విశాలాంధ్ర, పార్వతీపురం: నవయుగకవి చక్రవర్తి గుర్రంజాషువా 129వ జయంతి సందర్భంగా 2024 గుర్రంజాషువా కవిత పురస్కారానికి ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ప్రముఖ కథారచయిత,ప్రముఖ సాహితీవేత్త, గేయరచయిత, కవితారచయిత గంటేడ గౌరునాయుడు ఎంపికైనట్లు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం వారు తెలిపారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం,ప్రజానాట్యమండలి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈనెల 27న గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో గౌరునాయుడుకు, డాక్టర్ ఆచార్య గుమ్మ సాంబశివరావులకు ఈపురస్కారం ప్రధానోత్సవం చేయడం జరుగుతుందని తెలియజేశారు. గంటేడ గౌరునాయుడు తోపాటు ప్రముఖ అభ్యుదయకవి డాక్టర్ ఆచార్య గుమ్మ సాంబశివరావు కూడా ఎంపికైనట్లు వారు తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త గౌరునాయుడుగూర్చి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం వారిమాటల్లో “పాడుదమా స్వేచ్ఛాగీతం- ఎగరేయుదమూ జాతిపతాకం”
అంటూ ప్రజలలో దేశభక్తి భావాన్ని నింపటమేకాక, అభ్యుదయ సాహిత్యాన్ని సమాజానికి అందించిన గొప్ప సాహితీవేత్త
గంటేడ గౌరునాయుడు. ఉత్తరాంద్రలోని పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, దళాయిపేట గ్రామంలో సాధారణ
వ్యవసాయ కుటుంబంలో 1954 ఆగష్టు 7న జన్మించారు. తల్లి సోములమ్మ, తండ్రి సత్యంనాయుడు. తండ్రి నుండి పుణికి
పుచ్చుకున్న అభ్యుదయ భావాలనే తన సాహిత్యంలోను వ్యక్తపరిచారు. తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అంచలంచెలుగా ఎదిగి గొప్ప సాహిత్యాన్ని
సమాజానికి అందించారు. ఉద్యోగ విరమణ అనంతరం “ స్నేహ కళాసాహితీ” సంస్థను
ఏర్పాటుచేసి సాహిత్య సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన వ్రాసిన “పాడుదమా స్వేచ్ఛా గీతాన్ని” మహరాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా భోధిస్తుందంటే దీని ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరిస్తూ వ్రాసిన కవితను అంబేత్కర్ యూనివర్శిటి పాఠ్యాంశంగా భోధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గురజాడ సాహిత్య పురస్కారం, ఉగాది పురస్కారంతోపాటు ఇంకా దాదాపు 9 పురస్కారాలను అందుకున్నారు. కవితలు,
కథలు, వ్యాసాలతో కూడిన 20 గ్రంధాలు వ్రాసిన అభ్యుదయ సాహితీ వేత్తకు 2024
గుఱ్ఱం జాషువా సాహితీ పురస్కారాన్ని ఇవ్వటం సముచితంగా భావిస్తున్నామని తెలియజేశారు. ఈనెల 27న గుంటూరులో జరగనున్న కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు కె ఎస్ లక్ష్మణరావు అధ్యక్షత వహించనుండగా, ప్రధానవక్తలుగా మాజీ ఎమ్మెల్సీ, సాహిత్య ప్రియులు విఠపు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, సాహితీ స్రవంతి రాష్ట్రఅధ్యక్షులు కెంగార మోహన్ లు పాల్గొంటారని తెలియజేశారు. గుర్రం జాషువా కవితా పురస్కారానికి గంటేడ ఎంపికపట్ల పార్వతీపురం మన్యం జిల్లాలోని స్నేహకళాసాహితీ, సాహితీ లహరి,అరసం తదితర సాహిత్య సంస్థలు అభినందన తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాహితివేత్తలు మంచుపల్లి శ్రీరాములు, పల్ల పర్శి నాయుడు,జి రామకృష్ణ, జగదీష్ ,స్వామినాయుడు, రవీంద్ర ,అప్పలనాయుడు రామలింగ స్వామి, భీమేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, గోపాలరావు, రోహిణి కుమార్, సోమేశ్వరరావు, చిన్నమునాయుడు తదితర రచయితలు, ఉపాధ్యాయులు, సాహితీ అభిమానులు అభినందించారు.