బుడ్డిగ జమిందార్
17 కోట్ల జనాభా కల్గిన బంగ్లాదేశ్‌లో గడచిన సంవత్సరాలలో జీడీపీ పెరుగుదల 2009లో 5శాతం ఉండగా 2019 నాటికి7.9 శాతం పెరిగింది. కరోనా కష్ట కాలంలో 3.4 శాతానికి పడిపోగా, మరలా 2021 నాటికి 6.9 శాతం, 2022 నాటికి 7.15 శాతానికి పెరిగింది. ఈ సంవత్సరానికి మరలా 7 శాతానికి చేరుతుందని ఆసియన్ డవలప్‌మెంటు బ్యాంకు చెబుతుంది. కానీ ఏమి ప్రయోజనం ఈ జీడీపి ఉద్యోగాలను కల్పించే జీడీపి కాదు. ‘జాబ్‌లెస్’ జీడీపి. మన ఆర్థిక వ్యవస్థలోనూ ఇదే తరహా జీడీపి వృధ్దిరేటు జరుగుతున్నది. నిరుద్యోగం 2010 లో 3.4 శాతం నుంచి 2023 కు 5.1 శాతం అధికారికంగా పెరిగిందని సమాచారం. కానీ వాస్తవానికి ప్రస్తుతం కోటి ఎనభై లక్షలకు పైగా యువత నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వపరంగా వస్తున్న కొద్దిపాటి ఉద్యోగాల్లో 30 శాతం 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తాయని కొద్ది నెలల క్రితం షేక్ హసీనా తీసుకొన్న నిర్ణయంతో ఒప్పుకోని విద్యార్థులు ఉప్పెనలా కొన్ని వారాల నుంచి ఉద్యమాన్ని నడిపారు. హైకోర్టు 7 శాతానికి రిజర్వేషన్లు తగ్గించినా ససేమిరా అన్నారు. ప్రజాస్వామ్యవాదిగా రాజకీయాలను ప్రారంభించి నియంతగా మారిన హసీనా కొద్ది వారాలలోనే 300 విద్యార్థుల్ని దారుణంగా చంపించింది. ప్రత్యర్థులను జైళ్లకు పంపింది. ఫేస్‌బుక్‌లో ఒక విద్యార్థి ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగు పెట్టినందుకు జైలులో నిర్బంధించి అనేక కేసులు తనపై పెట్టింది. ఎంత నియంతైనా ప్రజాగ్రహానికి ఆత్మహత్య అయినా చేసుకోవాలి లేదా దేశాన్ని వదిలి పారిపోవాలి! ఇది చరిత్ర మనకు చెబుతున్న గుణపాఠం. సరిగ్గా హసీనా కూడా భారతదేశానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో పారిపోయి రావటం దీనినే సూచిస్తుంది. ఇకపై హసీనా రాజకీయాలకు దూరంగా ఉంటానంటుంది.
ఐతే ఈమెకు ప్రత్యామ్నాయంగా ఒకవేళ భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారనేదే వెయ్యి డాలర్ల ప్రశ్న! అభివృద్ధి నిరోధక, అప్రజాస్వామిక మతోన్మాద శక్తులు అధికారంలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇది మన దేశానికి మరింత ఆందోళనను కలుగజేస్తుంది. జమాత్‌ఎ
ఇస్లామీ బంగ్లాదేశ్ విద్యార్థి విభాగం ‘ఇస్లామీ ఛత్ర శిభిర్’ పాత్ర ప్రముఖంగా ఉందని ఇండియా టుడే రాసింది. ఈ సంస్థకు పాకిస్తాన్ ఇంటిలిజెన్సీ ఏజన్సీ ఐఎస్‌ఐ మద్దతు ఉందని తెలుస్తుంది. అమెరికా నుంచి నిధులు కూడా అందాయని విశ్లేషణలు వస్తున్నాయి. గత రెండేళ్లలో బంగ్లాదేశ్‌లోని అనేక విశ్వవిద్యాలయాల్లో ఇస్లామీ ఛత్ర శిభిర్ కార్యకర్తలు విద్యార్థులుగా యూనివర్శిటిల్లోకి ప్రవేశించారు. ఇక్కడ నుంచే విద్యార్థులను హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగట్టి తిరుగుబాటు చేయించారని, దీనికి పరోక్షంగా అమెరికా అండతో మిలిటరీలోని ఒక వర్గం సహకరించిందని వార్తలు వస్తున్నాయి. జమాత్‌ఎ
ఇస్లామీ 1975 లో స్థాపించారు. బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఇస్లామిక్ పార్టీలలో ఒకటిగా ఎదిగింది. గతంలో మాజీ ప్రధాని ఖలీదాజియా పార్టీ జిఎన్‌పితో పొత్తు పెట్టుకొంది.ప్రస్తుత విద్యార్థి ఉద్యమ పరిస్థితి పెనం మీది రొట్టి పొయ్యిలో పడిన చందంగా ఉంది. ప్రపంచంలో వామపక్షపార్టీలు బలంగాలేనిచోట్ల మితవాద, మతవాద, ఫాసిస్టు పార్టీలు అధికార పగ్గాలు చేపట్టటం మనం అనేక చోట్ల చూస్తున్నాము.
