డా.సోమ మర్ల
ప్రకృతి విపత్తులు పెరగడానికి, జీవావరణం మొత్తం చెప్పలేనంతగా కలుషితం కావడానికి పాలకులే ప్రధాన కారణం. ప్రజలుసైతం ఈ విషయాలను అంతగా పట్టించుకోవడంలేదు. కేరళలో ఇటీవల కొండచర్యలు విరిగిపడి సృష్టించిన బీభత్సంలో దాదాపు 300మందికిపైగా మరణించారు. అంతకంటే ముఖ్యంగా విస్త్రతప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వివిధప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, కొండపైనుంచి దిగువకు బురదతోకూడిన వరద రావడం వలన మట్టిదిబ్బలకింద పడి అమాయకప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అవివేకంతో ‘అభివృద్ధి’ కార్యకలాపాలను చేపట్టి ప్రకృతికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని చెప్పడానికి కేరళలో జరిగిన ఘోరవిపత్తు తిరుగులేని తార్కాణం. ప్రకృతి విధ్వంసానికి గురికావడానికి మనుషులు జోక్యం మితిమీరిపోవడం, కొండల సానువుల్లో భవనాలు, రహదారులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల నిర్మాణంలాంటివి చేపట్టడం వలన భారీ వర్షాలు సంభవించినప్పుడు కొండచర్యలు విరిగిపడుతూ మానవ విపత్తుకు దారితీస్తున్నాయి. బొగ్గు, అనేక ఇతర ఖనిజాలు వెలికి తీయడానికి తవ్వుతున్న గనులమూలంగా కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. సొరంగాల నిర్మాణం, క్వారీల తవ్వకాలు నాలుగైదులైన్లు, ఆరులైన్ల రహదారుల విస్తరణ, అడవుల నరికివేత, వ్యవసాయరంగంలో వినియోగిస్తున్న ప్రమాదకరమైన రసాయనాలు, కృత్రిమ ఎరువుల వినియోగం, క్రిమిసంహారక పురుగుమందులు చల్లడం వంటి అనేక కార్యకలాపాలు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాయి. కేరళలోనూ అటవీ ప్రాంతాలలో చెట్లు నరికివేయడం, టూరిజాన్ని పెంపొందించడానికి కొండకోనల్లో భవనాల నిర్మాణం, పర్వత సానువుల్లో కాఫీ తోటల పెంపకం ఇవన్నీ పర్యావరణం సున్నితమైన ప్రాంతాల్లో ఎనలేని కాలుష్యంతో నిండిపోవడం పశ్చిమకనుమల్లో విపత్తులకు ప్రధానకారణం. ఒక్క కేరళలోనేకాదు, దేశవ్యాప్తంగా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. సామాన్య ప్రజలకు ఇల్లు కట్టించడానికి, తగినంత ఆహారం విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోలేకపోయినా తక్కువ శాతం మందికి సౌకర్యాలు కల్పించడంకోసమే అరులైన్ల రహదారుల విస్తరణ ఎక్కువగా జరుగుతోంది. కేరళలో కొండచరియలు విరిగిపడి కొన్ని రోజులుగా వందలమంది మరణించడం, ఇంకా ఇతర కష్టాలు కలగడం ఎంతో బాధాకరం. కేరళలోనేకాదు, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాలలోనూ ప్రకృతి ప్రకోపించి భారీ వర్షాలు కురవడంవలన అనేక పదులమంది మరణించారు. ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. కేరళ, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాలలో గత కొద్దిరోజులుగా కొండచరియలు విరిగిపడడం, బురదతోకూడిన వరదలప్రవాహం కారణంగా ప్రజలు ఎనలేని కష్టాలుపడుతున్నారు. అనేకవందలమంది చనిపోవడం, కనిపించకుండా పోవడం జరిగింది. ఈ సమయంలో బాధితులను ఆదుకోవలసిన బాధ్యతను విస్మరించి కేంద్ర హోంమంత్రి కేరళపైన నిందలువేశారు. ముందుగా బాధితులకు తగినంతగా ఆర్థికసహాయాన్ని ప్రకటించడం, ఆ ప్రాంతాలకు అవసరమైన పరికరాలను పంపించడం ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయడంలాంటివి ప్రభుత్వ బాధ్యతలు. కార్బన్‌డై ఆక్సైడ్, మిథేన్‌ల నుంచి వెలువడే ఉద్గారాలు (విషతుల్యవాయువులు) భూమిపైన వాతావరణాన్ని అమితంగా వేడెక్కించడం, ధరిత్రి అంతా ఎండలు భగభగా మండిపోవడం లాంటి కారణంగా వేలాదిమంది చనిపోవడమేకాక అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. ఇన్‌ఫ్రా రెడ్ రేడియేషన్ పెరగడం వలన భూమిమీద, సముద్రాలలో ఉష్ణోగ్రతలు అపారంగా పెరుగుతున్నాయి. 60ఏళ్లక్రితం ఉన్న వాతావరణాన్ని పరిశీలించినట్లయితే ఆనాడు భూ ఉపరితల వాతవరణంలో విషవాయువుల రేణువులు 282 పిపిఎమ్ ఉండగా, నేడది 421 పిపిఎమ్‌లకు చేరింది. 2019లో జపాన్‌లోని కొజిహిషిముటో ప్రాంతంలో కలుషిత రేణువులు 252 పిపిఎమ్‌లుగా నమోదైంది. రుతుపవనాల సందర్భంగా సముద్రాలనుంచి నీటి ఆవిరి పైకివెళ్లి మేఘాలు ఏర్పడుతున్నాయి. అవి వర్షాలను కురిపిస్తున్నాయి. ప్రస్తుతం సముద్రజలాలు అపారంగా వేడెక్కి అత్యధికంగా నీటి ఆవిరి పైకి తేలుతున్నది. ఈ ఆవిరి మేఘాలుగా మారి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2500 కిమీ పైకి వెళ్లుతున్న నీటి ఆవిరి వర్షాలను కురిపిస్తోంది. ఆవిరులు పైకి ఎగిసి ఆ ప్రాంతంలో మేఘాలు 1500 కిమీ విస్తీర్ణం వ్యాపిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ నదిలో నిత్యం పారుతున్న నీటికి సమంగా భూమిపై వాతావరణంలో నీటి ఆవిరులు చేరుతున్నాయి. వేసవికాలం ముగిసినతర్వాత నీటిఆవిరులు ప్రపంచం అంతటా భూ మధ్య రేఖాంశం మీదుగా ప్రయాణించి కాలిఫోర్నియా, ఫ్లోరిడా అక్కడనుంచి భారత్‌మీదుగా విస్తరిస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి వేడి వాయు తరంగాలు(కేరళ విషయంలో జరిగింది ఇదే) అతి భారీ వర్షాలు కురవడానికి కారణమవుతున్నాయి. అతితక్కువ వ్యవధిలో వడగళ్లతో కూడిన కుండపోత వర్షాలు హిమాలయాలలో, పశ్చిమకనుమల్లో కురుస్తున్నాయి. హిమాలయాల్లో కురిసే భారీ వర్షాలమూలంగా మంచుదిబ్బలు కరిగిపోతున్నాయి. ఫలితంగా అతి పెద్ద రాళ్లు, భారీ బురద కిందకు ప్రవహిస్తున్నాయి. కేరళలోని వయనాడ్ ప్రాంతంలో జరిగింది కూడా ఇదే. వీటి ఫలితంగా 1.5సెంటిగ్రేడ్ డిగ్రీల వాతావరణం ఏర్పడి అత్యంత భారీ ఎండలు పెరుగుతున్నాయి. 1960ల నుంచి వాతావరణంలోకి చేరుతున్న నీటి ఆవిరులు 20శాతం పెరిగాయని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఫలితంగా నదులు పెరిగి కొండచరియలు విరిగిపడడం,భారీ వరదలు సంభవిస్తున్నాయి.1998`2022 మధ్యకాలంలో 80వేల సార్లు కొండచరియలు విరిగిపడ్డాయని అధికారిక శాస్త్రీయ అంచనాలు. ఇవి 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 147 జిల్లాల్లో జరిగాయి. అత్యంత గరిష్టంగా ఉత్తరాఖండ్, కేరళ, జమ్ముకాశ్మీర్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచలప్రదేశ్, మిజోరంలలో ఎక్కువగా సంభవించాయి. ఈ జాబితాలో కేరళ గరిష్టస్థాయిలో ఉంది. ఆ తరువాతి స్థానంలో ఉత్తరాఖండ్ ఉంది.
