రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 405 జూనియర్ కాలేజీలుండగా.. ప్రతి కాలేజీలో 4 సీసీ కెమెరాలు, 2 బయోమెట్రిక్ హాజరు పరికరాలు బిగించి గతంలో బయోమెట్రిక్ హాజరును అమలుపరిచారు. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి దీనిని ఉపసంహరించారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి మళ్లీ బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో గతంలో బిగించిన బయోమెట్రిక్ పరికరాలను అధికారులు పరీక్షించనున్నారు. వివరాలు అందిన తర్వాత పనిచేయని వాటికి రిపేర్లు చేయించి వినియోగంలోకి తీసుకురానున్నారు.