‘‘హరి గారు డ్రాప్‌కి ఎన్ని ఓకులుండాలండి’’ చాలా వినమ్రంగా కుడి అరచేతిని ఎడమ చెవి కింద రాస్తూ అడిగాడు పీకే. ‘‘నువ్వేందయ్యా పీకే. ఆటలో కూర్చున్న దగ్గర నుంచి డ్రాప్ డ్రాప్ అంటావు’’ ఎనిమిది పదుల వయసు దాటినా ఎలాగైనా పీకేని గెలిపించాలని తాపత్రయ పడుతున్న హరి జోగయ్య కాసింత ఆసహనంగానే అన్నారు. ‘‘హ… హ… నాకు గెలవడం కంటే మా బాబును గెలిపించడంలోనే ఆనందం హరిగారు. అందుకే ఈ సారి కూడా డ్రాప్ అయిపోదామని’’ చేతిలో ఉన్న కొన్ని కాగితాలని తదేకంగా చూస్తూ అన్నాడు పీకే. హరిగారు పది రోజుల క్రితం పీకేకి 70 మంది పేర్లు రాసి పంపిన ఉత్తరం అది. ‘‘నాకు తెలుసు పీకే నీ గురించి. నువ్వు ఏం చేసినా నా కోసరమే చేస్తావ్. నా కోసరమే ఆలోచిస్తావ్. డ్రాప్‌కి ఎన్ని ఓకులుండాలో హరిగార్ని అడిగితే ఎలా. అమాయకుడివి కాకపోతే. నన్ను అడుగు. నే చెప్తా’’ అన్నారు వీరిద్దరి సంభాషణని దూరం నుంచి వింటున్న బాబు. అప్పుడు సమయం ఉదయం 10 గంటలైంది. మరో గంటన్నరలో ఎక్కడెక్కడ ఎవరెవర్ని రంగంలోకి దించుతున్నారో బాబు, పీకే ప్రపంచానికి ప్రకటిస్తారు. ఇదిగో ఈ ప్రకటన కోసమే అటు పీకేని నమ్ముకున్న సైనికులు, ఇటు ‘‘మా బాబే… మా 40 ఏళ్ల అనుభవమున్న నాయకుడే. అబ్బే నన్నే రంగంలోకి దింపుతారు. నా పేరే ప్రకటిస్తారు’’ అని టీవీల ముందు కుటుంబాలతో సహా అతుక్కుపోయిన తమ్ముళ్లు అనుకుంటున్నారు. అదిగో అలాంటి సమయాన, ఆ అద్భుత ఆనంద వేళ ఈ పేకాట, డ్రాప్‌కి ఎన్ని ఓకులు అంటూ మాట్లాడతారేమిటి అనుకుంటున్నారు అక్కడున్న కొందరు సీనియర్ తమ్ముళ్లు, మరికొందరు సీనియర్ సైనికులు. ‘‘తమ్ముడూ పీకే. నీకు డ్రాప్ అంటే ఎంతిష్టమో నాకు తెలుసు. ఆ డ్రాప్‌కి ఉన్న ఓకులు కూడా నీకు చాలా ఇష్టమని నేను ఎప్పుడో గ్రహించాను. ఆట ప్రారంభం కావడానికి ముందే నువ్వు డ్రాప్ అయ్యేలా చేసే బాధ్యత నాది. మీ సైనికులకి నచ్చ చెప్పు. ఏడాదిగా నువ్వు మాట్లాడుతున్నదే మళ్లీ తిరగేసి, మరగేసి చెప్పు. మీ సైనికులకి నీ మీద పిచ్చి ప్రేమ. పైగా వారంతా వీరాభిమానులు. మనం ఇద్దరం కలిసి ఆడితే ఈ ఫూల్ గేమ్ కొట్టేయచ్చు అని వివరించు. రెండు రోజులు లేదూ మూడు రోజులు మహా అయితే ఓ వారం అలుగుతారు. ఆగ్రహంగా ఉంటారు. ఇవన్నీ నీకు నేను చెప్పనవసరం లేదు. నీకు తెలుసనుకో’’ అని గాజు గ్లాసులో పావు వంతు టీ పోస్తూ సైకిలోపదేశం చేశారు బాబు. ‘‘హ. హ. అలాగే బాబు గారు. మా సైనికుల గురించి నే చూసుకుంటా. ఇంతకీ నాకు ఎన్ని ఓకులు కేటాయిస్తారు. అంటే డ్రాప్ చేసేందుకు వీలుగా’’ అన్నారు పీకే. ‘‘తమ్ముడూ… నువ్వు ఆ మధ్య గోపాలా గోపాలా సినిమాలో అన్నావు చూడు ఓ మాట నీకు ఎన్ని కావాలో అన్నే ఇస్తాను. అని… అలాగే ఇదీనూ’’ పైకి వస్తున్న నవ్వుని లోపలికి తోసేస్తూ చెప్పారు బాబు. ‘‘హ. హ. మీరేం చెబితే అదే. మీరన్నట్లు మా సైనికులు అభిమానులే కాదు… అమాయకులు కూడా. వాళ్ల సంగతి నాకొదిలేయండి’’ ఈ సారి కుడిచేత్తో ఎడమ చెవి కింద రాయకుండా…. వెరైటీ కోసం కుడి చేతి వేళ్లతో చాలాకాలంగా కటింగ్‌కు నోచుకోని జుట్టుని వెనక్కి నెడుతూ ఓ అలవికాని ఆనందంతో అన్నారు పీకే. ‘‘సరే విషయానికి వద్దాం. ఈసారి నీకు డ్రాప్‌కి అవసరమైన 24 కేటాయిస్తున్నాను. నీకు ఆనందమేగా. సంతోషమేగా’’ అన్నారు బాబు. ‘‘ఆహా మహా ప్రసాదం. అహా, అద్భుతం. ఓహో మీరు అమోఘం. అసలు మీ విజనరీ ముందు ఎవ్వరూ పనికిరారు. తమ్ముడు నాదెండ్లా… నాయనా హరీ… ఆ పాత పాట సరిలేరు నీకెవ్వరూ… ఆంధ్రపాల బాబూ.. సరి లేరు నీకెవ్వరు పాట పెట్టండి. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలు మరచిపోకూడదని నే చదివిన రెండు లక్షల పుస్తకాల్లో ఓ పుస్తకంలో రాసుంది. అన్నయ్యా నాగూ… ఎల్. విజయలక్ష్మిలా డాన్సు చేయి అన్నా’’ అన్నారు. ‘‘తమ్ముడూ… ఓ మాట ఈ 24 ఎందుకో బాగోలేదు. మరీ దొరికిపోతామేమో… ఆ నంబర్‌ని 23 చేస్తే మంచిదని నాకెందుకో అనిపిస్తోంది. ఇలా అయితే మహా జబర్‌దస్త్‌గా ఉంటుందనీ’’ అంటూ సలహా ఇవ్వబోయారు అక్కడే ఉన్న నాగులన్నయ్య. ‘‘నో… నెవ్వర్… వద్దు బ్రదర్. అస్సలొద్దు….’’ ఉన్నట్టుండి బాబు గారి ముఖం ఆగ్రహంగా మారింది. ‘‘నాన్నారు… ఎందుకీ ఈకాలపు ఆగ్రహం’’ అన్నారు పచ్చి మిరపకాయ బజ్జీల ప్లేటులోంచి ఓ బజ్జీ తీసుకుని ఓ అలౌకికానందం అనుభవిస్తున్న ఫుడ్డేష్. ‘‘బాబూ ఫుడ్డేష్. ఈకాలపు కాదురా. అకాలపు అనాలి. ఏళ్లు గడుస్తున్నా నీకు తెలుగు రాకపోగా తెగులు తగ్గడం లేదు’’ అంటూ విచారంగా అన్నారు అక్కడే ఉన్న టెక్కలి వారబ్బాయి. ‘‘ వద్దు… వద్దు… వద్దే వద్దు. ఈ 23 మాట నా చెవిన పడకూడదు. మనం అధికారంలోకి వచ్చాక ఈ 23 ని నిషేధిస్తూ నేను తొలి సంతకం చేస్తా’’ కాసింత ఆగ్రహం తగ్గించి అన్నారు బాబు. ‘‘పోనీ 25 చేస్తే’’ నాగులన్నయ్య చాలా ఉత్సాహంగా అన్నారు. మళ్లీ గట్టిగా ‘‘నో’’ అని వినిపించింది. ఈ సారి అందరూ బాబు వైపు చూశారు. ఆక్కడి నుంచి కూడా కాదు ఆ పొలికేక. తలలు తిప్పి చూస్తే ఆ కేక వచ్చింది పీకే నుంచి. దూరంగా కెవ్వు కేక… కెవ్వు కేక అని పాట వినిపిస్తోంది. ‘‘వద్దు. వద్దు. ఆ పావలా మాట నాకు వినపడకూడదు. మనం అధికారంలోకి వస్తే ఈ పావలాని కూడా నిషేధిస్తూ సంతకం చేయమని బాబుగారికి నా విన్నపం’’ అన్నారు. ‘‘ఇవన్నీ ఎందుకు లెండి. ఆ 24 ఖాయం చేయండి.’’ అన్నారు ఎవరో. ఎవరి నుంచి ఆ మాట వచ్చిందా అని అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక్క పీకే మాత్రమే తల దించుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.
సీనియర్ జర్నలిస్టు, ఫోన్: 9120 19929