వాతావరణ సున్నిత ప్రాంతాలు:
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమకనుమల ప్రాంతాలు అధిక వాతావరణ సున్నిత ప్రాంతాలు. ఈ ప్రాంతాలు అత్యధిక జీవ వైవిధ్యంతో నిండిఉన్నాయి. ఇక్కడ వందలాది రకాల చెట్లు, పక్షులు, జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే అత్యంత ప్రముఖమైన సైలెంట్ వాలీ ఉంది. వయనాడ్ కూడా అత్యంత సున్నితమైన వాతావరణం కలిగిఉంది. ఈ ప్రాంతాన్ని యునెస్కో వాతావరణ వారసత్వ ప్రాంతంగా గుర్తించారు. పశ్చిమకనుమల ప్రాంతంలో 50 మిలియన్లకుపైగా ప్రజలు నివసిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలకుగురైన కేరళలో 5మిలియన్లమంది ప్రజలు నివసిస్తున్నారు. అధికంగా నివాసాలుఉన్న ప్రాంతంలో వాతావరణానికి సంబంధించిన నష్టంఎక్కువగా ఉంది. అటవీ ప్రాంతాన్ని వ్యవసాయానికి, వివిధరకాల తోటలు పెంపకానికి ఉపయోగించడం వలన సహజంగా ఉన్న భూమి మార్పునకు లోనవుతుంది.
మాధవ్‌గాడ్గిల్ నివేదిక
సున్నిత వాతావరణజోన్‌లో నిర్మాణ కార్యక్రమాలను చేపట్టవద్దని కోరుతూ 2011లో ప్రొఫెసర్ మాధవ్‌గాడ్గిల్ నాయకత్వంలోని అధ్యయన బృందం తమ నివేదికను కేంద్ర వాతావరణ శాఖకు అందచేసింది. పశ్చిమకనుమల్లో వాతావరణ నిపుణులబృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ జోన్‌లో క్వారీల తవ్వకం, రెడ్ కేటగిరీ పరిశ్రమలను అనుమతించవద్దని పరిశ్రమలను కోరింది. అయితే ఆ తర్వాత కాలంలో వచ్చిన ప్రభుత్వాలన్నీ ఈ నివేదికను విస్మరించాయి. అభివృద్ధిపేరుతో చేపట్టిన కార్యకలాపాలు చివరికి పర్వతప్రాంతాల్లోని వాతావరణ వ్యవస్థ అంతా నాశనమైంది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో నివసిస్తున్నవారంతా కార్మికులు, ఆదివాసీలు. టీ, కాఫీ,యాలకుల తోటల్లో పనిచేసేందుకు వలసవచ్చిన ప్రజలంతా ఈ విపత్తుకు గురయ్యారు. ఇళ్లు, షాపులు పరిశ్రమలు, వివిధరకాల వాహనాలు ధ్వంసమయ్యాయి. సహాయ శిబిరాలను నడపడంతోపాటు న్యాయమైన నష్టపరిహారాన్ని, జీవనాధార పునరావాస కేంద్రాలను సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలి. మన దేశంలో ఆధునికమైన ముందుగానే హెచ్చరించే వాతావరణకేంద్రాలు ఉన్నాయి. వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. తుపానులు రావడానికి కనీసం 3రోజులు ముందుగానే ప్రజలను హెచ్చరిస్తున్నారు. ముందుగానే ఊహించలేని సందర్భాలు ఉన్నప్పటికీ, స్థానిక వాతవరణ పరిస్థితులను అంచనావేసి హెచ్చరికలు జారీచేస్తున్నారు. కొండచరియలు విరిగిపడడం, వడగళ్లవర్షాలువంటి వాటిని అంచనావేసి ముందుగానే హెచ్చరిస్తున్నారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, మాధవ్ గాడ్గిల్ కమిటీ సిఫారసులను తీసుకుని ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు చట్టబద్దమైన చర్యలను చేపట్టాలి.