విశాలాంధ్ర- ధర్మవరం:: జాతీయస్థాయిలో సబ్ జూనియర్ జూడో లీగ్ పోటీలలో మండల పరిధిలోని చిగిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బంగారు, కాంస్య పతకాలను సాధించడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నైలో పదవ తేదీ నుంచి జరుగుతున్న ఖేలో ఇండియా సౌత్ జోన్ నేషనల్ సబ్ జూనియర్ జూడో లీగ్ పోటీలలో మా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నందిని మైనస్ 32 కేజీల విభాగంలో బంగారు పతకము, అదేవిధంగా 9వ తరగతి చదువుతున్న లాస్య రెడ్డి మైనస్ 44 కేజీల విభాగంలో కాంస్య పతకమును సాధించడం జరిగిందని తెలిపారు. గత ఏడాది జమ్ములో జరిగిన జాతీయ సాయి అండర్ 14 స్కూల్ గేమ్స్ పోటీల్లో కూడా నందిని వెండి పతకం సాధించిందని తెలిపారు. ఈ ఇద్దరు విద్యార్థులను హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, పాఠశాల కమిటీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.