యాళ్ల ఉమామహేశ్వరి
నాటి సమాజంలో వేళ్లూనుకుని పోయిన అస్పృశ్యతని గురించి కవులు ఎందరో సామాజిక స్పృహతో కూడిన రచనల్ని చేశారు. అదే కోవకి చెందిన రచనలుచేసి ఆధునిక సాహిత్యంలో తనకంటూ స్థానం సాధించుకుని నేటికీ మనందరం కొనియాడుతున్న రచయిత గుర్రం జాషువా. భావ కవిత్వ రచనా పరంపరకి సడలింపునిస్తూ సామాజిక అంశాలని రచనలుగాచేసి, కాదన్నవారితోనే మావాడని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన సాహసి. పట్టుదలతో మెట్టు మెట్టు అధిరోహించి ఛీత్కారాలు పొందిన వారిచే సత్కారాలు పొందిన ఘనత వీరికే చెల్లింది. భరించే మనసుంటే అణచివేత పాలవుతామని, ప్రశ్నించే తత్వం పెంచుకుని దినదినాభివృద్ధినొందారు జాషువా.
జీవితం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది. నా గురువులు ఇద్దరు – పేదరికం, కులమత భేదం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే గాని బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్య్రాన్ని, కులభేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను. వాటిపై కత్తి కట్టాను. అయితే కత్తి నా కవిత. నా కవితకు సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపైనే నా ద్వేషం’’ అంటారు జాషువా. కళాకారులందరిదీ ఒకే జాతి, ఒకే మతం, ఒకే కులం. ఆ విశాల దృక్పథం లోపిస్తే కళలు బతకవు. ఒక వేళ బతికినా బట్టకట్టవు. జాషువా చిన్నతనం నుంచి అటు వ్యక్తిగా, ఇటు కళావేత్తగా కుల వివక్షతకు నలిగి పోయాడు. ‘నా కథ’లోని ‘వ్యథా ఘట్టములు’ ఆ గుండెకోతకు, ఆ ఆవేదనకు అక్షర రూపాలు. ‘‘లోకం నా వంక కోరగా, వారగా చూచింది, అనాదరించింది, అసత్కరించింది, సత్కరించింది, దూరపర్చించి, చేరదీసింది’’ (నా కథ – ఒక మాట). జాషువా జీవిత ప్రస్థానాన్ని ఈ మాటలు తెలియచేస్తాయి. అయన కవితా సృష్టికి ఇదే ప్రత్యక్ష నేపథ్యం. సమకాలీన భావ కవులను నిరసించాడు. అందుకే భావకవుల కంటే అభ్యుదయ కవులే ఈయనకు ప్రీతిపాత్రులయ్యారు. వర్గ సంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాల నిర్మూలనం, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు, సమసమాజ నిర్మాణం, సమర విముఖత, శాంతిప్రియత వంటి అభ్యుదయ కవితా లక్షణాలు జాషువా కవితల్లో కనిపిస్తాయి. జీవితంలో ఎదురైన సమస్యలనే ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన వ్యక్తి. కాళిదాస మహాకవి విరచిత మేఘసందేశాన్ని పోలిన గబ్బిలం రచనలో దళితులకి దేవాలయ ప్రవేశం నిషేధమన్న అంశాన్ని తెలిపారు. పగలు నిద్రపోతూ రాత్రిపూట మాత్రమే మేల్కొని ఉంటూ అందరిలో కలవక ఒంటరిగా చరించే జీవి గబ్బిలాన్ని తనకి మారుగా (చిహ్నంగా) ఎంచుకోవడంలో వారి రచన వెనుకనున్న ఆంతర్యం అవగత మవుతుంది. దళితుల ఆక్రోశం, ఆవేదనల అక్షర రూపంగా గబ్బిలం విరాజిల్లుతోంది. ‘గబ్బిలం’ కావ్యంలో తాను ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నారో సూచించారు. ప్రజలను బాధపెట్టే బహుదేవతలు లేని చోటు, నవనీత సమానమైన కవుల కమ్మని వాక్కు భయము లేకుండా వెల్లివిరిసే నేల, ప్రభుత్వ పరంగా-పాలకవర్గాలు-సృజనాత్మక రచనల మీద ‘ఆంక్షలు-నిషేధాలు’ విధించని చోటు-ఎంతముందు చూపు జాషువాది? సంతానానికి భేదభావాలు నేర్పని తల్లిదండ్రులున్న స్థలం, తోడునీడలేని దుర్బలుల కాచే ప్రదేశం – ఇలాంటి దేశాన్ని, సమాజాన్ని కోరుకున్నారు జాషువా. తన కవితల్లో కరుణ రసంలోంచి వీరరసాన్ని జాషువా పొంగించారు. ఇచ్చిన మాట తప్పిన ఘజనీ మహమ్మద్ వంచన వల్ల కుమార్తె వివాహం చేయలేని ఆవేదనలో పిరదౌసి పడిన మానసిక సంఘర్షణను కళ్లకి కట్టినట్లు పద్యరచన చేశారు జాషువా. సమయం వృథా చేసుకున్నానన్న అయోమయంలో రాజుని ప్రశ్నించినందుకు మరణదండన విధిస్తే చేసేదిలేక సర్వం కోల్పోయి శిక్షకి అర్హుడై తన కుమార్తెకి న్యాయం చేయలేని కన్నతండ్రి ఆవేదనలో బాధాతప్త హృదయjైు ఒదిగిపోయింది సరస్వతీమాత. పిరదౌసి మహాకవి రచనలో కవిహృదయం ఎంత సున్నితమో చెబుతూ ఆ హృదయం పగిలిన ఆవేదనని అంతే సున్నితంగా రచించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకునిగా ఉంటూ దేశభక్తి చాటు కున్నారు. మహాత్ముని మరణవార్తని విని ఆవేదనచెంది వారికి స్మృత్యంజలిగా బాపూజీ అనే రచన చేశారు. భారతదేశంలోని వజ్రాల సంపద నంతటినీ తూకం వేసినా గాంధీజీయే ఎక్కువ బరువు తూగుతాడు. పదివేల సంవత్సరాలలో భూదేవత ఇంతటి పవిత్రుని కనియుండదు. తాను గోచిపాతను మాత్రమే ధరించి జాతి గౌరవాన్ని నిలిపాడు. లోకమంతటికి సామరస్యాన్ని ప్రసాదించిన విజ్ఞాన ప్రదాత – అని జాషువా పేర్కొన్నారు. సీమ బట్టలు ధరించు పుట్టు భోగులకు గాంధీజీ చేనేత బట్టలు ధరించడాన్ని నేర్పటమే కాక వారందరు ఖద్దరును చేతితో నూలువడికి తయారుచేసుకోవటం కూడా నేర్పాడు. ఆయన జడుపులేని శాంతి సైన్యాన్ని తయారుచేశారు. ప్రకృతి సౌందర్యానికి పులకించి ముగ్ధులై రచనలు చేయని కవి హృదయం ఉండదుగా…అందుకే దానికి నిదర్శనంగా బంగారు జిలుగుల గిజిగాడుని రచించి గిజిగాని ఘనతని తరతరాలకి అందించారు. గాలిలో ఊగే చిటారు కొమ్మకు పక్షి గడ్డి పోచలతో గూడు కట్టడం దానికది ఒక అద్భుతం. అందం. ఆశ్చర్యం. లోపలికి వెళ్లి రావడానికి సరిపోయేంత సందు ఉంచి తన చుట్టూ తానే గాలిలో గూడు కట్టుకునే పక్షిని చూస్తే నిజంగానే సృష్టిలో ఎన్నెన్ని అద్భుతాలు అందాలుగా మన కళ్ల ముందు పరచుకుంటున్నాయో అని