ఏపీకి రూ. 1000 కోట్లు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం సాయమందించింది. తెలంగాణకు రూ.416.80 కోట్లు విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాలకు వరద సాయం కింద రూ.5,858 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్లను ఎన్డీఆర్‌ఎఫ్ కింద సాయం అందించనుంది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు, అతి తక్కువుగా నాగాలాండ్‌కు రూ.19.20 కోట్ల సాయం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదలతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా విజయవాడ నగరంలోని బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు 12 రోజులపాటు ముంపు బారిన పడ్డారు. ఇల్లు, ఇంటిలోని సామాగ్రి, వాహనాలు, ఆటోలు దెబ్బతిని పూర్తిగా నిరాశ్రయిలయ్యారు. వాటితోపాటు ఏడు జిల్లాల్లోనూ భారీ వర్షాలు, వరదల ప్రభావం చూపింది. పంట పొలాలు, చేపల చెరువులు దెబ్బతిన్నాయి. దీంతో రాష్ట్రానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర అధికారుల బృందం విచ్చేసి విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. సీఎం చంద్రబాబుతో కలిసి వరద నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ప్రాథమికంగా నష్టం అంచనాలు దాదాపు రూ.7,600 కోట్లు జరిగినట్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. దానిపై కేంద్రం నుంచి కేవలం రూ.1,036 కోట్లనే విడుదల చేసింది. తక్షణమే రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అంచనాలకు భిన్నంగా, అరకొరగా కేంద్రం సాయం ప్రకటించింది. ఈ సాయంతో వరద బాధితులను, పంట నష్టాలకు గురైన రైతులను పూర్తిగా ఆదుకోవడం కష్టతరంగా మారుతుంది. ఇప్పటికే బాధితులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఆటో డ్రైవర్లకు రూ.50వేల పరిహారం ఇవ్వాలని ఆందోళనబాట పడుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పంపిన అంచనాలకు అనుగుణంగా కేంద్రం నిధులను విడుదల చేయాల్సిన అవసరముంది.