అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్‌రావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీవోలు, ఆశా కార్యకర్తలతో మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొవిడ్ టీకాల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రెండో డోసు లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేయడంతోపాటు, 15`18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. జనవరి 10 నుంచి 60 ఏండ్లకు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు.