యండి. ఉస్మాన్‌ఖాన్
ఇటీవలి కాలంలో బాగా ప్రచారంలో ఉన్న పదం ‘వక్ఫ్’. దీని అర్ధం నిలకడ, ఆపుదల, ధర్మసొత్తు, ధర్మార్ధము అని వస్తుంది. షరియత్ పరిభాషలో ఎవరైనా ఒకవ్యక్తి తనకు చెందిన ఆస్తిపై లేక వస్తువుపై తన హక్కును, యాజమాన్యాన్ని పూర్తిగా వదులుకొని దైవానికి దఖలు పరచడాన్ని ‘వక్ఫ్’ అంటారు. అంటే ఏదేని భూమి, వస్తువు లేక మరేదైనా వక్ఫ్ చేసిన తరువాత ఇక తనకుకాని, తన వారసులకు కాని మరెవరికైనా దానిపై ఏవిధమైన హక్కూ, అధికారం ఉండదు. అది పూర్తిగా అల్లాప్‌ా కే చెందిన ఆస్తి. వక్ఫ్ ఒక ఆరాధన.
వక్ఫ్ ప్రధాన ఉద్దేశ్యం దైవాన్ని సంతోష పరచడం, సాటి మానవులపై ప్రేమను వ్యక్త పరచడం. నిజానికి ఇస్లాంకు పూర్వం వక్ఫ్ భావన లేదు. పవిత్ర ఖురాన్‌లో, మీరు అత్యధికంగా ప్రేమించే వాటిని దైవమార్గంలో వినియోగించనంతవరకు మీరు ధర్మపరాయణులు కాలేరు.’ అది తెలుసుకున్న అనేకమంది ప్రవక్త అనుచరులు తమ విలువైన ఆస్తి పాస్తుల్ని (తోటలు, భూములు వగైరా) దైవమార్గంలో వితరణ చేశారు. ప్రవక్తకాలంలో ప్రారంభమైన వక్ఫ్ భావన ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొనసాగుతోంది. భారతదేశాన్ని రమారమి వెయ్యేళ్ళపాటు పాలించిన ముస్లిం రాజులు అసంఖ్యాక మసీదులు, ఖబ్రస్తాన్‌లు, దర్గాలు, విద్యాలయాలకు విలువైన భూములు, ఆస్తులు వక్ఫ్ చేశారు. వక్ఫ్ ప్రాముఖ్యం, నిరంతరం, తరంతరం లభించే పుణ్యఫలాన్ని దృష్టిలో ఉంచుకొని ముస్లింలు తమ విలువైన ఆస్తిపాస్తుల్ని వక్ఫ్ చేస్తూవచ్చారు. మసీదులు, విద్యాలయాలు, దర్గాలు, స్మశాన వాటికలు, సత్రాలు మొదలైనవి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా సజావుగా నిరాటంకంగా కలకాలం కొనసాగడానికి ఈ ఆస్తులు దోహదపడాలని వాటిని అల్లాప్‌ా పేర అంకితం చేశారు. కనుక వక్ఫ్ ఆస్తులపై ఎవరికీ ఎటువంటి హక్కూ, అధికారము ఉండదు.
అవి కేవలం అర్హత కలిగిన పేదసాదల సంక్షేమానికి, వాటి నిర్వహణకు మాత్రమే వినియోగించాలి. కాని ఈ స్పూర్తికి భిన్నంగా ఆంగ్లేయుల కాలంలో వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం మొదలైంది. ముస్లింలు దీన్ని అడ్డుకోవడంతో వక్ఫ్‌యాక్ట్ 1923 ఉనికిలోకి వచ్చింది. 1945లో పూర్తిస్థాయిలో వక్ఫ్‌యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. అనేక సందర్భాల్లో సవరణలు కూడా చేశారు. యాక్ట్ ప్రధాన ఉద్దేశ్యం వక్ఫ్ ఆస్తుల్ని సంరక్షించడం, వాటి దుర్వినియోగాన్ని నివారించడం. కాని వక్ఫ్‌యాక్ట్ ఉన్నప్పటికీ దాని ఉద్దేశం నెరవేరలేదు. మళ్ళీ 1985లో మరోకొత్త వక్ఫ్ చట్టం తీసుకువచ్చినా ముస్లింల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు.
తరువాత 1995లో, 2010లో, 2013లో చట్టంలో సవరణలు చేశారు. అయినా నిరాశే మిగిలింది. ఇప్పుడు తాజాగా నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై కన్నేసి చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. ఎందుకంటే మనదేశంలో సైన్యం, రైల్వే తరువాత అత్యధిక ఆస్తులు వక్ఫ్ బోర్డు దగ్గర మాత్రమే ఉన్నాయట. ఎలాగైనా ఈ ఆస్తుల్ని ముస్లింల దగ్గరినుండి లాగేసుకోవాలని, ఇప్పటికే తమ అస్మదీయుల కబ్జాల్లో ఉన్న వేలకోట్ల ఆస్తుల్ని క్రమబద్దీకరించుకోవాలన్నది మోదీ షా అండ్ కో దుష్టపన్నాగం. అందుకే ఈ కొత్త బిల్లులో షుమారు నలభై సవరణలు ప్రతిపాదిస్తూ ముస్లింల సంక్షేమంకోసమే ఈ బిల్లు తెస్తున్నామని, దీనివల్ల ముస్లిం సమాజానికే మేలు కలుగుతుందని ఎప్పటిలాగే కపటప్రేమ ఒలకబోస్తున్నారు. బిల్లును గనక నిశితంగా పరిశీలిస్తే మోదీ ప్రభుత్వ కపటప్రేమ, దురుద్దేశం స్పష్టంగా అర్ధమవుతుంది. సరాసరి ముస్లింల ధర్మంలో, వారి వ్యక్తిగత వియయాల్లో వేలుపెట్టడం, ధర్మపరంగా వారికున్నటువంటి ప్రత్యేకతను దెబ్బతీయడం లక్ష్యంగా కనబడుతోంది. బీజేపీ సర్కార్ ప్రతిపాదించిన సవరణ బిల్లు ప్రకారం ముస్లిమేతరులు కూడా బోర్డు మెంబరు, సీఈఓలుగా ఉండవచ్చునట. కాని, ప్రతిపాదిత చట్టం ప్రకారం, తమ ఆస్తుల్ని వక్ఫ్ చేయడానికి ముస్లిమేతరులు అర్హులు కానప్పుడు ఎక్జిక్యూటివ్ లుగా, సీఈవోలుగా ఎలా అర్హులు అవుతారన్నదానికి సహేతుక సమాధానం లేదు.
అంటే చట్ట సవరణద్వారా తమవారిని (సంఫీుయులను) బోర్డులోకి పంపి వక్ఫ్ ఆస్తుల్ని క్రమక్రమంగా కాజేయడం అసలు ఉద్దేశం. ఈ సవరణల్లో ఉన్న మరో దుర్మార్గం ఏమిటంటే, ఏ ఉద్దేశం కోసం ముస్లింలు తమ ఆస్తుల్ని వక్ఫ్ చేశారో, అది కాకుండా ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన పద్దుల్లో వెచ్చిస్తుందట. ఇది వక్ఫ్ మూల సూత్రానికే వ్యతిరేకం. మరో గమ్మత్తయిన విషయం ఏమంటే, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని ఐదేళ్ళుగా ఆచరిస్తున్నారో వారే వక్ఫ్ చేయడానికి అర్హులట. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఐదేళ్ళు పూర్తికానివారు తమ ఆస్తుల్ని దానం చేస్తామంటే ఈ కొత్త చట్టం ఒప్పుకోదు. ఇదికూడా వక్ఫ్ సూత్రానికి, స్పూర్తికి వ్యతిరేకమే. ఎందుకంటే ఇస్లాం ప్రకారం ముస్లిమేతరులుకూడా వక్ఫ్ చేయడానికి అర్హులే. కాని ఇదేమి చట్టమో ముస్లిం అయిఉండికూడా వక్ఫ్ చేస్తానంటే ఈచట్టం ఒప్పుకోవడంలేదు. నిజానికిది ఒక ముస్లింను తన ధర్మపరమైన ఆరాధన చేయవద్దని అడ్డుకోవడమే. భారత రాజ్యాంగంలోని 25 వ అధికరణ ప్రకారం ప్రతి వ్యక్తీ స్వేఛ్ఛగా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కును కలిగి ఉన్నాడు. ఆర్టికల్ 26 ప్రకారం ప్రతి ఒక్కరూ తమ మతం శాఖలను, ధార్మిక కార్యకలాపాల కోసం సంస్థలను స్థాపించుకొని, వాటిని నిర్వహించుకొనే హక్కునూ కలిగి ఉన్నారు.
