ఆలయానికి నిత్యం ఆధ్యాత్మిక శోభ
శతాబ్దాల చరిత్ర ఆలయ సొంతం.
నేటి నుండి వైభవపేతంగా స్వామి వారి డోలోత్సవాలు ప్రారంభం
విశాలాంధ్ర-కవిటి:ఉద్దానప్రాంత భక్తులు ఆరాధ్యదైవంగా కొలుస్తున్న బెజ్జిపుట్టుగ గ్రామం లో వెలసివున్న శ్రీదేవి భూదేవి సమేత చక్ర పెరుమాళ్ళ స్వామి వారి డోలోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.ఫాల్గుణ శుద్ధ విదియ 12 వ తేదీ (మంగళ వారం) మొదలుకొని ఫాల్గుణ పౌర్ణమి మార్చి 25 వ తేదీ( సోమ వారం) వరకు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు.మార్చి 26 వ తేదీ (మంగళ వారం)స్వామివారి డోలోత్సవo నిర్వహించి పదిహేను రోజులపాటు డోలోత్సవాలు నిర్వహిస్తుంటారు.ఈ ఉత్సవాలు గ్రామం ఇతర గ్రామాల వారి సహకారంతో హరికథలు,గరుడ సేవలు,స్వామివారి పల్లకి ఉత్సవం, ప్రత్యేక పూజలు,బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు.ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల తో పాటు, ఒరిస్సా,జిల్లా స్థాయిలో పర్యాటకులు సందర్శిస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంగీత, కళలు చేపట్టి భక్తులు శ్రీవారి సేవలో తరిస్తారు.
” కామ దహనం, డోలారోహణం.”
పౌర్ణమి నాటికి స్వామి వారి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా వెల్లివిరుస్తాయి. ఆ మరునాడు వేకువజామున దేవుడు మాన్యం సమీపంలో కామ దహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు.శ్రీవారి,కథాగానం,కీర్తి ప్రతిష్టలను పటించి ఉత్సవాలు ముగిస్తామని ఆలయ ధర్మకర్తలు పొందల కృష్ణారావు పీ. వీ.ఎస్ రాంబాబు,పొందల విజయకృష్ణ తెలిపారు.
" స్వామివారి చరిత్ర"
సుమారు మూడు శతాబ్దాల క్రితం బ్రిటిష్ వారి పాలనా కాలంలో తూర్పు తీరమమైన బంగాళాఖాతంలో డచ్ వారి నౌకా ప్రయాణం బెజ్జి పుట్టుగ గ్రామ సమీపంలో హఠాత్తుగా నౌక నిలిచిపోయింది. నౌక నిర్మాణం అంతా సవ్యంగా ఉన్నప్పటికీ ముందుకు కదలలేదు అందులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చక్ర ధర స్వామివారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న బెజ్జి పుట్టుగ కలింగ వైష్ణవులు నౌక లోంచి శ్రీదేవి , భూదేవి , సమేత శ్రీ చక్ర పెరుమాళ్ళ స్వామివారి విగ్రహాలను బయటకు తీసి బెజ్జి పుట్టుగ గ్రామంలో పూరిపాకలో ప్రతిష్ట చేశారు. వెంటనే నౌక ముందుకు కదిలిందని స్థానికులు చెబుతుంటారు.
"స్వామివారి లీల"
అలా బెజ్జి పుట్టుగ లో పూరిపాకలో ప్రతిష్టించిన స్వామివారిని బెజ్జి పుట్టుగ కు చెందిన ఈనామీ దారులైన ఇచ్చాపురం వాసి గాదె పంతులు స్వామివారిని తన స్వగృహానికి తీసుకువెళ్లి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భోగ రాగాలు నిర్వహిస్తుండగా ఇల్లంతా రక్త వర్ణం, వారు తిన్న తిండి కూడా రక్త వర్ణం గా మారిపోయింది . దాంతో భయభ్రాంతులైన పంతులుగారు మేము స్వామివారిని భోగ రాగాలు నిర్వహించలేమని మరల బెజ్జి పుట్టుగ లో స్వామివారిని విడిచి వెళ్లారు.
" రాతి కట్టడాలతో ఆలయ నిర్మాణం"
అలా విడిచి వెళ్ళిన స్వామివారిని పొందల వంశీయులు ఈ విగ్రహాలను పునః విగ్రహ ప్రతిష్ట గావించారు. అనంతరం పొందల వంశీయులు చే ఆలయ నిర్మాణం గావించి అందులో విగ్రహ ప్రతిష్ట జరిపించారు. పురాతన కాలంలో సిమెంటును ఉపయోగించకుండా రాతి కట్టడాలతో శిల్పులతో చెక్కించబడిన రాతి తో ఆలయ నిర్మాణం చేపట్టి చక్ర పెరుమాళ్ళ స్వామి ఆలయం ఓ అద్భుత పుణ్యక్షేత్రంగా వెలసింది.
“ద్వితీయ బ్రహ్మోత్సవo లు”
మార్చి 19 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు శ్రీమన్నారాయణ సుదర్శన పెరుమాళ్ స్వామివారి ద్వితీయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు ఆధ్వర్యంలో ఆలయ విగ్రహ ప్రతిష్టాపకులు శ్రీమాన్ ముప్పిరాల నారాయణమూర్తి స్వామి వారిచే ఐదు రోజులపాటు వైదిక కార్యక్రమాలు నిర్వహించబడునని ఆలయ ధర్మకర్తలు పొందల కృష్ణారావు, పి వి ఎస్ రాంబాబు,పొందల విజయకృష్ణ తెలిపారు.