మొట్ట మొదట భారత పతాకాన్ని కోల్‌కత లోని పర్సీ బగాన్ స్క్వేర్ (గ్రీన్ పార్క్) లో 1907 ఆగస్టు 7న ఎగురవేశారు. కానీ విదేశీ గడ్డపై తొలిసారిగా భారత పతాకాన్ని ఎగురవేసింది మాత్రం భికైజీ కామా. ఆమె 1907 ఆగస్టు 22న పారిస్‌లో తోటి విప్లవకారులతో కలిసి ఆవిష్క రించారు. కానీ ఈ ఆవిష్కరణ 1905లోనే జరిగిందన్న వాదనలూ ఉన్నాయి. ఈ పతాకాన్ని బెర్లిన్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహాసభలో ప్రదర్శించారు కూడా. ఈ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా భారత్‌లో సమానత్వం, స్వయం నిర్ణయాధికారం కావాలని ఆమె కోరారు. ఆమెను మేడం కామా అంటారు. కోల్‌కతా లో 1906 ఆగస్టు ఏడున ఆవిష్కరించిన పతాకం ఇప్పటి జాతీయ పతాకానికి భిన్నంగా ఉండేది. దాని మీద అడ్డంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు ఉండేవి. మధ్యలో ‘‘వందేమాతరం’’ అన్న అక్షరాలు ఉండేవి. మేడం కామా జర్మనీలో తొలిసారి భారత పతాకాన్ని ఆవిష్కరించి నప్పుడు భారత స్వాతంత్య్రోద్యమాన్ని సమర్థించాలని అమెరికాకు విజ్ఞప్తి చేశారు. భికైజీ కామా కోల్‌కతాలో 1861లో సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించారు. విద్యార్థిగా ఆమె తెలివైంది, క్రమశిక్షణ కలిగింది, భాషల అధ్యయనం మీద ఆసక్తి ఉన్న వ్యక్తి అన్న పేరు ఉండేది. ఆ తరువాత వెంటనే ప్లేగు వ్యాధి వచ్చింది. 1896 అక్టోబర్‌లో బొంబాయి ప్రెసిడెన్సీలో మొదట విపరీతమైన కాటకం ఆ తర్వాత వెంటనే ప్లేగు వ్యాధి వచ్చిన పీడితులను ఆదుకోవడానికి వైద్య కళాశాల ఆర్థిక సహాయం అందజేసింది. అనేక బృందాలు ప్లేగు వ్యాధి సోకిన వారికి పని చేసేవి. కామా అలాంటి ఒక బృందంలో చేరి ప్లేగు సోకిన వారికి సేవ చేశారు. ఈ క్రమంలో ఆమెకు కూడా ప్లేగు సోకింది. కానీ ప్రాణాలు కాపాడుకోగలిగారు. ప్లేగు సోకిన వారికి సహాయం కోసం ఆర్థిక వనరులు అందజేసిన వైద్య కళాశాలే ఆ తరవాత హాఫ్కిన్ ప్లేగు టీకా పరిశోధనా కేంద్రంగా మారింది. కోల్‌కతాలో ఎగురవేసిన భారత పతాకానికి, పారిస్‌లో కామా ఆవిష్కరించిన పతాకానికి స్వల్ప తేడాలు ఉన్నాయి. ప్రస్తుత జాతీయ పతాకానికి స్ఫూర్తి నిచ్చింది కామా ఆవిష్కరించిన పతాకమే స్ఫూర్తి అంటారు. 1905లో కామా పారిస్ వెళ్లి అక్కడ ఎస్.ఆర్. రాణా, ముంచెష బుర్జోర్జి గోడ్రెస్ తో కలిసి ‘పారిస్ ఇండియన్ సొసైటీ’ స్థాపించారు. ప్రవాస జీవితం గడుపుతున్న అనేక మందితో కలిసి కామా పనిచేసేవారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ నుంచి ఆమె స్వాతంత్య్రోద్యమానికి మద్దతుగా విప్లవ సాహిత్యం పంపిణీ చేసేవారు. వందేమాతరం గేయాన్ని కూడా ప్రచారంలో పెట్టేవారు. మదన్‌లాల్ ఢీంగ్రాను కాల్చి చంపినందుకు నిరసనగా మదన్ తల్వార్లు (కత్తులు) కూడా పంపిణీ చేసేవారు. కామా రూపొందించే వారపత్రికలు, ఇతర విప్లవకర సాహిత్యాన్ని అప్పుడు ఫ్రాన్స్ వలస ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి ద్వారా భారత్‌లోకి ప్రవేశ పెట్టేవారు. కామా లాంటి వారు విదేశీ గడ్డ మీంచి భారత స్వాతంత్య్రంకోసం చేసిన కృషి అమెరికాలోని ఆఫ్రికా రచయితలకు, డబ్ల్యు. ఇ.