పి.శ్రీకుమరన్
కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీలు తరచుగా విమర్శిస్తుంటాయి. అయితే కేరళ ప్రభుత్వం వాణిజ్యంలోనూ, ప్రజలకు అనుకూలమైన సంస్కరణలు అమలు జరపడంలో అగ్రస్థానం పొందింది. ఈ విజయాన్ని చూసిన ఈ రెండు పక్షాలు ఇప్పుడేం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఎదురై మౌనంగా కూర్చున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం కేరళ సాధించిన విజయాలను కనీసం ప్రస్తావించడంలేదు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే కేరళ ప్రభుత్వం అనేక విషయాలలో ముందంజలోనే ఉంది. అయినప్పటికీ బీజేపీ, యూడీఎఫ్‌లు కేరళ ప్రభుత్వాన్ని విమర్శించడలో వెనుకాడడంలేదు. దిల్లీలో సెప్టెంబరు5న జరిగిన వివిధ రాష్ట్రాల పరిశ్రమల మంత్రులు పాల్గొన్న సమావేశంలో కేంద్ర పారిశ్రామిక వాణిజ్యమంత్రిత్వశాఖ ఈ విజయాన్ని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల రేటింగ్‌లను ఈ సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశంలో కేరళ పరిశ్రమల శాఖమంత్రి పి.రాజీవ్ వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక22 అవార్డును కేంద్ర పారిశ్రామిక శాఖ మంత్రి పియుష్ గోయల్ నుంచి అవార్డును స్వీకరించారు. పరిశ్రమలను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించినందుకుగాను కేరళకు అవార్డు లభించింది. వాణిజ్యం, పన్నుల చెల్లింపు, పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలోనూ కేరళ ముందంజలో ఉంది. వాణిజ్య కేంద్రీకృత సంస్కరణలలో దేశంలోనే గొప్ప విజయం సాధించిన రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలోఉంది. ప్రజా ప్రయోజనాల సంస్కరణలలో ఏడు కేటగిరీలు ఉన్నాయి. ఈ ఏడుకూడా ఉన్నతస్థానంలోనే ఉన్నాయి. అవి
అన్లైన్ సింగల్ విండో సిస్టమ్, పట్టణ, స్థానిక సంస్థలు అత్యంత వేగంగా వివిధ సర్టిఫికేట్‌లను అందచేయడం, రెవెన్యూశాఖ సర్టిఫికేట్లను జారీచేయడంలో, ప్రజలకు నిత్యజీవితావసర వస్తువులను పంపిణీ, రవాణా రంగంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజిల నిర్వహణలోనూ రాష్ట్రం ముందంజలో ఉన్నది. ఈ సంస్కరణలలో కేరళ 95శాతానికి పైగా సానుకూల స్పందనలు వివిధ వర్గాలనుంచి వచ్చాయి. సరళతర వాణిజ్యంలో కేరళ గొప్ప విజయాలను సాధించిన విషయాలను అనేక సంస్థలు ప్రశంసించాయి. అనేక పారిశ్రామిక సంస్థలలో గుర్తింపుపొందిన విజయాలను ప్రభుత్వం సాధించింది. డిజిటల్ సాంకేతిక సాధనాలు కలిగిన ఉన్నతస్థాయి సాంకేతికతను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దింది. సైబర్ నేరాలను నియంత్రించడంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కేరళను గుర్తించింది. భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం సైబర్ నేరాలను నియంత్రించడంలో కేరళ ప్రభుత్వం సాధించిన విజయానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంత్రి అమిత్ షా త్వరలో బహుమతిని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారికి సెప్టెంబరు 11వ తేదీ బుధవారం ఈ బహుమతిని అందచేస్తారు.
కోజికోడ్ నగరంలో ప్రభుత్వ సైబర్‌పార్కు ఉన్నది. దీని ద్వారా సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 202324లో 121కోట్ల ఎగుమతులతో అంతకుముందు సంవత్సరంకంటే 2023
24లో 15శాతం వృద్ధిని సాధించింది. గత ఏడేళ్లకాలంలో 40 రెట్లు వృద్ధిని నమోదుచేశారు. 202324లో ఎగుమతుల ద్వారా సైబర్ పార్కులు 105కోట్ల ఐటీ ఎగుమతులు చేశాయి. 2016
17లో 2.97కోట్లు విలువైన ఎగుమతులు జరిగాయి. ఇవి క్రమంగా 201718నాటికి 71,390కోట్ల విలువైన ఎగుమతులకు చేరాయి. ఆ తరువాత సంవత్సరంలో ఇవి 8,10,97,095 రూపాయల విలువైన ఎగుమతులకు చేరాయి. పశ్చిమాసియా, అమెరికా, ఐరోపా తూర్పు ఆసియా దేశాలకు ఐటీ ఎగుమతులు గణనీయంగా జరిగాయి. 2009లో 42.5ఎకరాల స్థలంలో సైబర్‌పార్కు భవనాన్ని స్థాపించినట్లుగా సైబర్ పార్కు సీఈఓ సుశాంత్ కురింతిల్ తెలిపారు. 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 82 కంపెనీలు పనిచేస్తున్నాయి. 2200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేరళ స్టార్టప్ మిషన్ పరిధిలో 22కంపెనీలకు సైబర్‌పార్కు తోడ్పాటు అందిస్తున్నది. దేశంలో యూపీఎస్‌సీ నియమించే ఉద్యోగులలో కేరళ అగ్రస్థానంలోఉన్నది. ఉదాహరణకు 2023లో రాష్ట్రంల 34,110 నియామకాలు జరిగాయి. ఈ నియామకాలలో 11,921 మంది ఓబీసీలు ఉండగా, ఎస్‌సీలు 2673 మంది ఉన్నారు. అలాగే ఎస్‌టీలు 2260 మంది ఉన్నారు. మరో 17,256 మంది జనరల్, ఇతర కేటగిరీల కింద నియమితులయ్యారు. గత సంవత్సరం దేశం మొత్తం మీద 1,16,089 మంది మాత్రమే నియమితులయ్యారు. ఇందులో దాదాపు సగం మంది అనగా 34,110 మందిని కేరళ నియమించింది. 23కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కేవలం 4,120 మంది ఉద్యోగులను మాత్రమే నియమించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఐటీ ఉద్యోగుల నియామకాలలో కేరళ అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు 12,645 మందిని, మహారాష్ట్ర 3,949మందిని, ఉత్తరాఖండ్ 4,355 మందిని, ఆంధ్రప్రదేశ్ 332 మందిని అసోం 635 మందిని, చత్తీస్‌ఘడ్ 773 మందిని, బీహార్ 3173మందిని, హిమాచాల ప్రదేశ్ 1332 మందిని నియమించాయి. కేరళలో 20 ప్రభుత్వరంగ యూనిట్లలో ఈ సంవత్సరం లాభాలలో ఉన్నాయి. కేంద్రప్రభుత్వం మాత్రం ఇలాంటి సంస్థలను మాత్రం అయినకాడికి విక్రయించాలని నిర్ణయించింది. కొచ్చి
బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను కూడా ప్రైవేటు రంగానికి అప్పగించాలని కేంద్రం చూస్తోంది. గుజరాత్‌కు చెందిన కంపెనీ కేరళలోని కాసరగాడ్ జిల్లాలో 850కోట్లు పెట్టుబడులతో పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసింది. ఈ విధంగా అనేకరంగాలలో కేరళ సాధించిన విజయాలను తప్పక ప్రశంసించవలసిందే.