పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై శనివారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అఖిల పక్ష నేతలు, జిల్లా అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. పోడు సమస్యకు ఓ ముగింపు పలకాలనే కృతనిశ్చయంతో సీయం కేసీఆర్ ఉన్నారని, దీనికి అఖిల పక్ష నేతలు కూడా సహకరించాలని కోరారు. నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు పోడు వ్యవసాయం చేస్తున్నగిరిజనులు, తదితరుల నుండి క్లెయిమ్స్ స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో నవంబర్ 8 లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్వోఎఫ్‌ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకటన్నారు.ఈ ప్రాంతంలో అటవీ భూమి ఎక్కువగా ఉన్న క్రమంలో వాటిని కాపాడటంతోపాటు సమస్యను ప్రజలకు వివరించి, సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ఎవరెవరు పోడు వ్యవసాయం చేస్తున్నారనే వివరాలు పకడ్బందీగా సేకరించాలని తెలిపారు. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.సమగ్ర అధ్యయనం తర్వాతే సీయం కేసీఆర్ నిర్ణయం మేరకు అర్హులకు భూములపై హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు. .ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, జడ్పీ చైర్ పర్సన్ కె, విజయలక్ష్మిరెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, అఖిల పక్ష నేతలు, జిల్లా అటవీ, గిరిజన, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.