హెచ్.ఎల్.సి. ఆధునీకరణ పనులు చేపట్టాలి…
ఏ పి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ వినతులు
విశాలాంధ్ర- అనంతపురం : తుంగభద్ర డ్యామ్ 33 గేట్లు మార్చడానికి ఐ ఏ బి సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి, హెచ్.ఎల్.సి. ఆధునీకరణ పనులు చేపట్టాలి అని గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ఐ ఏ బి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఏ పి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి సి.జాఫర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సి. జాఫర్ మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ గేట్లన్నీ మార్చాల్సిందేనని సి.డబ్ల్యూ, సీ (కేంద్ర జల సంఘం) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ బోర్డుకు స్పష్టం చేసిందన్నారు . ఏ డ్యాం గేట్ లైనా 45 ఏళ్లు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని అని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు 70 ఏళ్లుగా పనిచేస్తున్నాయని తుప్పు పట్టినప్పుడు దాన్ని తొలగించి రంగులు వేస్తూ ఉండడం వల్ల వాటి మందం తగ్గిందని బలహీనంగా మారాయన్నారు . దీనివల్ల ఆగస్టు 10న డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చి చెప్పింది. డ్యాం భద్రత దృష్ట్యా 33 గేట్లను మార్చి వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని స్పష్టం చేసిందన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను బుధవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ సిడబ్ల్యుసీ కి, ఏకే బజాజ్ అందించారు. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడానికి ఐదు కోట్లకు పైగా బోర్డు వ్యయం చేసిందన్నారు. ఒక్క గేటు ఏర్పాటుకు 8 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. 33 గేట్లు ఏర్పాటు చేయాలంటే 264 కోట్లకు పైగా వ్యయం అవుతుందని చెబుతున్నారు. గేటు ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ వంటి అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే అదనంగా మరో వంద కోట్ల వరకు వ్యయం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నీటి కేటాయింపులు, ఆయుకట్టు ఆధారంగా దామాషా పద్ధతులలో భరించాల్సి ఉందన్నారు. . తుంగభద్ర బోర్డు కు స్పష్టం చేసిన ఏకే బజాజ్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఓత్తిడి తీసుకొని వచ్చి తుంగభద్ర డ్యాం 33 గేట్లను మార్చి వాటి స్థానములో కొత్త గేట్లు అమర్చాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు.
వర్షాలు వరదల కారణంగా తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడానికి చైన్ లింకు ప్రధాన కారణం ఈ తరుణంలో కన్నయ్య నాయుడు, నేతృత్వంలో ఇంజనీర్లు, సిబ్బంది ప్రాణాలు తెగించి చేసిన కృషి వల్ల స్టాప్ లాగా ఏర్పాటు చేయడం ద్వారా 70 టీఎంసీల నీరు నిల్వ ఉంచడం జరిగిందన్నారు. తుంగభద్ర డ్యామ్ లో పుష్కలంగా నీరు ఉండడం వల్ల రైతులలో ఆశలు చిగురించాయి అని పేర్కొన్నారు. హెచ్. ఎల్. సి ఆధునీకరణ పనులు పూర్తి చేస్తే 2600 క్యూసెక్కులు ఉన్న కాలువ సామర్థ్యాన్ని 4200 క్యూసెక్కులకు పెంచుకోవచ్చు. కింద ఉన్న రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయడానికి సిద్ధమయ్యారన్నారు. జిల్లాలోని అన్ని చెరువులను నింపడానికి చర్యలు చేపట్టడం ద్వారా హెచ్.ఎల్.సి ఆయకట్టుతోపాటు అన్ని చెరువుల కింద రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరడం జరిగిందన్నారు. హంద్రీ నీవా సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.. హంద్రీ నీవా నీరు పొలాలకు చేరాలంటే పిల్ల కాలువలు తోవాలన్నారు. (డిస్ట్రిబ్యూటరీలు) గత వైసిపి ప్రభుత్వం 5,000 క్యూసెక్కుల నుండి 10,000 క్యూసెక్కులకు పెంచుతామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. కాలువ వెడల్పు పెంచాలి. లైనింగ్ వేయాలి. కాలువ సామర్ధ్యాన్ని 6300 క్యూసెక్కులకు పెంచాలని టిడిపి హయాంలో ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 3.45 లక్షల ఎకరాలకు తాగునీరు, సాగునీరు ఇచ్చే హంద్రీనీవా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుపరచాలి అని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఆయుకట్టుకు నీరు ఇవ్వాలన్నారు . సాగునీరు త్రాగునీరు అవసరాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు చేయాలని సిపిఐ జిల్లా సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు.