బుడాపెస్ట్ : హంగేరీ వేదికగా జరిగిన ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ రెజ్లర్ ప్రియా మాలిక్ అసాధారణ ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించింది. మహిళల 73 కేజీల విభాగంలో ప్రత్యర్థి బెలారస్‌కు చెందిన క్సేనియా పటాపోవిచ్‌తో జరిగిన పోటీలో 5-0 స్కోరుతో విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం ద్వారా మీరాబాయి చాను భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిరచగా.. మరుసటి రోజునే ప్రియా మాలిక్ పసిడి పతకంతో వార్తల్లో నిలిచింది. 2019లో పూణె వేదికగా జరిగిన ఖేలో ఇండియా పోటీల్లోనూ ప్రియా మాలిక్ సర్ణంతో మెరిసింది. దిల్లీలో జరిగిన 17వ స్కూల్ గేమ్స్‌లోనూ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ప్రియ గెలుపుతో సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు హోరెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత చౌతాలా ఆమెను అభినందించారు. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేస్తూ.. ప్రియా మాలిక్ దేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు.