సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని వేల్పుమడుగు క్రాస్ వద్ద గల జెఆర్ సిల్క్స్ అక్రమాలపై తగు చర్యలు చేపడుతూ చేనేతల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను ముఖ్యమంత్రికి వివరిస్తూ… రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు ధర్మవరం పుట్టినిల్లు లాంటిదని జేఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం జెట్లూమ్స్ (రాపిడ్స్) ఏర్పాటుచేసి, చేనేత రిజర్వేషన్లకు విరుద్ధంగా ప్యూర్ టు ప్యూర్ చీరలు నేస్తూ, చేనేత పరిశ్రమనే చిన్నాభిన్నం చేస్తున్నారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ భారీ ఎత్తున సబ్సిడీపై ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, దాదాపు 200 కు పైగా జట్లుమ్స్ తో రోజుకు 600 నుంచి 800 వరకు ప్యూర్ టూ ప్యూర్ చీరలు తయారు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలిపారు. నెలకు కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్థిస్తూ ధర్మవరంలో చేనేత పరిశ్రమ మనుగడకు పెను ప్రమాదంగా తయారయిందని తెలిపారు. హ్యాండ్లూమ్స్ అధికారులు సైతం ముడుపులకు సై అంటూ అవినీతికి పాల్పడి జేఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ కి క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయని వారు గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీకు స్థానిక చేనేతలను విస్మరించి బీహార్ గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలను పిలిపించుకొని పని చేయించుకుంటున్నారని తెలిపారు. అందువల్ల స్థానిక నేతలకు తీరని అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో 11 రకాల చేనేత వస్త్ర ఉత్పత్తుల రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయమును ధర్మారంలోనే ఏర్పాటు చేయాలని తెలిపారు. నేతన్న నేస్తం పథకాన్ని 24 వేల రూపాయల నుండి 36వేల రూపాయలకు పెంచి సొంత మగ్గం ఉన్నవారితో పాటు, అద్దె మగ్గములో నేసే వారికి ఉపవృత్తుల వారికి కూడా వర్తింపజేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ ని పూర్తిగా రద్దు చేయాలని, ఆదరణ పథకాన్ని పునరుద్దించి వృత్తి పరికరాలను సబ్సిడీతో పంపిణీ చేయాలని, చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. అంతేకాకుండా చేనేతలకు ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలను కూడా మంజూరు చేయాలని తెలిపారు. చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, చేనేత కార్మికులకు మూడు సెంట్లు స్థలము ఇచ్చి పక్కా ఇల్లు వర్క్ షెట్లను ప్రభుత్వమే ఉచితంగా నిర్మించి ఇవ్వాలని వారు తెలిపారు. అంతేకాకుండా పలు డిమాండ్తో చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేతన్నలు ఈనెల 26న జేఆర్ సిల్క్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా కూడా నిర్వహించడం జరిగిందని వారు గుర్తు చేశారు. కావున చేనేత రంగ పరిరక్షణకు, నేతన్నల ఆత్మహత్యల నివారణకు, జేఆర్ సిల్క్స్ అక్రమాలపై తగు విచారణ జరపాలని, చేనేతల న్యాయమైన కోర్కెలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలను వెంటనే చేపట్టవలసినదిగా వారు తెలిపారు.