Friday, December 1, 2023
Friday, December 1, 2023

తేలిపోయిన భారత అథ్లెట్లు

టీటీ మినహా అన్ని అంశాల్లో నిరాశే

టోక్యో : ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు కీలక పోటీల్లో తేలిపోయారు. ఒక్క టేబుల్‌ టెన్నిస్‌లో ఆచంట కమల్‌ తప్పితే మిగిలిన వారందరూ ఓటమి పాలయ్యారు. నాలుగోరోజు సోమవారం జరిగిన పోటీల్లో మొదట ఆర్చరీ జట్టు మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ క్వార్టర్స్‌లో దక్షిణకొరియాపై నెగ్గలేకపోయింది. చరిత్ర సృష్టిస్తుందనుకున్న ఫెన్సర్‌ భవానీ దేవి.. ఓటమితో విశ్వక్రీడల నుంచి వైదొలిగింది. ఒక్క టేబుల్‌ టెన్నిస్‌లోనే భారత్‌కు విజయం దక్కింది.
ఆర్చరీలో.. కజకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు (అతాను దాస్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌) 6-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. కాగా క్వార్టర్స్‌లో దక్షిణ కొరియా ముందు భారత జట్టు నిలువలేకపోయింది. ఏమాత్రం పోటీనివ్వకుండానే 0-6 తేడాతో పరాజయం చవిచూసింది. దీంతో ఒలింపిక్స్‌ నుంచి పురుషుల ఆర్చరీ జట్టు నిష్క్రమించింది.
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న భవానీ..
భారత్‌ నుంచి తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఫెన్సర్‌ భవానీ దేవి తొలి మ్యాచ్‌లో ట్యూనీషియా ఫెన్సర్‌ నదియా బెన్‌ అజీజీపై 15-3తో విజయం సాధించి సత్తా చాటింది. కేవలం 6 నిమిషాల్లోనే ఈ పోటీ పూర్తి కాగా తదుపరి టేబుల్‌ఆఫ్‌-32 మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ అథ్లెట్‌ మనోన్‌ బ్రునెట్‌ ముందు తేలిపోయింది. 7-15తో ఈ మ్యాచ్‌ను చేజార్చుకొంది. దీంతో ఒలింపిక్స్‌లో ఆమె కథ ముగిసింది.
టేబుల్‌ టెన్నిస్‌లో మిశ్రమ ఫలితాలు
టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల రెండో రౌండ్‌లో ఆచంట కమల్‌ పోర్చుగల్‌ ఆటగాడు అపోలోనియా టియాగోపై 4-2తో విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో సుతీర్థ పోర్చుగల్‌కే చెందిన యూ ఫూ చేతిలో 4-0 తేడాతో ఓటమిపాలైంది. కనీస పోరాటం లేకుండానే సుతీర్థ ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది. కాగా మహిళల మూడో రౌండ్‌లో మనికా బాత్రా నిరాశకు గురి చేసింది. ఆస్ట్రియా క్రీడాకారిణి పోల్కనోవా సోఫియాపై 0-4 తేడాతో పరాజయం పొందింది.
టెన్నిస్‌లోనూ అడియాశే..
టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ నిష్క్రమించాడు. ఆర్‌ఓసీ ఆటగాడు మెద్వెదెవ్‌పై 2-6, 1-6 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగాడు.
బ్యాడ్మింటన్‌లోనూ అదే తీరు
బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌ నిలువలేకపోయింది. డబుల్స్‌లో సాత్విక్‌ రాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట.. ఇండోనేసియా ద్వయంపై వరుస సెట్లలో ఓటమిపాలై ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగింది.
స్కీట్‌షూటింగ్‌ లోనూ..
స్కీట్‌ షూటింగ్‌లోనూ భారత షూటర్లు విఫలమయ్యారు. క్వాలిఫయర్‌ రౌండ్‌లో భారత షూటర్‌ అంగద్‌ వీర్‌ సింగ్‌ 18వ స్థానంలో నిలిచాడు. మరో షూటర్‌ మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ 25వ స్థానాన్ని దక్కించుకుని ఇంటి దారి పట్టారు.
బాక్సింగ్‌లో ఆశిష్‌కు నిరాశ
పురుషుల మిడిల్‌వెయిట్‌లో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో భారత బాక్సర్‌ ఆశిశ్‌కుమార్‌ ఓటమి చవి చూశాడు. చైనా బాక్సర్‌ తుయోహెటా ముందు ఘోరంగా విఫలమయ్యాడు.
స్విమ్మింగ్‌లో సాజన్‌ ప్రకాశ్‌ విఫలం
200మీ. పురుషుల బటర్‌ ఫ్లై స్విమ్మింగ్‌లో భారత స్విమ్మర్‌ సాజన్‌ ప్రకాశ్‌ ఆకట్టుకున్నప్పటికీ.. సెమీస్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఒక నిమిషం 57.22 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని మొత్తంగా 24వ స్థానంలో నిలిచాడు.
పతకాల వేటలో చైనా ముందంజ
ఒలింపిక్స్‌`2020 పతకాల వేటలో చైనా ముందంజలో ఉంది. ఇప్పటివరకు ఆరు స్వర్ణ, ఐదు రజతం, ఏడు కాంస్య పతకాలు సహా చైనా క్రీడాకారులు మొత్తం 18 పతకాలు సాధించారు. అమెరికా 7స్వర్ణాలు, మూడు రజతం, నాలుగు కాంస్య పతకాలతో 14 పతకాలు సాధించింది. కాగా అత్యధికంగా ఎనిమిది బంగారు, రెండు రజతం, మూడు కాంస్య పతకాలతో ఆతిథ్య జపాన్‌ 13 పతకాలు సాధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img