దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయినా తలెత్తుకునే ప్రదర్శన కనబర్చామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఈ సీజన్‌లో కూడా ఆ జట్టుకు టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీ ఎప్పటిలానే కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దాంతో టైటిల్ లేకుండానే ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లి ప్రయాణం ముగిసింది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ ప్రదర్శనను, కోల్‌కతా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయాన్ని ఉద్దేశిస్తూ కోహ్లి ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు.
గర్వపడుతున్నా… : ‘మాకు కావాల్సిన ఫలితం దక్కలేదు. కానీ టోర్నీ ఆసాంతం మా ఆటగాళ్లు కనబర్చిన పోరాటపటిమపై గర్వంగా ఫీలవుతున్నా. టోర్నీలో మా ప్రయాణం నిరాశగా ముగిసినప్పటికీ తలెత్తుకునేలా ఆడాం. మాకు సహకరించిన అభిమానులకు, మేనేజ్‌మెంట్, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు’అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందిస్తూ.. ‘మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు మాపై పూర్తి ఆధిపత్యం కనబరిచారు. అదే మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. వారు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. వికెట్లు పడగొట్టారు. మాకు శుభారంభమే లభించింది. కానీ.. ఇది నాణ్యమైన బౌలింగ్‌కు సంబంధించిన విజ యం. మేం చెత్తగా బ్యాటింగ్ చేశామని చెప్పలేం. ఆ ఓవర్(క్రిస్టియన్ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్‌లతో 22 పరుగులు) మా విజయవకాశాలను దెబ్బతీసింది. చివరి వరకు మేం శక్తిమేర పోరాడాం. ఇదొక అద్భుతమైన మ్యాచ్. అదనంగా మరో 15 పరుగులు చేసినా.. ఆ రెండు ఓవర్లలో (గార్టన్, క్రిస్టియన్) ప్రత్యర్థిని కట్టడి చేసినా ఫలితం మరోలా ఉండేది. ఇక ఆర్సీబీ ఫ్రాంఛైజీ కోసం వందకు 120 శాతం బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేశాను. వచ్చే ఏడాది నుంచి ఆటగాడిగా కూడా అదే స్థాయిలో కష్టపడతాను. కచ్చి తంగా.. ఆర్సీబీలోనే ఉంటాను. వేరే జట్టు తరపున ఆడే ఉద్దేశమే లేదు. నా కెరీర్ చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్‌సీబీలోనే ఉం టాను. వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. మరో రెండు, మూడేళ్లకు కావాల్సిన కోర్ టీమ్‌ను తీసుకోవాలి’అని కోహ్లి చెప్పుకొచ్చాడు.