హైడ్రాతో భయాందోళనలకు గురిచేయొద్దు: కూనంనేని
విశాలాంధ్ర- హైదరాబాద్: హైడ్రా పేరుతో పేదలను భయాందోళనలకు గురిచేయడం తగదని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వరంగల్‌లోని పోచమ్మ మైదాన్ ఆవరణలోని అబ్నూస్ ఫంక్షన్ హాల్‌లో పార్టీ జిల్లా సమితి అధ్వర్యంలో పేదల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలంటూ మంగళవారం సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కే బాషామియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కూనంనేని మాట్లాడుతూ… అక్రమంగా ఆక్రమించిన పెద్దల కట్టడాలను కూల్చాలని, పేద, మధ్య తరగతి వర్గాలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పరిరక్షించాల్సిన స్థలాలలో పేదల నివాసాలు ఉంటే వారికి ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్న భూములను పరిరక్షించి పేదల పరం చేసిన ఘనత సీపీఐదని, తాము లక్షలాది మందికి ఇళ్ల స్థలాలను ఇప్పించామని అన్నారు. హైడ్రా… రాష్ట్రంలో ఎక్కడికి వచ్చినా పేదలు అడ్డుకుంటారని హెచ్చరించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గుడిసె వాసులకు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చారని, హైడ్రా పేరుతో ఆందోళన చెందుతున్న పేదలకు భరోసా ఇవ్వాలని సూచించారు. పేదలు ఎక్కడ ఇబ్బంది పడినా ఎర్రజెండా అండగా ఉంటుందని చెప్పారు. పేదల విషయములో బీఆర్‌ఎస్, బీజేపీనేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములను భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కాపాడి పేదల ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసింది సీపీఐ పోరాటాల వల్లనే నని ఆపార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. 40 ఏళ్ల క్రితమే కాళిదాసు నేతృత్వంలో భూపేష్ నగర్ లో పేదలకు ఇళ్ల స్థలాలను ఇప్పించామని వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేదునూరి జ్యోతి, కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేష్, అశోక్ స్టాలిన్, జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్, బుస్సా రవీందర్, గన్నారపు రమేష్, దండు లక్ష్మణ్, అక్కపెల్లి రమేష్, గుండె బద్రి, సంగి ఎలేందర్, తోట చంద్రకళ, వీరగోని శంకరయ్య, ఆరేళ్లి రవి, ల్యాదెళ్ల శరత్, జన్ను రవి, కె. చెన్నకేశవులు, గోవర్దనా చారి పాల్గొన్నారు.