ఆశ్చర్యపోవాలి. ఒక్కొక్క గడ్డిపోచను ముక్కున పట్టుకొని వచ్చి, జారిపోకుండా ఒక మగ్గం మీద పడుగు పేకల్లా నేతగాడు వస్త్రం నేసినట్లు పక్షి గూటి గోడలు కట్టే నైపుణ్యాన్ని చూడని కళ్లు కళ్లే కాదు. ఆ నైపుణ్యాన్ని మెచ్చుకోని మనసు మనసే కాదు అనడం అతిశయోక్తి కానేరదు. జీవితంలో అడుగడుగునా సమస్యలని ఎదుర్కొంటూ వలదు వలదన్న సమాజంలో ఎదుగుతూ తనని తాను నిరూపించు కుంటూ… సాహిత్యం పట్ల జ్ఞానాన్ని పెంచుకుంటూ వీలు దొరికిన తావులలో సాహిత్యాంశాలని నేర్చుకున్నారు. కళకు కులమతాలున్నాయా? అంటూ జాషువా ప్రశ్నిస్తూ ‘‘నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపు రేఖా కమనీj ువైఖరులు గాంచి భళీభళీ యన్నవారే, మీదేకుల మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచిపోవుచో బాకున గ్రుమ్మినట్లగున్ పార్ధివ చంద్ర! వచింప సిగ్గుగన్!’’ అంటూ వెంకటిగిరి రాజాకి తన ఆవేదన చెప్పుకున్నారు ఒకానొక సందర్భంలో. తన కవితా యాత్ర విజయ కేతనాన్ని తెలుగు సాహితీ గగనంలో ఉవ్వెత్తున ఎగరేసిన విశ్వమానవుడు మన గుర్రం జాషూవా. సత్య హరిశ్చంద్ర’’ నాటకం, వారి ‘శ్మశానవాటిక’ లోని పద్యాలు లేకుండా ఊహించలేం. కవితాసుధ లొలికించిన కవుల కలాలు, శ్రవణాంద కరమైన గాయకుల కమ్మని కంఠస్వ రాలు… ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి. పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలసి పోవల్సినదే. అందులో మమైకం కావలసినదే. పుట్టుక కూడా తల్లిగర్భం నుంచే అయ్యినను, తల్లి కూడా ప్రకృతి జనీతమే కదా. మట్టిలో ఖననం చేసిన తనువు క్రమంగా కృశించి, నశించి, జీర్ణించి మట్టిలో మట్టిగా కలసిపోతుంది. మట్టిరేణువులలలో రేణువులుగా కలసిపోవును. ఔను నిక్కమే కదా!.అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అల్నాటి సుకవులు కాళిదాసు, భారవుల మృతరేణువులు కలసి వున్నాయేమో కదా!. వల్లకాడులో అస్పృశ్యతకు తావులేదు. ఏ మతమైన, ఏ కులమైన, ఏ వర్ణమైన ఇక్కడ ఒక్కటే. అందరిని స్వీకరించడంలో సమతా భావం. పులిపక్కన సాధుజంతువు మేకను జేర్చి బుజ్జగించి, వూరడిరచు అభేద భావనావని ఈ శ్మశానభూమి. వీరు రాసిన శిశువు(పాపాయి) అనే ఖండికను ఘంటసాల అద్భుతంగా గానంచేశారు. ఈ సందర్భంలో, రికార్డింగ్ జరిగే సమయంలో జాషువా, ఘంటసాల యింటికి వచ్చి, బయట అరుగు మీద కూర్చున్నారట. ఘంటసాల, బయటకు వచ్చి ‘‘ఏమిటండీ! బయటనే కూర్చున్నారు’’ అని అడిగితే, అందుకు జాషువా ‘‘నేను అంటరాని కులమునకు చెందినవాడను, మీరు బ్రాహ్మణులు, మీ అనుమతి లేకుండా లోపలి ఎలా రాగలను?’’ అన్నారట. అందుకు, ఘంటసాలగారు ‘‘నాకు అటువంటి పట్టింపులు లేవు, మీరు స్వేచ్ఛగా లోపలి రావచ్చు. పైగా మీరు సరస్వతీ పుత్రులు. మీరు అంటరాని వారైతే, సరస్వతీ దేవి కూడా అంటరానిదనే కదా అర్థం!’’ అని చెప్పి యింటిలోకి సాదరంగా తీసుకొనివెళ్లి, తన సహృదయాన్ని చాటుకొన్న ధన్యజీవి ఘంటసాల. జాషువా హాస్య ప్రవృత్తి ‘‘నవ్వవు, జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు…..’’ అంటూ నవ్వు గొప్పతనాన్ని చెప్పారు. ఎన్నికష్టాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నవ్వుతూనే జీవితాన్ని గడిపారు. ఆయన ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న సహృదయలు ఏకా దండయ్య పంతులు గుంటూరు నుంచి 25 రూపాయలు మనియార్డర్ చేస్తూ, ‘‘జాషువా! రాత్రి నాకు దేవుడు కలలో కనబడి నీకు 25 రూపాయలు పంపమన్నాడు.’’ అని కూపన్ మీద రాసేవారు. జాషువా దానిని హాస్యంగా మలుచుకొని తన కృతజ్ఞతలు తెలుపుతూ ‘‘మీ దేవుడు 25 పక్కన ‘‘సున్నా’’ పెట్టమని చెప్పలేదా?’’ అని చమత్కరిస్తూ జవాబు రాసేవారు. జంట కవులుగా రాణించవచ్చునని తన స్నేహితుడైన దీపాల పిచ్చయ్య శాస్త్రితో కలసి కవిత్వం రాద్దామనుకున్నారు. అయితే, జంటకవులకు ముందు పేర్లు చక్కగా కలవాలిగదా! ఈయన జాషువా, ఆయన పిచ్చయ్య. జాషువా పేరు ముందు పెడితే ‘‘జాషువా పిచ్చి’’ అవుతుంది. పోనీ పిచ్చయ్య పేరు ముందు పెడదామా అంటే ‘‘పిచ్చి జాషువా’’ అవుతుంది. ఎటుచూసినా జాషువాకే పిచ్చిపట్టేటట్లు వుండటం చేత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ‘‘మందు తీసుకుంటున్నారు కదా జ్వరం తగ్గిందా’’ అని ఎవరైనా అడిగితే, ‘‘తగ్గింది’’ అనేవారు. ‘‘ఎంత తగ్గింది?’’ అని అడిగితే, ‘‘సీసాలో సగం తగ్గింది’’ అనేవారు. ‘‘సీసాలో ఏమిటి?’’ అని అంటే, ‘‘అదే, మందు తగ్గింది’’ అంటూ నవ్వించేవారు. ఎన్నెన్నో సన్మానాలు, పురస్కారాలు, బిరుదులు, పట్టాలు, రాజకీయ పదవులు, గండపెండేరాలు, పగటి దివిటీల ఊరేగింపులు పొంది తనలోని విద్వత్తుని దర్శించమని మనిషికీ మనిషికీ మధ్య కులాల గోడలు కట్టి మానవతను మరచిపోవద్దని చాటిన మహానీయులు జాషువా. ఒక వ్యక్తిని వ్యక్తి దూరం ఉంచడం హేయమైన భావనని చాటారు. భయంకరమైన కుల వివక్షతని విడనాడాలని పిలుపునిచ్చారు. కవి మరణించినా ప్రజల నాల్కలపై చిరంజీవియేనని పిరదౌసిలో చెప్పిన మాటలు అక్షర సత్యాలై నేటికీ వారిని గురించి తెలుసుకుంటూ, పాఠ్యపుస్తకాలుగా వారి రచనల్ని చదువుతూ భవిష్యత్తరాలకు పరిచయం చేస్తున్నాం. కాలానికి లొంగిపోకుండా కాలానికి అతీతంగా జీవించిన కవికోకిల మన జాషువాగారు. ఆయన విశ్వ నరుడే కాదు మానవీయ విలువలు కల్గిన మహనీయుడు, మహాకవి జాషువా.
( సెప్టెంబర్ 28 కవి కోకిల గుర్రం జాషువా జయంతి సందర్భంగా)
సెల్:7981407839