చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడిరచారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట లో నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సహిత స్వచ్చంద సంస్థ నిర్వహకురాలు కల్పనా రమేష్ లతో కలిసి పరిశీలించారు. ఈ బావి పూర్తిగా చెత్త, వ్యర్దాలతో పూడిపోగా 6 నెలల పాటు శ్రమించి సహిత స్వచ్చంద సంస్థ, జీహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. ఈ బావికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకునేందుకు వారు పరిశీలించారు. బావిలోని చెత్త తొలగింపునకు ముందు ఉన్న పరిస్థతి, ప్రస్తుత పరిస్థితులను వివరించేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. హైదరాబాద్ కు చారిత్రక నగరంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, అనేక పురాతన కట్టడాలు ఈ నగరంలో ఉన్నాయన్నారు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలను పరిరక్షించి వాటికి పూర్వ వైభవం తీసుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ నగరంలో ఉన్న పురాతన కట్టడాలను గుర్తించి వాటి పునరుద్దరణ, పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారని తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే మోజం జాహి మార్కెట్ ను అభివృద్ధి చేయడం జరిగిందని, త్వరలోనే మోండా మార్కెట్, మీరాలం మండి, సర్దార్ మహల్ తదితర పురాతన నిర్మాణాలను పునరుద్దరించనున్నట్లు తెలిపారు.