హంద్రీ నీవాకు సాగునీరు అందించాలి…
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున
విశాలాంధ్ర – అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గురువారం కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి సమావేశంలో ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుస కరువులతో ప్రతి సంవత్సరం పంటలు నష్టపోతున్నాయి అన్నారు. రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పులు ఊబిలో కూరుకుపోతూ అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకపక్క వరదలు వచ్చి పంటలన్నీ నేలమట్టమవుతుంటే ఇక్కడ మాత్రం వర్షాలు లేక సాగునీరు, త్రాగునీరుకి ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల త్రాగునీరుకు సైతం ఇబ్బందులు పడుతూ ట్రాక్టర్ల ద్వారా నీరు అందిస్తున్న పరిస్థితి ఏర్పడింది అన్నారు. ప్రస్తుత ఎగువ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల తుంగభద్ర డ్యామ్ లోను శ్రీశైలం డ్యామ్ లోను పూర్తిస్థాయిలో నీరు ఉందన్నారు. తుంగభద్ర, శ్రీశైలం నుండి అత్యధికంగా ఈ సంవత్సరం వందలాది టిఎంసిల నీరు సముద్రం లోకి పోవడం జరిగేదన్నారు . హెచ్.ఎల్.సి కెనాల్ ఆధునికరించి ఉంటే లేదా వరుస సమాంతర కాలువ ఉంటే మన జిల్లాకు ఎక్కువ నీరు తీసుకురావడానికి అవకాశం ఉండేది అన్నారు . ఇప్పటివరకు ప్రకటనలకే పరిమితమైంది కానీ ఆచరణలో జరగపోవడం వల్ల మనం ఎక్కువ నీటిని కోల్పోవాల్సివచ్చిందన్నారు. హంద్రీనీవా కాలవ నుండి 10,000 క్యూసెక్కులకు పెంచడం వల్ల శ్రీశైలం నుండి అధిక నీరు తీసుకోవడానికి అవకాశం ఉన్నా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి హెచ్.ఎల్.సి ని ఆధునికరణ చేసి హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి జిల్లాలో హెచ్.ఎల్.సి చివరి ఆయకట్టుకు హంద్రీనీవా కింద నిర్దేశించిన 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించి క్రింద ఉన్న చెరువులతోపాటు జిల్లాలో ఉన్న అన్ని చెరువులు నీరు అందించి సాగునీరు త్రాగునీరు సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘము జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు టి. నారాయణస్వామి, బండి రామకృష్ణ,జిల్లా సహాయ కార్యదర్శిలు లలితమ్మ, ఎం .రమేష్ కౌలు రైతు సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, రాప్తాడు నియోజకవర్గం నాయకులు రాకెట్ల రాము,రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.