సెలవురోజుల్లో ఈ పని ఎందుకు చేస్తున్నారో చెప్పండి
. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు
. అక్రమ కట్టడాలపై తొలుత పంచాయతీలు స్పందించాలి
. హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. హైడ్రా కూల్చివేతలపై గృహ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా సోమవారం బాధితుల పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా వివరణ ఇచ్చారు. ‘ఆదివారం ఎందుకు కూల్చివేశారో చెప్పండి’ అని కోర్టు సూటిగా ప్రశ్నించింది. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేపడుతున్నారో చెప్పాలని అడిగింది. ముందు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్‌ను గట్టిగా నిలదీసింది. మీరు చట్టాన్ని ఉల్లఘించి కూల్చివేతలు చేస్తున్నారు అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కూల్చేస్తారా అని మండిపడిరది. మధ్యలో కమిషనర్ రంగనాథ్ ఏదో చెప్పే ప్రయత్నం చేయగా… నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి, జంప్ చేయకండి అంటూ వ్యాఖ్యానించింది. అమీన్ పూర్‌పై మాత్రమే మాట్లాడండి కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు అంటూ కమిషనర్‌కు హైకోర్టు చురకంటించింది. అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలి లేదా సీజ్ చేయాలి… కానీ నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం కూల్చడం ఏంటి అని ప్రశ్నించింది. కుటుంబంతో గడపకుండా అధికారులు కక్షగట్టి కూల్చివేస్తున్నారని మండిపడిరది. హైడ్రాను అభినందిస్తున్నాం… కానీ వ్యవహరిస్తున్న తీరు బాగులేదు అని హైకోర్టు పేర్కొంది. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే ముందు సంబంధిత పంచాయతీ స్పందించాలి… వారే చర్యలు తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడిరది. అక్రమ కట్టడాలు సీజ్ చేయాలి… నిబంధనలు అనుసరించాలని సూచించింది. కమిషనర్ వాదనలకు న్యాయస్థానం ఏకభవించలేదని, కూల్చివేతలకు సంబంధించి వీడియోలు ఫైల్ చేయాలని, నిబంధనలు అనుసరిస్తూ కూల్చాలని సూచించింది. రాత్రికి రాత్రే కూల్చివేతలు సరికావని పేర్కొంది. ఉన్నదాన్ని కాపాడుకోవడానికే హైడ్రా దృష్టి పెట్టాలని హితవుపలికింది. చెరువులపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపింది. అందరినీ చంచల్ గూడ చర్లపల్లి పంపిస్తే అప్పుడు అర్ధం అవుతుందంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. హైడ్రా విషయంలో తాము సంతోషంగా లేమని, హైడ్రా ఏర్పాటుపై రెండు పిటిషన్‌లు ఉన్నాయని, ఇలా ఇష్టానుసారంగా చేస్తే జీవో 99 పై స్టే విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. హైడ్రా అంటే కేవలం కూల్చివేత చేయడమేనా… ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దని, బడా-పేద ప్రజల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా లేదా నిజయతీగా చెప్పాలని నిలదీసింది. మూసి విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటి… మూసిపై 20 పిటిషన్‌లు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది.