నటిగా, మోడల్‌గా కంగనా రనౌత్ కు మంచి పేరే ఉంది. కానీ ఆ మంచి పేరు నిలబెట్టుకోవడం మీది కన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిరంతరం వార్తల్లో ఉండడం ఆమెకు ఇష్టం అనిపిస్తోంది. 38 ఏళ్ల కంగనా రనౌత్‌్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి లోక్‌సభలో బీజేపీ ప్రతినిధిగా ఉన్నారు. కొంతకాలం మోడలింగ్ చేసిన తరవాత రంగస్థల నటిగా తన నైపుణ్యం ప్రదర్శించారు. మోడలింగ్‌లో సృజనాత్మకత లేదనుకుని రంగ స్థలాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుంచి ఆమె సినీనటి అయిపోవడం అత్యంత సహజమైన పరిణామమే. వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనే ఎవరితోనో ఒకరితో గొడవపడడం ఆమెకు సరదా కాబోలు. మొదటి నుంచి ఆమెలో దూకుడు స్వభావం ఉంది. చిన్నప్పుడు తండ్రి తన సోదరుడికి బొమ్మ తుపాకీ కొనుక్కొచ్చి తనకు బొమ్మ కొనిస్తే అలిగింది. తనకూ తుపాకీ బొమ్మే కావాలని మారాం చేశారు కంగన.
సుశాంత్ రాజ్‌పూత్ మరణించినప్పుడు శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆ దశలో శివసేనలో నోరున్న నాయకుడు సంజయ్ రౌత్ ఆమెను చంపేస్తామని బెదిరించారు. దానితో ఆమెకు భద్రత కల్పించవలసి వచ్చింది. కంగన సామాజిక మాధ్యమాలలో కూడా చురుకుగా ఉంటారు. అక్కడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కుంటారు. తాజాగా కంగనా రనౌత్‌్ మోదీ ప్రభుత్వం రద్దు చేసిన మూడు వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పునరుద్ధరించాలని అనడం పెద్ద వివాదానికి దారి తీసింది. ప్రతిపక్ష నాయకులు ఆమె మీద ఆగ్రహిస్తున్నారు. రైతుల ఉద్యమాన్ని విమర్శించడం ఆమెకు కొత్త కాదు. ఇదివరకూ అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ సందర్భంలోనే చండీగఢ్ విమానాశ్రయంలో కేంద్ర పరిశ్రమల భద్రతా దళానికి చెందిన ఒక మహిళ కంగనా రనౌత్‌్ ను చెంపదెబ్బ కొట్టారు. అది తప్పే కావచ్చు. కానీ రనౌత్‌్ తన మునుపటి గుణాన్ని మాత్రం మార్చుకోలేదు. మార్చుకుంటారన్న ఆశా లేదు.
రనౌత్ ఏ విషయమైనా వ్యాఖ్యానించేటప్పుడు ముందు వెనకలు ఆలోచిచే తత్వం ఉన్నవారు కాదు. రైతు ఉద్యమంలో హర్యానా రైతుల పాత్ర గణనీయమైంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోకుండా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసి తాను నమ్ముకున్న బీజేపీనే ఇరుకున పెట్టారు. హర్యానా శాసనసభ ఎన్నికలలో బీజేపీకి విజయావకాశాలు తక్కువ అన్న అంచనాలు ఉన్న సమయంలో రనౌత్‌్ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను పునరుద్ధరించాలని కోరడం బీజేపీ నాయకత్వానికి పెద తల నొప్పిగా తయారైంది. ఆమె వ్యాఖ్యలకు హర్యానాలో తీవ్ర నిరసనకు దారి తీశాయి. అసలే గెలవడానికి నానా తంటాలు పడ్తున్న బీజేపీకి రనౌత్‌్ వ్యాఖ్యలు గొంతులో పచ్చి వెలక్కాయలా తయారయ్యాయి. ఆమెకు మండీ నుంచి లోకసభ ఎన్నికల్లో సీటిచ్చి ఎందుకు గెలిపించామా అని బీజేపీ నాయకులు తల పట్టుకునే పరిస్థితి ఎదుర్కుంటున్నారు. 2020లో దిల్లీ పొలిమేరల్లో ఏడాదికి పైగా కొనసాగిన రైతు ఉద్యమంలో హర్యానా రైతులు కీలక పాత్ర పోషించారు. ఆ విషయాన్ని కూడా రనౌత్ గుర్తు పెట్టుకోక పోవడం ఆమెలో గూడు కట్టుకున్న ప్రచార కాంక్ష తీవ్రత అర్థం అవుతుంది.
వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను పునరుద్ధరించాలని కోరడంతో రనౌత్‌్ ఆగలేదు. అవి రైతులకు మేలు చేస్తాయని రైతు ఉద్యమ సందర్భంగా మోదీ, ఆయన మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి చేసిన వితండ వాదాన్ని కొనసాగించారు. పైగా కంగన అక్కడితో ఆగకుండా రైతులు మన దేశానికి ముఖ్యమైన మూలస్తంభం అని కూడా అన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అధికార వర్గాలకు, ప్రభుత్వోద్యోగులకు మేలు చేస్తాయని అందువల్ల రైతులు సైతం తమకు మేలు చేసే వివాదాస్పద వ్యవసాయ చట్టాలను పునరుద్ధరించాలని కోరాలని కూడా అడగకుండానే ఉచిత సలహా పారేశారు. ఈ వ్యవసాయ చట్టాలను కూన్ని రాష్ట్రాలు మాత్రమే వ్యతిరేకించాయని తన వితండవాదాన్ని మరింతగా సాగదీశారు.
రనౌత్‌్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇరుకున పెడ్తాయి గనక బీజేపీ ఆమె వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నారు. పదే పదే రనౌత్‌్ వివాదాస్పదంగా మాట్లాడే తత్వాన్ని కట్టడి చేయడం బీజేపీ నాయకత్వానికి సాధ్యం కావడం లేదేమో. లేదా రాజకీయ కారణాలవల్ల తాము రైతులను ఉప సంహరించుకున్నా తమ అసలు ఉద్దేశం వాటిని ఏదో ఒక రూపంలో అమలు చేయడమే కనక రనౌత్‌్ లాంటి వారు చేసే అప్రస్తుత ప్రసంగాన్ని మౌనంగా సమర్థిస్తూనైనా ఉండాలి. బీజేపీ అధినేతలు మొట్టికాయలు వేసిన తరవాత సేద్య చట్టాలను పునరుద్ధరించాలని తాను కోరడం తన సొంత అభిప్రాయమే తప్ప బీజేపీ అధికారిక అభిమతం కాదని రనౌత్ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె సంజాయిషీ ప్రతిపక్షాలకు సంతృప్తి కలిగించలేదు. బీజేపీ విధానమే కంగనా రనౌత్‌్ వెల్లడిస్తున్నారని ప్రతిపక్షాలు దుయ్యబడ్తున్నాయి. రనౌత్‌్‌కు స్వామి వివేకానంద అంటే ఇష్టమట. ధ్యానం చేయడంవల్ల చాలా మేలు కలుగుతుందని, చిత్త ప్రశాంతత కలుగుతుందని ఆమె అంటున్నారు. నిజంగా ఆమెకు ధ్యానం మీద అంత నమ్మకమే ఉంటే నిరంతరం వివాదాల్లోకి దిగే అలవాటు ఎప్పుడో విడనాడే వారు. ఆమె చిత్తశుద్ధితో ధ్యానం చేయలేక పోతున్నారేమో. ధ్యానం మీద దృష్టి పెట్టడం మంచిదని ఆమె ఎప్పుడు గ్రహిస్తారో! చిత్త శుద్ధితో ధ్యానం చేయడం అలవరచుకుంటే నోరు అదుపులో ఉంటుందని ఆమెకు ఎప్పుడు అర్థం అవుతుందో మరి! మంచి నటి అయినంత మాత్రాన సదాలోచన ఉండాలని లేదుగా!
అనన్య వర్మ