ్తుంటే, కేవలం ఒక్క పూట కడుపు నింపుకోడానికి డాగీ చేసింది, నరకంలో పామాయిల్‌లో వేయించాల్సిన తప్పేం కాదు, పార్టీలు మార్చి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి దూరి, కాళ్లు పట్టుకునే మనుషుల్ని పొయ్యిలో పెట్టాలసలు అన్నాడు అబ్బాయి.
పట్టుమని పన్నెండు మంది లేని పార్టీ కూడా ప్రతిపక్ష హోదా అడగడమంటే అర్థం ఏమిటి, ఏదో ఒక హోదా పదవీ లేకుండా ఏ నేతా ప్రశాంతంగా బతకలేడనే కదా అంది డాగీ. ప్రతిపక్షంలో ఒకవేళ ఏ పార్టీ వాళ్లన్నా మిగిలితే, ప్రజల సమస్యల్ని గాలికి వదిలి బురదా, దుమ్మూ ఎత్తిపోయడమే పనిగా పెట్టుకుంటున్నారు. వాళ్లూ, వీళ్లూ నోళ్లు నొప్పి పుట్టేట్టు తిట్టుకుంటున్నారు. దీన్ని బట్టి తెలిసేదేమిటి పదవి లేకుండా ఏ రాజకీయ నాయకుడూ ఒక్క రోజు కూడా ఉండలేడని, ఐదేళ్లు ఆగే ఓపిక అసలు ఎవరికీ ఉండదని అన్నాడు అబ్బాయి.
పరమత సహనమూ లేదు, పర పార్టీ సహనమూ లేదు, ప్రజల సమస్యలు పట్టవు. అధికారంలో ఉన్నవాడ్ని కిందికి లాగడమే, తక్షణ కర్తవ్యం, మన ఘనత వహించిన నాయకులకి అన్నది డాంకీ.
కోట్లకి కోట్లు కుంభకోణం చెయ్యలేదు. ఆకలికి తట్టుకోలేక నాలుగు బ్రెడ్డు స్లైసుల కోసం చొంగ కార్చాను తప్పా అంది డాగీ.