రాజ్యాంగ ప్రసాదితమైన ఈ హక్కును కాలరాసే అధికారం ఎవ్వరికీలేదు. అలాగే ఈ సవరణ బిల్లులో ఉన్న మరో దుర్మార్గం ఏమిటంటే, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే నిర్ణయాధికారం జిల్లా కలెక్టర్లకు దఖలు పరచడం జరిగింది. ప్రస్తుతమైతే వివాద పరిష్కారానికి హైకోర్టు న్యాయమూర్తి నియమించిన వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. దీన్ని కాదని కలెక్టర్లకు నిర్ణయాధికారం కట్టబెడితే వాళ్ళు పాలకులకే వత్తాసు పలికే అవకాశాలు ఎక్కువ. మసీదు, మదర్సా, దర్గా, ఈద్గా తదితరాల విషయంలో ఏచిన్న సమస్య తలెత్తినా దాన్ని ప్రభుత్వ ఆస్తిగా కలెక్టర్లతో రాయించేసుకోవడం ప్రభుత్వాధినేతలకు పెద్ద లెక్కకాదు. నాలుగైదు వందల ఏళ్ళనాటి మసీదులు, దర్గాలు, ఖబ్రస్తాన్ల రికార్డులు ఇప్పుడు కావాలంటే ఆచరణాత్మకంగా జరిగేపనికాదు. ఈవిధంగా కూడా కేంద్ర సర్కారు ముస్లింల ఆస్తుల్ని కొల్లగొట్టి వారి నోట్లో మన్నుకొట్టాలని చూస్తోంది. నిజానికి ధర్మం ప్రకారం, కొందరు సాక్షుల సమక్షంలో నేను నా ఫలానా ఆస్తిని అల్లాప్‌ా పేర వక్ఫ్ చేస్తున్నాను. అన్నా అది వక్ఫ్‌గా పరిగణించడం జరుగుతుంది. మరి ఐదొందల ఏళ్ళనాటి సాక్షులు ఇప్పుడు ఉంటారా? కాబట్టి వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించడమంటే, నిస్సందేహంగా ముస్లింల విలువైన ఆస్తుల్ని తేరగా కొల్లగొట్టడం, ఇప్పటికే కబ్జాకోరుల కబంధ హస్తాల్లో ఉన్న ఆస్తుల్ని క్రమబద్దీకరించి వారికి ధారాదత్తం చేయడానికి మాత్రమే నరేంద్రమోదీ సర్కారు తీసుకురాదలచుకున్న దుర్మార్గమైన నిర్ణయంగా పరిణించాల్సి ఉంటుంది. దాతృత్వం అనే భావనను నిర్వీర్యం చేసి ఆక్రమణదారులను, కబ్జాకోరులను ఆస్తులకు యజమానులుగా మార్చాలనుకుంటున్న ప్రతిపాదిత దుర్మార్గపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నిర్ద్వందంగా తిరస్కరించాలని, తిరస్కరిస్తుందనీ ఆశిద్దాం.
సీనియర్ జర్నలిస్ట్