ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
అమెరికా నుండి మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రజలకు సందేశం
విశాలాంధ్ర ధర్మవరం; ప్రజలందరూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన సమావేశం నిమిత్తం అమెరికాకు వెళ్లిన మంత్రి అక్కడినుండి తన కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసి ధర్మవరంలో పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తాను ఉన్నతాధికారులతో ప్రతిక్షణం పరిస్థితుల గురించి అప్రమత్తం చేస్తున్నానని, సిబ్బంది కూడా వ్యాధులు ప్రబలకుండా సంబంధిత శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న సమస్యలు తలెత్తినా అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు పరిష్కరిస్తారు అన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు గురించి జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.