హెచ్ ఎల్ సి వాటాను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి….
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు సిపిఐ నాయకులు వినతులు విశాలాంధ్ర అనంతపురం తుంగభద్ర జలాశయం నుంచి అనంత కరువు జిల్లాను ఆదుకోవడానికి హెచ్ ఎల్ సి నీటి వాటాను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తుంగభద్ర జలాశయంలో క్రష్ గేట్లు 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో 33 గేట్లు వున్న విషయం తమరికి తెలియనది కాదని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బెడ్ లెవల్ 1613 నుండి ఎత్తు 1633 అడుగులు వున్నది. ఇందులో నీటి నిల్వ సామర్థ్యం 105 టి.యం.సిలు. ఈ పరిస్థితులలో జలాశయం పూర్తిగా నిండిన సందర్భంలో అలల తాకిడికి నీరు కట్టపైకి వస్తున్నదని అందువల్ల 20 అడుగులు ఎత్తుగా వున్న క్రష్ గేట్లును ఒక అడుగు పెంచేందుకు తుంగభద్ర బోర్డు అధికారులను, సి.డబ్ల్యు.సి ని అనుమతి కోరడం జరిగిందన్నారు. దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి నివ్వగా 2023లో గేట్ల ఎత్తు ఒక అడుగు పెంచినట్లు తెలిసిందన్నారు.
ఈ విధంగా 20 అడుగుల ఎత్తు వున్న గేట్ల ఒక అడిగు పెంచివుంటే 20 అడుగులు వున్న గేట్లు 21 అడుగులకు గాను డ్యామ్ ఎఫ్ ఆర్ ఎల్ 1633 నుండి 1634 అడుగుల ఎత్తు పెరిగి, నీటి నిల్వ సామర్థ్యం కూడా 105 టి.యం.సి ల నుండి ఒక అడుగు ఎత్తు పెంచినందువల్ల సుమారు 20 టి.యం.సిలు పెరిగి వుంటాయమని అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ ఎత్తు పెరిగిన విషయం తుంగభద్ర బోర్డు అధికారులు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారో అర్థం కావడం లేదన్నారు. . నీటి విలువ సామర్థ్యం పెరిగివుంటే దానిని మూడు రాష్ట్రాలకు దామాషా ప్రకారం పంపకాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తుంగభద్ర జలాశయం ఎత్తు పెరిగిన సమస్యలపైన తమరు బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించి హెచ్.ఎల్.సి కి వచ్చే ఈ నీటి వాటాను కూడా పెంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ స్పందిస్తూ ఈ విషయంపై హెచ్ ఎల్ సి,ఎస్ సి తో మాట్లాడటం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, మల్లికార్జున కార్యదర్శివర్గ సభ్యులు రాజారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యుడు లింగమయ్య, సంతోష్ కుమార్, జిల్లా నాయకులు ఆనంద్ నాయకులు దేవ తదితరులు పాల్గొన్నారు