. గంజాయి, డ్రగ్స్ నియంత్రిద్దాం
. ప్రపంచ వేదికపై విశ్వనగరంగా హైదరాబాద్
. బీఎఫ్‌ఎస్‌ఐ ప్రారంభోత్సవంలో రేవంత్
విశాలాంధ్ర-హైదరాబాద్ : తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదని చెప్పారు. బీఎఫ్‌ఎస్‌ఐ నైపుణ్య శిక్షణను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని గుర్తించి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో 35 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టినా నిరుద్యోగ సమస్య తీరదన్నారు. ప్రతిభ ఉన్నా, నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావని, అందుకే నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టామని చెప్పారు. తెలంగాణలో ప్రతీ ఏటా మూడు లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారని, వారికి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని, అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్‌ఎస్‌ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. నైపుణ్య శిక్షణకు నిధులను కూడా వాళ్లే సమకూర్చారని వివరించారు. గత పదేళ్లలో తెలంగాణ యువత గంజాయ, డ్రగ్స్ కు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 65 ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్లు వెల్లడిరచారు. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని, అలాగే ఇంజినీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నామని, హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడమే కాదు, నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నామన్నారు. ప్రపంచ వేదికపై హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలబెడతామన్నారు. అందుకు మీ సహకారం అవసరమన్నారు. రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ వర్సిటీ , స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.