: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : జిల్లాలో అమృత్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పబ్లిక్ హెల్త్ శాఖ పరిధిలో చేపట్టిన అమృత్ పనులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమృత్ కింద పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన పనులను త్వరితగతిన చేపట్టేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అమృత్ 1.0 కింద చేపట్టిన పనులను వేగంగా చేయాలని, అమృత్ 2.0 కింద చేపట్టిన పనులను వెంటనే గ్రౌండ్ చేయాలని ఆదేశించారు. భారత ప్రభుత్వం అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్)ను ప్రారంభించిందని, ముఖ్యంగా పట్టణ పేదలు మరియు ప్రజలందరికీ జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ రవాణా, పార్కులు వంటి ప్రాథమిక పౌర సౌకర్యాలను అందించే లక్ష్యంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలన్నారు. అమృత్ 2016-20 కింద అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి మున్సిపాలిటీలలో 265 కోట్ల రూపాయల పనులు చేపట్టగా, వాటిని వేగంగా చేపట్టాలన్నారు. అమృత్ 2.0 కింద అనంతపురం నగరపాలక సంస్థ, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి మున్సిపాలిటీలలో వివిధ రకాల అభివృద్ధి పనులకు 283.89 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా, ఆయా పనులను ప్రాధాన్యత క్రమంగా గ్రౌండ్ చేసి త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి పనులకు ప్రాధాన్యత ఇచ్చి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, నగర పాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, పబ్లిక్ హెల్త్ ఈఈ సతీష్ చంద్ర, ఏపీఎస్పీడిసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, హార్టికల్చర్ డిడి నరసింహరావు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.