బి. డు బోయిస్ లాంటి వారికి ప్రేరణగా ఉండేదంటారు. ఆయన 1928లో రాసిన నవల ‘‘డార్క్ ప్రిన్సెస్’’ ఇతివృత్తం భారత స్వాతంత్య్ర పోరాటమేనంటారు. భికైజీ కామా స్త్రీ పురుష సమానత్వంకోసం పాటు పడేవారు. 1910లో ఈజిప్ట్ లోని కైరోలో మాట్లాడుతూ ‘‘ఇక్కడ ఈజిప్టు ప్రతినిధుల్లో సగం మంది ఉన్నారు అన్నారు. మిగతా సగం మంది ఎక్కడున్నారు? మీ తల్లులు, అప్ప చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు? మీ భార్యలు, కూతుర్లు ఎక్కడ?’’ అని ప్రశ్నించారు. అంటే ఆమె స్త్రీల ప్రాతినిధ్యం కోసం అపేక్షించారు. 1885లో ఆమె రుస్తుంజీ కామాను పెళ్లాడారు. ఆయన న్యాయవాది. బ్రిటిష్ వారికి అనుకూలురు. కామా ఉద్యమాల్లో పాల్గొనడం ఆయనకు నచ్చలేదు. వాళ్లిద్దరి మధ్య పొసగక పోవడం, ఆరోగ్యం బాగుండక పోవడంతో ఆమె లండన్ వెళ్లాల్సి వచ్చింది. లండన్‌లోనే ఆమెకు దాదాభాయ్ నౌరోజీతో పరిచయం అయింది. ఆయన సిద్ధాంతం బాగా ఆకట్టుకుంది. అందువల్లే స్వాతంత్య్ర ఉద్యమంలోకి దూకారు. అక్కడే ఆమె శ్యాం లాల్ వర్మ, లాల హర్దయాళ్ లాంటి వారిని కలుసుకున్నారు. స్వాతంత్య్రోద్యమంలో కీలకమైన వ్యక్తిగా మారారు. ఆమె అమెరికాలో పర్యటించి భారత్‌లో బ్రిటిష్ పాలన దుష్పరిణామాలను వివరిస్తూ ప్రసంగించేవారు. ‘‘చూడండి స్వతంత్ర భారత పతాకం అవత రించింది. ఇది స్వాతంత్య్రంకోసం పోరాడిన యువత రక్తంతో రూపొందింది. వారి గౌరవార్థం ఈ పతాకం ఉద్భవించింది. వారి పేర భారత స్వాతంత్య్ర సమరాన్ని మీరందరూ సమర్థించాలని కోరుతున్నాను’’ అనే వారు. ‘‘భారత్ స్వతంత్రం కావాలి. గణతంత్రం కావాలి. భారత్ సమైక్యంగా ఉండాలి’’ అని గర్జించేవారు. లండన్ నుంచి ఆమె స్వదేశానికి తిరిగి రావాలనుకున్నప్పుడు తాను భారత్ తిరిగి వెళ్తే జాతీయోద్యమంలో పాల్గొనబోనని వాగ్దానం చేయాలి అన్న షరతు పెట్టారు. కాని ఆమె ఈ షరతును నిరాకరించారు. ఆమెకు స్త్రీ పురుష సమానత్వంపై అమితమైన ఆకాంక్ష ఉండేది. కాని 1920లో హెరాబాయ్, మిథన్ టాటాను కలుసుకున్నప్పుడు వారు మహిళలకు ఓటు హక్కు ఉండాలని మాట్లాడారు. ఈ ఇద్దరు పార్సీ మహిళలతో అంగీకరిస్తూనే ముందు భారత్‌కు స్వాతంత్య్రం కావాలి అని ఖండితంగా చెప్పారు. స్వాతంత్య్రంవస్తే భారత మహిళలకు ఓటు హక్కుతో సహా సర్వ హక్కులు వస్తాయని విశ్వసించారు.1935 దాకా ఆమె ప్రవాస జీవితమే గడిపారు. కానీ తీవ్రంగా జబ్బు పడడంవల్ల, పక్షవాతం సోకడంవల్ల ఎలాగైనా స్వదేశం తిరిగి రావాలను కున్నారు. సర్ చొవాస్జీ జెహంగీర్ ద్వారా బ్రిటిష్ పాలకులకు అభ్యర్థన పంపించారు. స్వదేశం తిరిగి రావాలన్న ఆకాంక్ష బలంగా ఉన్నందువల్ల 1935 జూన్ 24న పారిస్ నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన లేఖలో తాను స్వదేశం తిరిగి వెళ్తే రాజద్రోహ కార్యకలాపాలకు పాల్పడను అని హామీ ఇచ్చారు. 1935 నవంబర్ లో స్వదేశం తిరిగి వచ్చారు. తొమ్మిది నెలల తరవాత 74వ ఏట 1936లో మరణించారు.
- అనన్య వర్మ