అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న
విశాలాంధ్ర -అనంతపురం : రాయలసీమ జిల్లాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఎదిగే సమాజానికి మంచిది కాదు. అభివృద్ధికి ప్రతిబంధకం అవుతుంది. ఇక నుంచి ఒక్క బాల్య వివాహం జరగడానికి వీల్లేదు. ఈ రోజుతో వాటికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడాలి. అందుకు ఐసీడీఎస్ సహా లైన్ డిపార్టుమెంట్ల అధికారులందరూ కలసి కట్టుగా కృషి చేయాల్సిందేనని అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న స్పష్టమైన ఆదేశాలిచ్చారు.అనంతపురం ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని శిక్షణలో భాగంగా శుక్రవారం ఆమె సందర్శించారు. ఐసీడీఎస్, అనుబంధ విభాగాలు చేసే పనులు, పథకాల అమలు గురించి అధ్యయనం చేశారు. తనకొచ్చిన అనుమానాలను పీడీ డాక్టర్ బీఎన్ శ్రీదేవితో చర్చించి నివృత్తి చేసుకున్నారు. పామిడిలో బాల్య వివాహం జరుగుతోందని వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆరా తీశారు. ఎలా ఫాలో చేస్తున్నారని పీడిని అడిగారు. అందుకు సంబంధించిన రిపోర్ట్ తనకు సాయంత్రంలోగా ఇవ్వాలని ఆదేశించారు.
రికార్డులు పరిశీలించారు. జిల్లాలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకోగా, అనాథలైన వారి పిల్లల గురించి ఆరా తీశారు. సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని పీడీ శ్రీదేవిని ఆదేశించారు.
ఆ తరువాత అన్ని విభాగాల ఉద్యోగులతో సమావేశమయ్యారు. పరిచయం చేసుకున్నారు.
ఎవరెవరు ఏమేం పనులు చేస్తారని అడిగి తెలుసుకున్నారు.
ఐసీడీఎస్ సహా అనుబంధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు తమకు కేటాయించిన పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు.
ఐసీడీఎస్ ఉద్యోగులతో పాటు ఐసీపీఎస్(మిషన్ వాత్సల్య), డీవీసీ, చైల్డ్ లైన్, శిశుగృహ, బాలసదనం పని తీరుపైనా ఆరా తీశారు.
ఐసీడీఎస్, అనుబంధ విభాగాల ఉద్యోగులు మరింత ఎఫర్ట్ పెట్టి, లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ వనజాక్షి, సీనియర్ అసిస్టెంట్లు ధనలక్ష్మి, బాబా నూరుద్దీన్, డీసీపీఓ మంజునాథ, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ కృష్ణమాచారి పాల్గొన్నారు.