బంగ్లాదేశ్‌తో మనకు గల 4,096 కిలోమీటర్ల సరిహద్దులో పశ్చిమబెంగాల్ (2,217 కి.మీ), త్రిపుర (856 కి.మీ), మేఘాలయ (443), అస్సాం (262), మిజోరం (318) రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్యంలో భారతదేశానికి మధ్యనున్న బంగ్లాదేశ్‌కు కేవలం దక్షిణమున అరేబియా సముద్రం మాత్రమే ఉన్నది. చికెన్‌నెక్ పైభాగాన నేపాల్, భూటాన్‌లు ఆపైన చైనాలు ఉన్నాయి. సుమారు 15 సంవత్సరాలు బంగ్లాదేశ్ ప్రధానిగా పాలించిన హసీనా మన ప్రధానితో ఈ సంవత్సరం చాలాసార్లు కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఈ సంవత్సరం 1600 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. బంగ్లాదేశ్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌కు చైనాతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. బంగ్లాదేశ్ పరిణామాలు మన దేశాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. రాను రాను మన విదేశాంగ విధానం మసకబారుతూ, సరిహద్దు దేశాలతో స్నేహపూరిత వాతావరణం దూరమవ్వటం దేశానికి శ్రేయస్కరం కాదు.
1971 బంగ్లాదేశ్ విమోచనోద్యమం తర్వాత అప్పటి యువతరం చాలామంది లక్షల్లో యు.కె, అరబ్ దేశాలు, అమెరికా, కెనడాలకు వెళ్లి స్థిరపడ్డారు. కానీ నేటి యువతరం బంగ్లాదేశ్‌లోనే ఉండి దేశాన్ని అభివృద్ధి చేసి ఇక్కడే ఉద్యోగాలు పొందాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుత ఉద్యోగాలు సృష్టించలేని ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా యువత పోరాడుతుంది. ఇదే పరిస్ధితి భవిష్యత్తులో మన దేశంలో కూడా ఏర్పడి మన యువత అమెరికా వెళ్లబోమని, మన దేశాన్ని అభివృద్ధి చేయమని అడిగిననాడు మన పాలకులు కూడా పలాయనం చిత్తగించాల్సిన అవసరం ఏర్పడక తప్పదు. మన దేశం ‘మానవ వనరుల’ ఎగుమతిగా తయారయింది. అమెరికాలో వర్షం కురిస్తే మనం గొడుగు పట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడటం విచారకరం.
హసీనాకు అమెరికాతో మొదటి నుంచి మంచి సంబంధాలు లేనేలేవు. 1975 ఆగస్టు15 నాడు హసీనా తండ్రి వామపక్షవాది షేక్ ముజిబూర్ రెహమాన్‌తో పాటుగా మరో 15 మంది కుటుంబ సభ్యులను దారుణంగా చంపటంలో అమెరికా పాత్ర ఉందని ఎప్పటి నుంచో హసీనా ఆరోపిస్తుందని ది హిందూ పత్రిక రాసింది. ‘ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎప్పుడైనా తన అనుకూల ప్రభుత్వాలను అమెరికా మార్చగలదని, బంగ్లాదేశ్‌లో వారికి అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని’ లోగడ హసీనా చెప్పింది. తను ఏ విదేశీ కూటమిలోనూ సభ్యత్వం తీసుకోనని ఖరాకండీగా చెప్పింది. అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్, యు.కె.లతో కలిసిన ‘క్వాడ్’ మిలిటరీ కూటమికి దూరంగా ఉంటానని చెప్పింది. చిట్టగాంగ్‌కు దగ్గరిలోని సైంట్ మార్టిన్ దీవిలో విదేశీ నౌకాస్థావరాన్ని, మిలిటరీ స్థానాన్ని రానివ్వనని ధైర్యంగా హసీనా చెప్పగలిగింది. ఒక విదేశీ తెల్లజాతివారు బంగ్లాదేశ్‌ను క్రిస్టియన్ దేశంగా మార్చటానికి జరిగే ప్రయత్నాలను ఆపుతానని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నది. ఈ వ్యాఖ్యలను బట్టి హసీనా ప్రభుత్వాన్ని కూల్చటంలో అమెరికా హస్తమున్నట్లుగా భావించవచ్చని మీడియాలో వార్తలొస్తున్తాయి.
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం
సెల్: 9849491969