దాసరి భాగ్యలక్ష్మమ్మ
75 సంవత్సరాల క్రితం 1948`52 మధ్య కాలంలో పార్టీపై నిషేధం ఉన్న సమయంలో కమ్యూనిస్టు కంచుకోటగా పేరొందిన యూ రాజుపాలెం గ్రామంపై 1949 అక్టోబర్ 1వ తేదీన పోలీసులు దాడిచేసి నాయకుల ఆచూకీ తెలపాలని జరిపిన కాల్పుల్లో పోలీసు తూటాలకు ఎదురొడ్డి పోరాడి పెద్ద వెంకటన్న, మారెన్న, చిన్న వెంకటన్నలు అమరులయ్యారు. వెంకట్రామయ్య పెద్ద గంగులు, పాలేటి గంగులు మొదలగువారు వికలాంగులు అవ్వటమే కాక ప్రభుత్వం బనాయించిన కేసులలో ఆరు మాసాలు జైలుశిక్ష పడినా లెక్కచేయకుండా నమ్మిన సిద్ధాంతంకోసం చివరి వరకు పోరాడి నేలకొరిగిన అమర వీరుల త్యాగం అజరామరమైనది. 1948 ఫిబ్రవరిలో కలకత్తాలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 2వ జాతీయ మహాసభలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని, దేశవ్యాప్తంగా భూస్వాములకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటానికి శిక్షణ ఇవ్వాలని చేసిన తీర్మానం వెలువడిన మరుక్షణం భారత ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. ఈ కాలంలో ఆంధ్ర, తమిళనాడు, కేరళలో పార్టీపై నిషేధం ఉంది. 1948-52 మధ్యకాలంలో దేశం మొత్తంగా ప్రత్యేకించి ఆంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమానికి చాలా గడ్డుకాలం.
తెలంగాణలో రైతాంగ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించడం ఆంధ్ర ప్రాంతం నుంచి ఆయుధాలు ధనసహాయంతోపాటు తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతిచ్చే విధంగా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా గెరిల్లా దళాలకు తుపాకీ శిక్షణ ఇవ్వడం వంటి కారణా లతో 1948-52 మధ్యకాలంలో భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురైంది. పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు రహస్య జీవితం గడుపుతున్నప్పటికీ జాతీయ స్థాయిగల నాయకులను రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనేకమంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా ముఖ్యనాయకులైన గజ్జల మల్లారెడ్డి, మోకా వెంకటసుబ్బయ్య పంజాబ్ నర్సింహారెడ్డి, హుస్సేన్‌బాబు, టేకూరు సుబ్బారావు ఇంకా మరికొంతమందిని అరెస్టుచేసి కడలూరు జైలుకు పంపారు. నాయకుల ఆచూకీ తెలపాలంటూ సానుభూతిపరుల గ్రామాలపై భూస్వాముల సహకారంతో పోలీసులు దాడులుచేసి మహిళలను హింసించడం, ఆరుగాలం కష్టపడి పండిరచిన పంట నిలువజేసిన కందకాలు(ఇంటి మధ్యలో బండలతో నిర్మించిన కందకం), గాజాలలో (వెదురు దబ్బలతో అల్లిన పెద్ద బుట్ట), గంజరం (పశువుల మూత్రం) పోసి నానా బీభత్సం సృష్టించేవారు, ఎన్ని అవాంతరాలు కల్పించినా పార్టీ సానుభూతి పరులు అధికంగా ఉన్న గ్రామాల నాయకులను కంటికి రెప్పలా ాడుతూ వచ్చిన గ్రామాల్లో యు రాజుపాలెం ముఖ్యమైనది. రాత్రిపూట నాయకులను అటక మీద (ఇంటి పైకప్పుకు దూలాలకు మధ్యలో వ్యవసాయ పనిముట్లు ఉంచేందుకు ఏర్పాటుచేసిన) నిర్మాణంపై నాయకులకు ఆశ్రయం కల్పించి కాపలా కాసేవారు. కమ్యూనిస్టు నాయకులు కనిపిస్తే అరెస్టు చేయడం, ప్రతిఘటిస్తే కాల్చివేయడం, ఆశ్రయం కలిపిస్తే జైలుకు పంపడం ఖాయమని తెలిసినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ మారువేషాల్లో పార్టీ నాయకులను కలుస్తూ, కందిచేలల్లో కమ్యూనిజం పాఠాలు బోధించి ఉద్యమాలు నిర్మించిన నేతలను కన్న నేల కడప జిల్లాది. 1948-51 మధ్య కాలంలో ఆంధ్రాలో దాదాపు 400 మంది ముఖ్య కార్యకర్తలను పోలీసులు కాల్చి చంపారు. ఈ సందర్భంలోనే కడప జిల్లాలో జరిగిన ముఖ్య సంఘటన యూ రాజుపాలెం కాల్పుల సంఘటన. 1948 కలకత్తా పార్టీ మహాసభ ఇచ్చిన పిలుపుతో గ్రామాల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు పెద్ద ఎత్తున జరిగాయి. కడప జిల్లాలో గ్రామ పెత్తందారులకు వ్యతిరేకంగా ఈ పోరాటాలు జరిగాయి. కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో కమలాపురం తాలూకా యూ రాజుపాలెం గ్రామంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో దూదేకుల, దళిత కులాలు ప్రధానపాత్ర వహించాయి. యూ రాజుపాలెం భూస్వామి అయిన కేశిరెడ్డి గ్రామ పేద