మల్లాడి శ్రీనగేష్
పదవ తరగతి చదివే విద్యార్థుల్లో 2021-22 సంవత్సరంలో 20.2 శాతం మంది మధ్యలో బడి మేనేశారని, 190 మిలియన్ల మంది 10 వ తరగతి పరీక్షకు హాజరుకాగా వారిలో 160 మిలియన్ల మంది విద్యార్థులే ఉతీర్ణులయ్యారనీ, వారిలో కేవలం 30 వేల మిలియన్ల మంది విద్యార్థులు మాత్రమే 11వ తరగతిలో చేరుతున్నారనేది కాదనలేని వాస్తవం ! ప్రభుత్వ నివేదికలు సైతం ఇదే చెపుతున్నాయి. ఈ విధంగా ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించకపోతే మానవాభివృద్ధి సూచికలో, దేశ ప్రగతిలో మన భాగస్వామ్యం ఎక్కడుంటుంది. చదువుకోవడమంటే అక్షరాస్యతతోనే సరిపోతుందా అంతకుమించి ముందుకు సాగాలంటే ఏమేమి అడ్డంకులు, వాటిని అధిగమించడానికి మనం వ్యక్తిగతంగా ఏమి చేస్తున్నాం, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వెరసి దేశంలో విద్య రూపం, దాని ఫలితాలు ఎలా వున్నాయనేది నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే విద్యాహక్కు చట్టం 2009 ద్వారా నిర్బంధ ఉచిత విద్యా నినాదాన్ని చట్టబద్దంగా ముందుకు తెచ్చాం. తద్వారా ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పాఠశాలల నమోదు పెరిగింది. తద్వారా నాణ్యమైన విద్యాప్రణాళికల్లో వివిధ అవసరాలు అనగా మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయ నియామకం చట్టబద్దంగా కల్పించాల్సిన వసతులు ఇవన్నీ ప్రభుత్వాలకు కొంత భారంగా మారినప్పటికీ బాధ్యతగా పనిచేసి విద్యాఫలాలకు దూరంగావున్న బడుగు. బలహీన వర్గాల పిల్లలకు ముఖ్యంగా అక్షరాస్యతంటే తెలియని కుటుంబాలలో బడివైపు చూడని బాలలకు, ఆర్థిక, సాంఘిక పరిస్థితుల వలన బడిమానేసిన పిల్లలను వారి వయసుకుతగ్గ తరగతిలోనే చేర్చుకొని విద్యార్థుల్లో వివక్షలేకుండా అందరికీ సమాన విద్య, సమ్మిళిత విద్య ప్రాతిపదికన విద్యా హక్కును 2010 సంవత్సరం నుంచి అమలుచేస్తున్నారు.
యూఎన్‌డీపీ గ్లోబల్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సూచిక 2021 ప్రకారం 2022-23లో నిర్వహించిన ఆర్థిక సర్వే ప్రకారం, దేశంలో పాఠశాల విద్య అభ్యసించే సగటు పాఠశాల విద్యా సంవత్సరాలు 6.7 సంవత్సరాలుగా లెక్కించారు. ఈ నమూనాను ప్రపంచంలో చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో పోల్చుకుంటే సగటు పాఠశాల విద్య 7.6, 8.1 సంవత్సరాలుగా లెక్కించారు. అనగా దేశంలో సరాసరి పాఠశాల విద్య అనగా నిరంతర విద్య ఆరున్నర సంవత్సరాలుగా తేలింది. అంటే దేశంలో ప్రజలు నిరంతర పాఠశాల విద్య అభ్యసించిన 191 దేశాల జాబితాలో 132వ దేశంగా ఉండగా, చైనా 79 వ దేశంగా, బ్రెజిల్ 87వ దేశంగా నిర్దేశించింది. ఈ పరిస్థితులవల్ల పౌర ప్రగతి కుంటుపడి దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి అవసరమైన మానవ వనరులు కొరవడడం -తద్వారా ఆర్థిక పరిపుష్టికి సరిపడు చేయూత మందకొడిగా పరిణమిస్తుంది . ఈ సమస్య వలయాలను అధిగమించడానికి దేశ పౌరులు తన చదవు చక్రాన్ని ప్రాథమిక లేదా సెకండరీ స్థాయిలోనే ఆపకుండా ఉన్నత చదువుల వైపు దృష్టి సారించాలి.
సెకండరీ విద్య స్థాయిలో బడిమానేసిన విద్యార్థుల వివరాలు యూ డైస్ 2021-2022 ప్రకారం మన దేశంలో 12.6 శాతం, కానీ 2014 సంవత్సరంతో పోలిస్తే 20.2 కన్నా తక్కువే. కరోనా కూడా ఈ తగ్గుదలకు ఒక కారణంగా ఉంది. సెకండరీ పాఠశాలస్థాయిలో బడి మానేసిన విద్యార్థులశాతం ఒడిశా రాష్ట్రంలో అధికంగా 27.3 శాతం, మేఘాలయలో 21.7శాతం, అసోంలో 20.3 శాతం, బీహార్‌లో 20.5 శాతం ఆంధ్రప్రదేశ్‌లో 16.3 శాతం, తెలంగాణలో 13.7 శాతం, కర్నాటకలో14.7 శాతంగా నమోదైంది. అతి తక్కువగా తమిళనాడు 4.5శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 1. 5శాతం గా నమోదు అయింది. పూర్వ ప్రాథమిక విద్య మొదలుకొని సెకండరీ స్థాయి విద్య వరకు 100 శాతం విద్యార్థుల నమోదు సాధించడంద్వారా 2030 సంవత్సరంనాటికి అనుకున్న రీతిలో మౌలిక సదుపాయాల కల్పన, తరగతి స్వరూప స్వభావాలను పునరుద్ధరించడం, అభ్యసనలో విద్యార్థుల భాగస్వామ్యం ఉండేలా ప్రోత్సహించడం వంటి ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులు 12వ తరగతి చేరేవరకు తగిన మార్గాలను అన్వేషించడం ద్వారా విద్యార్థులందరిలో ఉన్నత విద్యా ఫలాలు అందేలా ప్రళాళికల ప్రధాని భూమికగా నూతన విద్యా విధానం ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. 2022 మేలో విడుదలైన నేషనల్ అచీవ్మెంట్ సర్వే నివేదిక 2021 ప్రకారం ప్రతి విద్యార్థి ప్రగతి జాతీయస్థాయిలో ప్రతి సబ్జెక్టులో పై తరగతికి వెళ్తున్న కొద్దీ పిల్లల విద్యా సామర్ధ్యాల శాతం ఎక్కువగా తగ్గినట్లు వెల్లడైంది. సరాసరి విద్యార్థి స్థాయి ప్రగతి నిర్దేశించిన సూచికలో మూడవ తరగతి గణితంలో సాధించిన ప్రగతి 306కాగా ఐదవ తరగతి గణితంలో 284 గా, ఎనిమిదో తరగతిలో 255 కాగా పదవ తరగతిలో 220 స్థాయికి ప్రగతి తగ్గినట్లు ఆ నివేదిక వెల్లడిరచింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రగతి మరింత కుంటుపడినట్లు నాస్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో గిరిజన, వెనుకబడిన విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలు పూర్తిస్థాయిలో పడిపోయినట్లు నివేదిక వెల్లడిరచింది. 8వ తరగతిలో షెడ్యూల్డ్ తరగతికి చెందిన విద్యార్థులు గణితంలో సరాసరి 249 సాధించగా, షెడ్యూల్డ్ తెగకు చెందిన వారు 244, ఓబీసీకి చెందిన విద్యార్థులు 253 సాధించగా, జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులు సరాసరి అధికంగా 260 మార్కులు సాధించినట్లు నివేదిక తెలియపరచింది.
ఈ పరిస్థితుల నుంచి పిల్లలను తీర్చిదిద్దడానికి విద్యార్ధుల్లో తరగతి వారీ విద్యాసామర్ధ్యాల సాధనకోసం పూర్వ ప్రాథమిక విద్యకు నోచుకోక పాఠశాలలో 1వ తరగతిలో చేరుతున్న దళిత, గిరిజన, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తగిన మార్గాలను అన్వేషించి ప్రతి విద్యార్ధి తరగతి వారీ సామర్ధ్యాలను ప్రాథమికస్థాయి నుంచి సాధించేలా ప్రణాళికలు అమలుచేయాలి. ఉన్నత విద్య విషయానికొస్తే, 6వ తరగతిలో ప్రవేశించి అభ్యసనా లేమితో ఇబ్బందులకు గురౌతున్న విద్యార్థులకు తరగతి స్థాయి విద్యా సామర్ధ్యాల పునరుద్దరణకు ప్రత్యేక కార్యక్రమాలు సుదీర్ఘంగా నిర్వహించాలి.దీనికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటిని దీర్ఘస్థాయిలో నిర్వహించి ప్రోత్సహించాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖలు సమగ్ర శిక్షణ ద్వారా సేవ్ ది చిల్డ్రన్ (బాల్ రక్షా భారత్), ఆస్కి వారి సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ పబ్లిక్ సిస్టం, యూనిసెఫ్, సాంకేతిక సహకారంతో చేపట్టిన లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ కార్యక్రమం 6-9 తరగతులకు నిర్వహించి తక్కువ వ్యవధిలోనే మంచి ఫలితాలు సాధించడం, ఆంధ్రప్రదేశ్ 10 జిల్లాల్లో చేసిన పైలట్ అనంతరం రాష్ట్రమంతా ఎల్.ఐ పి కార్యక్రమాన్ని అనుసరించేలా ప్రణాళికలు చేయడం మంచి పరిణామం. ఈ కార్యక్రమం సిలబస్ విద్యను పరిగణనలోనికి తీసుకొని అకడమిక్ క్యాలండరుకు భంగం కలగకుండా పాఠశాల రోజువారీ విద్యా ప్రణాళికతోనే సమ్మిళితం చేయడం ఒక ప్రత్యేకమని చెప్పకతప్పదు. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, పాఠశాల యాజమాన్యాలు, తలిదండ్రులు కలిసికట్టుగా పనిచేయడమే ఉన్నత విద్యా రంగంలో ఎదురౌతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సిద్ధిస్తాయి.