దాదాపు రెండు కోట్ల 25 లక్షలు మోసపోయిన బాధితులు
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న బాధితులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శివానగర్లో సైదం ఆంజనేయులు అనే ఫైనాన్స్, చీటీల నిర్వాహకుడు అకస్మాత్తుగా రెండు కోట్ల 25 లక్షలతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టి రాత్రికి రాత్రే ఉడాయించాడు. వివరాలకు వెళితే శివానగర్లో గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ వ్యాపారంతో పాటు చిట్టీలు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. శివానగర్ ప్రజల్ని ఆకర్షితులుగా చేసే విధంగా అందర్నీ పూర్తిగా నమ్మించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇతను ఫైనాన్సు పైన గాని చిట్టి లపైన గాని ప్రజలకు ఎవరికీ అనుమానం రాలేదు. ఏం జరిగిందో ఏమో గత రెండు రోజుల కిందట ధర్మారం నుంచి ఉదాయించడం జరిగింది. రమారమి 82 మంది నుంచి రెండు కోట్ల 25 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొన్ని రోజులుగా అతని తీరుపై శివానగర్ ప్రజలకు అనుమానం వచ్చి అప్పులు ఇచ్చినవారు డబ్బును డిమాండ్ చేశారు. దీంతో అనుకోకుండా అతని కుటుంబంతో గుర్తుచప్పుడు కాకుండా ధర్మవరం వదిలి వెళ్ళిపోయాడు. దీంతో బాధితులు గగ్గోలు పెడుతూ పోలీస్ స్టేషను ఆశ్రయించారు. పట్టణంలో ఘరానా మోసం పలు దశలుగా వెలుగు చూస్తోంది. అంతేకాకుండా రుణదాతలకు ఐపీ నోటీసులు పంపించడం కూడా జరిగింది. రుణ దాతలు ఒత్తిడి కావడంతో కొంతకాలంగా కనపడకుండా పోయాడని స్థానికులు తెలుపుతున్నారు. తదుపరి అనుకోకుండా కుటుంబం అంతా వెళ్లిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని మాకు పోలీసులు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా తమ వద్ద డబ్బు తీసుకొని బినామీ పేర్లతో ఆస్తులు కూడా కొన్నాడని ఇప్పుడు ఐపీ డ్రామా ఆడటం ఎంతవరకు సమంజసమని బాధితులు ఆరోపిస్తున్నారు. సైదం ఆంజనేయులు యొక్క మోసం సోషల్ మీడియాలో రావడంతో ఈ అంశం వైరల్ గా మారింది. రుణ దాతలు యొక్క ఒత్తిడి రోజురోజుకు అధికం కావడంతో సొంత ఇల్లు వదిలేసి పరారైనట్లు బాధితులు తెలుపుతున్నారు. బాధితులు కూడా మాకు లాయర్ ద్వారా ఐపీ నోటీసులు వచ్చినట్లు తెలుపుతున్నారు. నోటీసులు అందుకున్న బాధితులు మా డబ్బు అప్పుగా తీసుకొని, మాకే ఐపి పెట్టడం ఎంతవరకు న్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైదం ఆంజనేయులు పేరుతో ఉన్న రెండు ఇళ్లను అమ్మి బ్యాంకు రుణాలు పోను మిగిలిన సొమ్మును పంచుకునేలా మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కనీసం మేము పోలీస్ స్టేషన్కు కోర్టుకు వెళితే న్యాయం జరుగుతున్న ఆశతో ఉంటున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ధర్మవరంలో ఇదివరకే గత సంవత్సరం ముగ్గురు, ఈ సంవత్సరం ఇద్దరూ అప్పులు చేయడం ఐపీ నోటీసు ఇచ్చి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం ఒక ఫ్యాషన్ గా మారిందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఐపీ పెట్టిన వారిపై చర్చ ప్రకారం న్యాయం తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.