అమెరికా కంపెనీలకు భట్టి వినతి
విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి, ఫోర్త్ సిటీ నిర్మాణం ఎదుగుదలలో పాలుపంచుకోవాలని పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో పాల్గొన్న భట్టి… బుధవారం వివిధ అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు, వ్యాపారాలకు భారతదేశంలోనే హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తుందని, ఖనిజ పరిశ్రమాభివృద్ధికి దోహదపడాలని, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూగర్భంలో దాగిన విలువైన ఖనిజాలను వెలికితీయడంలో, నిలకడ అభివృద్ధిని సాధించడంలో అమెరికన్ కంపెనీలు భాగస్వాములు కావాలన్నారు. హైదరాబాద్ కు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న ఫోర్త్ సిటీలో భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటికే ఇక్కడ స్థాపించిన అమెరికన్ కంపెనీలు ఎంతో సౌకర్యవంతంగా తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నాయని వివరించారు. సింగరేణికి క్రిటికల్ మినరల్స్ అన్వేషణలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో మరిన్ని సంస్థలు: అరుణ్ వెంకటరామన్
అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్లోబల్ మార్కెట్స్ సహాయ కార్యదర్శి అరుణ్ వెంకటరామన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇప్పటికే అమెరికా సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయని, ఈ ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని సంస్థలు తెలంగాణలో తమ వ్యాపారాలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భట్టి సారథ్యంలోని రాష్ట్ర అధికారుల బృందం… ప్రముఖ ఖనిజ పరిశ్రమల యంత్ర తయారీ సంస్థలైన కొమాట్సు, క్యాటర్ పిల్లర్, బి.కే.టి టైర్స్ తదితర స్టాల్స్ ను సందర్శించింది. అధికోత్పత్తి సాధించే రక్షణ సహిత భారీ యంత్రాల గురించి ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ప్రత్యేకతలను వివరించారు. ప్రదర్శనలో అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రాలు, లోడ్ హాల్ డంపర్లు, మైనింగ్ డోజర్లు, బ్లాస్ట్ హోల్ డ్రిల్స్, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ … అత్యాధునిక టైర్లు, స్పేర్లు, వివిధ సేవలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఉత్పత్తిదారులతో సమావేశాలు నిర్వహించారు. అమెరికన్ ప్రతినిధి బృందంలో ఇంకా గ్లోబల్ మార్కెట్స్ సీనియర్ పాలసీ అడ్వైజర్ ఒలిమర్ రివేరానోవా, కమర్షియల్ స్పెషలిస్ట్ శాంతను సర్కార్, ఇంటర్నేషనల్ ట్రేడ్ స్పెషలిస్ట్ కార్నిలియస్ గ్యాంఫి, గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ లీడర్ డేరెక్ట్ శ్లికెషన్, గ్లోబల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ స్పెషలిస్ట్ జాస్మిన్ బ్రాస్ వెల్ ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్ శనివారం వరకు కొనసాగనుంది. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, స్పెషల్ సెక్రటరీ శ్రీకృష్ణభాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.