ప్రజలకు ఇచ్చిన అప్పుకూ నివాసముండే ఇళ్లు సైతం జప్తు చేయించి అప్పును వసూలు చేసుకోవడమే కాక ఆర్థికంగా వెనుకబడిన గ్రామస్థుల చేత ఉచితంగా, బలవంతంగా తన పొలంలోనూ, ఇంటి నిర్మాణం లోనూ సేవలు చేయించుకునేవారు. జాతీయోద్యమ ప్రభావస్పూర్తితో గ్రామంలోని పాలెం చెన్నారెడ్డి, దూదేకుల పెద్ద వీరన్న, దళితులైన పెద్ద వెంకటన్న మారెన్న చిన్న వెంకటన్న, సంటెన్న మొదలగువారు కేసీ రెడ్డి నియంతృత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీపైన నిషేధం విధించారు. కమ్యూనిస్టు నాయకుల కొరకు గ్రామాలపై పోలీసుల దాడి మొదలయ్యింది. దీనిని అదనుగా భావించిన భూస్వామి కేసీ రెడ్డి ప్రభుత్వానికి సహకరించి మలబార్ పోలీసులను యు రాజుపాలెం గ్రామ సమీపంలోని తన పొలంలో మోహరింపజేసి వుండగా తెలుసుకున్న గ్రామ ప్రజలు అప్రమత్తమై పోలీసులపైకి ఎదురుదాడికి సిద్ధమై ఉండగా 1949 అక్టోబర్ ఒకటవ తేదీన పోలీసులు యూ రాజుపాలెం గ్రామంపై దాడిచేయగా గ్రామ ప్రజలు ప్రతిఘటించారు. నిరాయుధులైన గ్రామ ప్రజలపై పోలీసులు అమానుషంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో దళితులైన పెద్ద వెంకటన్న మారెన్నా, చిన్నవెంకటన్న అక్కడికక్కడే మరణించగా వెంకట్రామయ్య, పెద్ద గంగులు, పాలేటిగంగులు మొదలగువారు వికలాంగులు అవ్వటమే కాక ప్రభుత్వం విధించినా కేసులలో ఆరుమాసాలు జైలుశిక్ష కూడా అనుభవించారు. ఈ సంఘటనలో మహిళలు నిర్వహించిన పాత్ర మరువరానిది. ఈ సంఘటన అనంతరం గ్రామ సమీపంలోని ఎర్రకొండ ప్రాంతంలో కమ్యూనిస్టు జిల్లా పార్టీ నాయకులు రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉండగా వారికి దళిత మహిళలు మొదలు ఇతర మహిళలు కమ్యూనిస్టు నాయకులకు ఆహారపదార్థాలను, పార్టీ సమాచారాన్ని చేరవేసేటటువంటి కొరియర్ బాధ్యతలను సమర్థ్ధవంతంగా నిర్వ హించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరివరకు నిలిచి అమరులైన పాలెం చెన్నారెడ్డి, నాదెండ్ల వీరన్న, వేంపల్లి దస్తగిరి యు రాజుపాలెంలోని పార్టీ కార్యకర్తల పోరాటం, తెగువ వీరులపాలెంగా పేరు గడిరచింది. ఇదే పోరాట స్ఫూర్తితో జిల్లాలో అనేక గ్రామాలలో వెట్టిచాకిరి వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగించిన ఫలితంగానే అనేకమంది దళిత బడుగు బలహీన వర్గాలకు సాగు భూమి, ఇండ్లు, ఇంటి స్థలం పంపిణీ చేశారు. పార్టీ ఉద్యమం ద్వారా వచ్చిన కుటుంబ పరిచయాలు వివాహబంధాలతో పాలెం చెన్నారెడ్డి కుటుంబం అంకాలమ్మ గూడూరు పొన్నతోట వెంకటరెడ్డి కుటుంబం, బద్వేలు కోన పుల్లారెడ్డి కుటుంబాలతో బలమైన పార్టీ బంధుత్వం ఏర్పడిరది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి కమలాపురం, పులివెందుల నియోజకవర్గంనుంచి యు రాజుపాలెం కేంద్రంగా చేసుకొని అజ్ఞాతవాసం గడిపిన ఎన్ శివరామిరెడ్డి ఎమ్మెల్యేగా, కడప పార్లమెంటు నుంచి ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. వారు చట్ట సభలను వేదికగా చేసుకొని సిమెంటు పరిశ్రమల ఏర్పాటుకు, ప్రాజెక్టుల నిర్మాణానికి, రేడియో స్టేషన్ సాధన కోసం విశేష కృషిచేశారు. దీని కొనసాగింపుగా 2005 స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరపునాయిని పల్లె మండలం జడీ్పటీసీగా జి ఓబులేసు ఎన్నిక కావడం, నాటి నుంచి నేటి వరకు యు రాజుపాలెం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు గెలవడం లేదా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరుగుతున్నదంటే పార్టీ పట్ల వారికున్న నిబద్దతే. విజయవాడలో జరిగిన పార్టీ జాతీయ మహాసభల తీర్మానం ప్రకారం గ్రామీణ ప్రాంతాలనుంచి పార్టీని పునర్నిర్మించి పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఉన్నారు. కడప జిల్లా కమ్యూనిస్టుపార్టీ యు రాజుపాలెంలో కాల్పులు జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమరవీరుల దినోత్సవాన్ని అక్టోబరు1న ఘనంగా నిర్వహించేందుకు యు రాజుపాలెంను ముస్తాబు చేసింది. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యులు జి ఓబులేసు, జి ఈశ్వరయ్య హాజరు కానున్నారు.
పరిశోధకురాలు,
యోగి వేమన యూనివర్సిటీ, కడప