. పరస్పర అభివృద్ధికి సహకారం
. వినూత్న ఆవిష్కరణలకు బాటలు
. అమెరికన్ కంపెనీలకు భట్టి ఆహ్వానం
విశాలాంధ్ర-హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో ముందుచూపుతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం… అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని , సహకారాన్ని కోరుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న మైన్ ఎక్స్ పో -2024 అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రపంచ వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిధుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. భారతదేశ ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని, తెలంగాణలో దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్ ను తమ స్వస్థలంగా భావిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. తద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్‌గా రూపుదిద్దుకున్నదని పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు. వ్యాపార అనుకూల విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు గల హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామం కానున్నదని… ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మహానగరం టెక్నాలజీ హబ్ గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉంటుందన్నారు. ఐటీ అభివృద్ధిలోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఆవిష్కరణ జరుగుతోందని, ఇక్కడ ఏఐతో నిర్వహించే పరిశ్రమలు, ఏఐ అభివృద్ధి, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో నెక్స్‌ట్ జనరేషన్ టెక్నాలజీని వృద్ధి చేయడానికి, నిలకడగల అభివృద్ధికి దోహదం చేసే సొల్యూషన్స్ కు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీిఎండీ ఎన్.బలరామ్, స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ ఆయన వెంట ఉన్నారు. అనంతరం ఆస్ట్రేలియాకు చెందిన డోపల్ మేర్ కంపెనీ స్టాల్ ను సందర్శించారు. అత్యాధునిక బొగ్గు , ఓవర్ బర్డెన్ రవాణా బెల్టులు వాటి పనితీరును పరిశీలించారు. సౌత్ ఆఫ్రికా, స్విడ్జర్లాండ్, గ్యాటిమ దేశాలలో తమ కంపెనీ బెల్టులతో జరుగుతున్న రవాణా ప్రక్రియను స్టాల్ నిర్వాహకులు వివరించారు.